నవ్వు నవ్వే:- - యామిజాల జగదీశ్
 “నేను బతకడానికి ఒక విదూషకుడిలా పని చేశాను... సంవత్సరాలుగా నవ్వని వ్యక్తినైన నేను ఇతరులను నవ్విస్తూ వచ్చాను....” అన్నారు సామ్యూల్ హెర్రెరా.
"నాకు 26 ఏళ్లు. చిరిగిన చొక్కా జేబు. రబ్బరు ముక్కు తగిలించుకుని ఎలా నవ్వించాలో చదువుకున్నాను. ఈ క్రమంలో జీవితం నాకు అన్ని వేదికలకు కర్టెన్లు ఉండవని నేర్పింది.
నేను సాదా సీదా హాస్టళ్లలో పడుకున్నాను. బహిరంగ ప్రదేశాలలో మేకప్ వేసుకున్నాను. అనేక చోట్ల ప్రదర్శనలిచ్చాను. ఆసుపత్రులు, ప్లాజాలు, పుట్టినరోజు పార్టీలు....ఒకటేమిటి, ఇలా ఎన్నో చోట్ల ప్రదర్శనలిచ్చాను.
నా ప్రదర్శనలను చూసి వందల మందిని వేల మందిని నవ్విస్తూ వస్తున్నాను.
ఓ రోజు మధ్యాహ్నం, నాకు ఒక నర్సింగ్ హోమ్ నుండి కాల్ వచ్చింది.
సంవత్సరాలుగా మాట్లాడని ఒక మహిళ ఇక్కడ ఉంది...మీరిక్కడికి రావాలి. ఆమెను నవ్వించాలి అని.
వెంటనే అక్కడికి వెళ్ళాను. 
ఆమెను చూశాను. కదలక మెదలక   కూర్చుంది. ముఖాన ఎలాంటి జీవమూ లేదు.
నేను నాట్యం చేసాను...కుప్పిగంతులు వేశాను. జోకులు చెప్పాను, కల్పిత పాటలు పాడాను. అయినా ఆమెలో చలనం లేదు.
కానీ నేను నా ముక్కు ఆమె సూప్‌లో పడినట్లు నటించినప్పుడు, ఆమె పెదవులపై సన్నగా ఓ కదలిక చూశాను. అది ఒక చిరునవ్వు.
చిన్న నవ్వే కానీ అది జీవమున్న నువ్వు. నిజమైన నవ్వు.
నర్సుల కళ్ళు చెమ్మగిల్లాయి.‌నా కళ్ళు తడిశాయి. 
ఆ క్షణంలో, నేను గ్రహించాను: నేను కేవలం విదూషకుడిని కాదు...
నేను ఒక వారధి అని.
ఇప్పుడు, నేను జైళ్లు, మానసిక ఆసుపత్రులు, ఆశ్రమాలను సందర్శించి అక్కడి వారిని చైతన్యపరిచే ఓ బృందాన్ని నడుపుతున్నాను.
కొన్నిసార్లు మనకు చప్పట్లు వస్తాయి. కొన్నిసార్లు మనకు చప్పట్లు రావు.
కానీ మనం ఎల్లప్పుడూ కనిపించని దాన్ని స్పృశిస్తాం.
నవ్వు, నొప్పించని నవ్వు, అవహేళన లేని నిష్కళంక నవ్వు ఎటువంటి వారిలోనైనా మార్పు తీసుకువస్తుందని గ్రహించాను. నువ్వు సామాన్యమైనది కాదు...నవ్వుకో శక్తి ఉంది..."అని అని అనుభవ పుస్తకంలోని మాటల్ని చదివి వినిపించాడు సామ్యూల్ హెర్రెరా.

కామెంట్‌లు