కణ్వ మహర్షి:- సి.హెచ్.ప్రతాప్
 ఆంగీరస వంశానికి చెందిన కణ్వ మహర్షి హిందూ సంస్కృతిలో విశిష్ట స్థానం పొందిన మహర్షి. ఘోరుడు అనే ఋషికి పుత్రుడిగా జన్మించిన ఈయన బ్రహ్మచర్య వ్రతంలో జీవితాంతం తపస్సునే ఆచరించిన తపోనిష్ఠ. మాలినీ నదీ తీరంలో తాను స్థాపించిన ఆశ్రమంలో తపస్సు చేస్తూ అనేక శిష్యులకు విద్యాబోధన చేశాడు. రుగ్వేదంలోని అనేక మంత్రాలకు కణ్వుడే ద్రష్టగా గుర్తించబడతాడు.
కణ్వుడు పురాణ ఖ్యాతికి శకుంతల పెంపకతండ్రిగా కూడా ప్రసిద్ధి. మేనక–విశ్వామిత్రుల ప్రేమ సంబంధంలో జన్మించిన శిశువును వారు అడవిలో వదిలి వెళ్ళినప్పుడు, పక్షులు ఆమెను కొంతకాలం పోషించాయి. ఆ పిల్లను కన్వుడు కనుగొని తన ఆశ్రమానికి తీసుకెళ్లి ‘శకుంతల’గా పేరు పెట్టాడు. ఆమెను తన కుమార్తెగా పెంచాడు. ఇదే కథ ఆధారంగా కాళిదాసు తన నాటక గ్రంధమైన “అభిజ్ఞాన శాకుంతలము”ను రచించాడు.
కణ్వ మహర్షి వేదాలు, ఉపనిషత్తుల జ్ఞానంలో ప్రావీణ్యం కలవాడు. సామవేద మంత్రాలలో దిట్ట. అతని ఆశ్రమం మాలినీ నదీ తీరాన విశాలంగా విస్తరించి ఉండేది. అక్కడ వేదఘోషలు నిత్యం వినిపించేవి. అగ్నిహోత్రాలు, వేదార్థ మీమాంసలు, శాస్త్రచర్చలు అక్కడి దినచర్యలు. పక్షులు గానం చేస్తుండగా, ఏనుగులు నీడలో నిలబడి వింటుండేవి. పిల్లులు, ఎలుకలు స్నేహంగా మహర్షులు పెట్టే పిండాలను నమ్మకంతో తినేవి.
ఇంతగా పవిత్రత కలిగిన ఆ ఆశ్రమానికి వచ్చిన రాజర్షులు, బ్రహ్మర్షులు కణ్వుని ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళరంటే, ఆయన పరమగౌరవ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. కణ్వ మహర్షిని “మునికుల చుడామణి”గా వర్ణిస్తారు — మునులందరిలో అతివిశిష్టుడిగా.
కృష్ణుడి అవతారకాలం, శ్రీరాముని వనవాసాంతం సమయంలో కూడా కణ్వుడి ప్రస్తావన వినిపించడం ఆయన యుగయుగాల ద్రష్టగా ఉండే విశిష్టతను సూచిస్తుంది. కశ్యప మహర్షి వంశంలో పుట్టినందున కణ్వుడిని 'కశ్యప' అని కూడా కొందరు పిలుస్తారు.

ఇంతటి మహానుభావుడైన కణ్వ మహర్షి ఆశ్రమ జీవితం, తపస్సు, వేద పరిజ్ఞానం మన సంస్కృతికీ ధార్మిక చైతన్యానికీ దారితీసే వెలకట్టలేని వారసత్వం

కామెంట్‌లు