పితృదేవుని దర్శనం…!:- కవి రత్న సాహిత్యధీర సహస్రకవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్

(ఫాదర్స్ డే సందర్భంగా...)

నీవు నివసించే గృహం...
ఆయన స్వప్న సౌధం..!

నీవు ధరించిన వస్త్రం...
ఆయన శ్రమశక్తికి చిహ్నం..!

నీవు తినే కంచం 
నీవు నిద్రించే మంచం
ఆయన కలల ప్రపంచం..!

నీవు చదివిన చదువు 
నీవు పొందిన ఉద్యోగం 
నీ వివాహ మహోత్సవం 
నీవు నిర్మించుకున్న జీవితం 
ఆయన త్యాగాల తోరణం...!
 
నీవు చూసే టీవీ...
ఆయన తపనల తెర...
నీవు కూర్చున్న కుర్చీ...
ఆయన కన్నీటి కంచె...
నీ చేతిలో సెల్ ఫోన్...
ఆయన శ్రమ రింగ్‌టోన్…
నీవు నడిపే ఖరీదైన కారు...
ఆయన కలల రథయాత్ర…
నీకు సేవలందించే కంప్యూటర్...
ఆయన మేధోమణిమయ మకుటం..!

ఒక్కసారి నీగుండెలపై 
చెయ్యేసి చెప్పు బిడ్డా..!
నీ మొదటి గురువు ఎవరో..?
నిత్యం నీతో నిలిచిన ఆ నీడ ఎవరో ..?
నీ ముందున్న ఆ ప్రత్యక్ష దైవం ఎవరో.. ?
నీ తప్పుల్ని దిద్దిన ఆతీర్థ యాత్రికుడెవరో?

నీ కాలేజీ ఫీజులకై 
"అప్పుల అగ్నిలో "దూకిందెవరో..?
నీ నవ్వులకోసం 
వెచ్చని కన్నీళ్లను త్రాగిందెవరో..?
నీ బంగారు భవిష్యత్తు 
చిత్రాన్ని శ్రమ కుంచెతో గీసిందెవరో..?

నలుగురిలో నీ గౌరవానికి 
సభ్య సమాజంలో 
నీ గుర్తింపుకు మూలమెవరో..?
నీవు విజయ శిఖరాలు చేరే 
దారిలో ఆరక వెలిగిన ఆ దీపమెవరో..?

ఒక్కసారి ఆంజనేయునివై
నీ గుండెను చీల్చిచూడు బిడ్డా... 
కోర్కెలు తీర్చే కోదండరామునిలా 
నీకు దర్శనమిచ్చేదెవరో..! ఇంకెవరు..? 
ఘనుడు త్యాగధనుడైన నీ కన్నతండ్రే...

అట్టి త్యాగమూర్తికి గుండెల్లో గుడికట్టి 
ఆయన పాదార విందాలకు మ్రొక్కి...
నిత్యం ప్రేమతో పూజించు...బిడ్డా...ఇక 
నీ జన్మ ధన్యమే నీకు దక్కు పుణ్యమే..!
 

కామెంట్‌లు