థామస్ ఎడిసన్ మాటలు హెన్రీ ఫోర్డ్ జీవితాన్ని ఊహాతీతంగా మార్చాయి. :- - యామిజాల జగదీశ్
 1896లో, విద్యుత్ బల్బును కనిపెట్టడం ద్వారా అప్పటికే ప్రసిద్ధి చెందిన థామస్ ఎడిసన్, విద్యుత్ శక్తితో నడిచే కారును తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆ సమయంలో అతను తన కంపెనీలో గ్యాసోలిన్ - శక్తితో నడిచే నమూనాను సృష్టించిన యువ ఉద్యోగి గురించి విన్నాడు.
ఆ యువకుడు మరెవరో కాదు, అతనే హెన్రీ ఫోర్డ్!
న్యూయార్క్‌లో జరిగిన ఒక కంపెనీ పార్టీలో, ఎడిసన్ ఫోర్డ్‌ను కలిసి అతని ఆలోచనను విన్నాడు. అప్పుడు, అతని కళ్ళలో మెరుపుతో, ఎడిసన్
“యువకుడా, అంతే! నీకు అర్థమైంది!
నువ్వు సరైన మార్గంలో ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఆ దిశలోనే కొనసాగు!” అని అన్నాడు.
ఆ మాటలు ఫోర్డుని ప్రభావితం చేశాయి. 
ఎడిసన్ తనపై ఉంచిన నమ్మకంతో, ఫోర్డ్ ముందుకు సాగాడు. అతను అభివృద్ధి చేసిన గ్యాసోలిన్-శక్తితో నడిచే కారు ప్రపంచాన్ని మార్చి వేసింది. ఇది అతన్ని చరిత్రలో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకడిగా నిలిపింది.
కానీ కథ అక్కడితో ముగియలేదు.
1914లో, ఎడిసన్ 67 ఏళ్ల వయసులో, ఒక భారీ అగ్నిప్రమాదం అతని ప్రయోగశాలను, కర్మాగారాన్ని ధ్వంసం చేసింది. భారీ నష్టం జరిగింది. పైగా బీమా ఆసరా కూడా లేదు.
అప్పుడే ఫోర్డ్ తన వంతు సహకారం అందించాడు. 
అతను ఎడిసన్‌కు 750,000 డాలర్లకు చెక్కును ఇచ్చాడు. 
రెండు సంవత్సరాల తరువాత, ఫోర్డ్ ఎడిసన్ ఇంటికి పక్కనే ఉన్న ఇంటికి మారాడు. ఎడిసన్ వీల్‌చైర్‌కే పరిమితమైనప్పుడు, ఫోర్డ్ కూడా ఒక వీల్‌చైర్‌ను కలిగి ఉన్నాడు. వారి మధ్య బంధం వొట్టి స్నేహమే కాదు.
నమ్మకం, దాతృత్వం, పరస్పర గౌరవం మీద సాగిన గొప్ప వారసత్వం. పరస్పర ప్రోత్సాహం నిజాయితీ అనే మాటకు అద్దం పట్టింది. మంచి భవిష్యత్తును ప్రేరేపించగలదని రుజువు చేసింది.
ఒక రోజు చేసిన మంచి పని భవిష్యత్తులో మనం ఊహించని విధంగా చేయందిస్తుందనడానికి వీరి మధ్య బంధం ఒక చక్కటి ఉదాహరణ.

కామెంట్‌లు