ఎవరెలా అనుకుంటే అలా:- - యామిజాల జగదీశ్

 ఒకరోజు, ఒక గోపిక "వెన్న దొంగ" కృష్ణుడిని తోటలోని ఓ చెట్టుకి కట్టి యశోదమ్మ వద్దకు వెళ్ళింది.
"ఇదిగోనమ్మా యశోదమ్మా ! నీ కొడుకు అల్లరి భరించి లేకపోతున్నాను. పాలూ పెరుగూ వెన్నెలా ఎక్కడో దాచుకోవాలో తెలీడం లేదు. ఎంత ఎత్తున దాచినా లాగించేస్తున్నాడు. ఇవాళ మాటువేసి పట్టుకుని పెరట్లో చెట్టుకి కట్టేశాను. నువ్వు వచ్చి వాడిని ఎలా శిక్షిస్తావో చూస్తాను. వెంటనే నాతో రా..." అని యశోదను తొందర పెట్టింది గోపిక. 
"మా కృష్ణుడు నువ్వనుకునేంత దుష్టుడేమీ కాదు.‌ అల్లరి చేస్తే చేయొచ్చేమో కానీ మా కన్నయ్య అల్లరి చూస్తుంటే వేయి కళ్ళు చాలవు తెలుసా...సరే పదా...చెట్టుకి కట్టేసే నన్నావుగా...వాడి సంగతేంటో చూస్తాను. వాడే తప్పూ చేయడు. నీకు వాడంటే అసూయ..." అంటూ యశోదమ్మ గోపికతో కలిసి తోటకు బయలుదేరింది.
"చూడు, నీ కొడుకు మా ఇంటి తలుపు పగలగొట్టి, లోపలికి వెళ్ళి వెన్న తిన్న లక్షణం చూడు" అని యశోదకు చూపించింది గోపిక. 
"సరే గానీ  ఏడీ మా కన్నయ్య" అంటున్న యశోదను చేయి పట్టుకుని చరచరా తోటలోకి తీసుకుపోయింది గోపిక.
తీరా గోపిక చెట్టుకు కట్టిన చోట కృష్ణుడు లేడు. అంతేకాదు, అక్కడ ముద్దుగా బొద్దుగా ఓ దూడ వుంది. గోపిక సిగ్గుతో తలదించుకుంది. బాలకృష్ణుడిని శిక్షించాలని వచ్చిన యశోద దూడను చూసి "ఎంత బాగుందో దూడ...మా కృష్ణుడు దీనిని చూస్తే వదిలడు కానీ ఇంతకూ నా కృష్ణుడిని ఏం చేశావు..." అని ఆత్రుతగా అడిగింది. 
"ఏమో తెలీడం లేదే...ఈ చెట్టుకే కట్టానమ్మా...కట్టిన కుట్టు విప్పుకుని ఎటు పారిపోయాడో" అని గోపిక అంటుంటే యశోద ఊరుకుంటుందా?
"చూసేవా చూసేవా..ఇప్పుడేమో ఏమీ తెలునట్లు మాట్లాడుతున్నావు.....ఇక్కడ అందరూ నా కొడుకు మీద ఉన్నవీ లేనివీ చెప్తున్న వాళ్ళే....‌ మా కృష్ణుడు బుజ్జి కృష్ణుడు. వారెంత అమాయకుడో.‌‌ వాడు మీరందరూ అనుకునేట్టు దొంగ కృష్ణుడు కాదు.‌ మా కృష్ణుడు ముద్దుల కృష్ణుడు. అందాల కృష్ణుడు. అందుకే మీకందరికీ వాడంటే అసూయ. ఉన్నవీ లేనివీ చెప్పి వాడిని తిట్టి కొట్టించాలనుకుంటారు. ఇప్పటికైనా చాడీలు చెప్పడం మానండి..." అని  తన కొడుకు గురించి గర్వంగా చెప్పింది యశోద. 
యశోద మాటలతో కంగుతిన్న గోపిక "ఏంటిదీ...నేనే కదా వాడిని చెట్టుకు కట్టాను‌. కానీ వాడికి బదులు దూడ ఉండటమేంటీ" అని అయోమయంలో పడింది గోపిక‌. కృష్ణుడిని కొట్టించాలనుకున్న గోపిక ఢీలా పడింది. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అని లోలోపల బాధ పడింది.
యశోద అక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం గోపికకు దూడ ఉన్న చోట కృష్ణుడు కనిపించాడు. పైగా గోపికను చూసి ముసిముసి నవ్వులు నవ్వాడు. గోపిక అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఏమిటీ మాయ అనుకుంది. ఇదేంటీ, యశోద ఉన్నంతసేపూ దూడ కదా అక్కడ ఉంది... ఇప్పుడేమో కృష్ణుడు ఉండటమేంటీ...? ఏమిటిదంతా అని అనుకుంది.  ఏమిటీ వింత? ఏమిటీ విచిత్రం ? అని కృష్ణుడినే అడిగితే సరిపోతుందిగా అనుకున్న గోపిక “ఎందుకు, కృష్ణా, నిన్ను నువ్వు దూడగా మార్చుకోవడం తెలిసిన నీకు, కట్లు విప్పుకోవడం తెలీలేదా?” అని అడిగింది. 
అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి
"చెట్టుకు నన్ను కట్టింది నువ్వేగా. కనుక కట్లు విప్పాల్సిందీ నువ్వేగా. అంతేకానీ నేనెలా విప్పుకుంటాను?" అని అమాయకంగా అడిగాడు. 
అయినా అక్కడితో ఆగని కృష్ణుడు "మా అమ్మ యశోద భగవంతుడా! ఇక్కడ నా కొడుకు ఉండకూడదు అని దారి పొడవునా ప్రార్థించుకుంటూ వచ్చింది. మరి మా అమ్మనెలా బాధపెట్టను...అందుకే నేను దూడగా మారాను" అని అన్నాడు.
యశోదమ్మ తన ప్రేమ అనే తాడుతో కృష్ణుడిని కట్టేసింది.
గోపికలేమో తమ ఆరాధనభావంతో ప్రేమగా కృష్ణుడ్ని కట్టేసుకున్నారు. 
సహదేవుడు భక్తితో కృష్ణుడ్ని కట్టేశాడు. 
ఎవరెలా అనుకుంటే వారికలా బందీ అయినట్లు నటించాడు కృష్ణుడు. అతను జగన్నాటక సూత్రధారి. అతనికెవరు చెప్పగలరు పాఠాలు...అతను చెప్తే మనం  వినాలి తప్ప.
కృష్ణుడు స్నేహితుడనుకుంటే స్నేహితుడు. దూత అనుకుంటే దూత. ప్రేమికుడనుకుంటే ప్రేమికుడు.‌ రక్షకుడనుకుంటే రక్షకుడు. అంతెందుకు ఎవరెలా అనుకుంటే అలాటి వాడే కృష్ణుడు.

కామెంట్‌లు