అదొక ఆనందం:- - యామిజాల జగదీశ్
 ఇప్పుడు ఏ ఇంట్లోనూ సూదిలో దారం ఎక్కించే సన్నివేశం  కనిపించడం లేదు.
గతంలోనైతే, దాదాపుగా ప్రతి ఇంట్లోనూ పాత చాక్లెట్ డబ్బా ఉండేది. అందులో సూది, దారం ఇలా కుట్టడానికి కావలసినవి ఉండేవి. ప్రెస్ బటన్, పురుషుల చొక్కాల కోసం నైలాన్ దారంతో సహా.
ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ సూదిలో దారం ఎక్కించేసేవారు. అంటే సూది బెజ్జంలో ఎంతలా దారం ఎక్కించే వారో. అదీ ఓ కళే. సూదిని ఎడమ చేత్తో పట్టుకునేవారు. దారం యొక్క కొసకు ఉమ్మితో తడి చేసి సూదిలోకి దారం పోనిచ్చే తీరు చూసి తీరాలి.
నేను నా చిరిగిన చొక్కాను కుట్టడం, అలాగే బటన్లను కుట్టుకోవడం, అప్పుడప్పుడూ వేలుకి సూది గుచ్చుకోవడం, చివుక్కుమనడం, రక్తం రావడం, అప్పుడా వేలు నోట్లో పెట్టుకోవడం ఇలాంటివన్నీ సర్వసహజం. ఇలా బటన్లూ చిరిగిన చోట కుట్టేటప్పుడు నేనే మొత్తం చొక్కా కుట్టినట్లు ఓ ఫీలు. అప్పుడు కలిగే ఆనందమే వేరు. 
ఈరోజుల్లో ఎవరూ చిరిగిన బట్టలు కుట్టడమనేదే లేదు.‌ ఒకవేళ ఆ అలవాటున్నా అది బహు అరుదు.‌ అపూర్వం. చొక్కా చిరిగితే వేసుకోరు. వారు చిరిగినప్పుడు చుట్ట చుట్టి పారేస్తారు కదూ.

కామెంట్‌లు