స్వప్నంలో నిన్నటి జ్ఞానాన్ని ముద్దాడి
కుబుసం విడిచిన అజ్ఞానాన్ని ప్రసవించిన కాలాన్ని
కౌగిలించుకున్న మారువేషన్లోని మనిషి
మళ్లీ రేపటి ముసుగులో గుసగుసలాడుతుంటే
విజ్ఞానం గాలితో సంభాషిస్తుంది.!!
శూన్యం ముఖం ఇప్పుడిప్పుడే పచ్చిగా కళ్ళు తెరుస్తుంది.
రాత్రిలా బ్రమ కాదు పగలులా నిజం కాదు అది ఒక కాంతి స్వప్నం.
శూన్యం వెంట నడుచుకుంటూ వెళ్లే ఒక సాహస మాంత్రికుడిలా పాదయాత్ర చేస్తున్న మర్మంతను.
కళ్ళు విప్పి చూస్తే పచ్చి బాలింతరాలు ఒడిలో వెన్నెల కాసే చంద్రుడు సగం సగం ముక్కలుగా తెగిపడి అతుక్కున్నట్లు ముఖం నిండా మచ్చలతో వెలుగుతున్నాడు.
గతమంతా రక్తసిక్తమై పచ్చి మాంసం వాసనల అది కదులుతుంది.
ఆవులింతలతో కర్మ శ్రమ చేసి విశ్రాంతి తీసుకుంటుంటే కాసేపు మౌనం ముందు భవిష్యత్తు తలదించుకొని కూర్చుంది.
నిజంగానే నిన్నటి జ్ఞానం పొరలు పొరలుగా ఆకాశం అంతట మేఘాల్లా తేలిపోతుంది.
సముద్రాన్నించి తప్పించుకుని నిద్రలోకి జారుకున్న ఆవిరి కలలు కంటూ ఉంటే సర్పం ఒకటి కాటేసింది.
కలలో ప్రాణం కోల్పోయిన మేఘం గగనమంతా విషం కక్కుకొని కురిసింది.
పచ్చని చెట్లు వేయి తలల సర్పాలుగా పుట్టి భూమిని మింగేసింది.
భూమిపైకి దిగిన మేఘం ఇప్పుడిప్పుడే రక్తం కక్కుకుని చచ్చిపోయింది.
స్వప్నం వీడిన జ్ఞానం నిజంగానే భూమిని ముద్దాడింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి