అలల కదలికలలో
అందాలు పొదిగే
అపరంజి జిలుగుల
అలరారు కాంతులేవో!
చిరు మెలికలతో
చిందేయు జలముల
చిన్ని ఒంపులలో మెరియు
జలతారు వెలుగులేవో!
తొలి కిరణాల తాకిడితో
నులివెచ్చని మమత పొంగి
చలి వదలిన చెరువులోన
తెలి వన్నెల మెరుపులేవో!
తళ తళా కాంతులతో
మిలమిలా మెరుపులతో
కలకలా సవ్వడుల
గలగలల రాగాల సడులేవో!
ఉదయగిరుల మధ్యన
ఉదయించు వేలుపు
హృదయాలలో నింపు
మోదముల మోపుల మూటలేవో!
కలకన్న సౌఖ్యములివ్వ
అల నీలి గగనాన
పాల మబ్బుల పల్లకి ఎక్కి
ఇలకు దిగివచ్చు ఇనుడికి...
జలతరంగిణులే సన్నాయిగా
తలపు లోని భక్తి నీరాజనముగా
కరతలమున నీరు దొరల నింపి
ధరాతలమునకు స్వాగతమంటూ
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి