యాచన : సరికొండ శ్రీనివాసరాజు

 విద్యార్థులకు పరీక్షలు మొదలు అయ్యాయి. తెలుగు పరీక్ష జరుగుతుంది. మాలిని చదువులో చాలా వెనుకబడి ఉంది. ఇంటివద్ద మొబైల్ ఫోన్లు, టీవీతోనే ఆమె కాలక్షేపం.  అందుకే చదువు రాదు. గీతాంజలి మొదటి ర్యాంకు విద్యార్థిని.  గీతాంజలి వెనుక మాలిని కూర్చుంది.  "గీతా! నువ్వు చాలా మంచిదానివి.  నువ్వు రాస్తున్న జవాబులు నాకు చూపించవా!" అని బతిమాలింది. గీతాంజలి పట్టించుకోలేదు. "మొదటి పాఠంలో ఏముంది? ఒక రాజు డేగ ప్రమాదం నుంచి పావురాన్ని రక్షించడం కోసం డేగకు తన మాంసాన్నే కోసి ఇచ్చాడు కదా! నువ్వు ఏం విన్నావు పాఠం? విని ఏమి నేర్చుకున్నావు? నా కోసం పరీక్షలో ఈ త్యాగం కూడా చేయలేవా?" అన్నది మాలిని. ఇంతకీ  ఆ దానగుణం కలిగిన రాజు పేరేమిటి?" అని అడిగింది గీతాంజలి. మాలిని సమాధానం చెప్పలేకపోయింది.
     ఇదంతా ఆ పరీక్ష హాలులో వీరికి తెలియకుండా ఇదంతా వింటున్న ఉపాధ్యాయుడు పాండురంగ ఇలా అన్నారు. "శభాష్! పాఠం బాగా అర్థం చేసుకున్నావు. నీకు అనుకూలంగా మార్చుకున్నావు.  అంతంత మాత్రం శ్రద్ధతో విన్నావు.  పూర్తి శ్రద్ధ ఉపాధ్యాయులు చెప్పే పాఠాల మీద పెడితే ఇలా ఇంకొకరిని యాచించే ఖర్మ పట్టేది కాదు కదా!" అని. మాలిని సిగ్గుతో తల వంచుకుంది.

కామెంట్‌లు