అంగీరస మహర్షి :-సి.హెచ్.ప్రతాప్
 అంగీరస మహర్షి బ్రహ్మసృష్టిలో ప్రథములైన ఋషుల్లో ఒకడు. శ్రీహరి నాభికమలమునుండి ఉద్భవించిన బ్రహ్మకు సంతానంగా అంగీరసుడు జన్మించాడు. తండ్రి బ్రహ్మఆజ్ఞ ప్రకారం అంగీరసుడు తపస్సునకు నిష్టగా లగ్నమయ్యాడు. దివ్య తేజోమయుడైన అంగీరసుడు తపశ్శక్తితో తన తేజస్సును మరింత పెంపొందించుకున్నాడు. అన్ని శక్తులూ అతనికి లభించినప్పటికీ, అతడు అహంకారాన్ని వదిలి, నిరహంకార జీవనానికి పరిపాటిగా జీవించాడు. త్యాగంలోనే పరమానందం ఉందని గ్రహించి, సర్వసంగ పరిత్యాగాన్ని ఆచరించాడు.
అంగీరసుడు ధర్మబోధకుడిగా పేరు పొందినవాడు. అతని బోధనలే “అంగీరసస్మృతి”గా ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రంథంలో ధర్మం, నైతికత, సమాజంలో జీవించాల్సిన విధానాలపై విలక్షణమైన దృక్పథాన్ని వెల్లడించారు. అందుకే అతడు స్మృతికర్తలలో ఒకడిగా గౌరవింపబడతాడు.
అంగీరసులు అధర్వణ వేద ద్రష్టలుగా ప్రసిద్ధి. అధర్వణ వేదంలో యజ్ఞాలు, తంత్రాలు, ఉపాసనలు, ఆరోగ్యం వంటి అనేక అంశాలను అంగీరసులు ప్రచారం చేశారు. వారు చేసిన యజ్ఞఫలాలను భూలోకవాసులకు ధారపోసారు. వారు ధర్మపరులైన యజ్ఞకర్తలు, దేవతాతుల్యులుగా భావించబడ్డారు. ఆదిత్యులుగా కూడా వారికి విశిష్ట స్థానం ఉంది.
బ్రహ్మసృష్టిలో అంగీరసులు మొదటివారిగా పరిగణించబడ్డారు. వారు రాజులకు పురోహితులుగా ఉండి ధర్మబోధనతో పాలనను శాస్త్రీయంగా మారుస్తూ, సంస్కృతిని కాపాడే పాత్ర పోషించారు. ఉపనిషత్తులలోనూ అంగీరస మహర్షికి విశిష్ట స్థానం కలదు. ముండకోపనిషత్తులో అంగీరసుడు శౌనక మహర్షికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంగీరస మహర్షి ఓంకార తత్త్వాన్ని విశదీకరించి చెప్పినవాడు. అతడు గృహస్థుడిగానే కాక, పరమజ్ఞానిని కూడా. అందుకే ఆయనను సప్తర్షుల్లో ఒకరిగా ప్రస్తావించబడతాడు. మానవ జీవన ధోరణిని నిర్దేశిస్తూ రచించిన స్మృతిగ్రంథాల్లో “అంగీరసస్మృతి” ప్రత్యేక స్థానం పొందింది.
ఈ విధంగా అంగీరస మహర్షి అనేక రంగాల్లో తన మేధస్సును చాటిన తపోనిష్టుడుగా, ధర్మబోధకుడిగా, వేదద్రష్టగా మన పూర్వీకుల గౌరవాన్ని పొందిన ఋషిశ్రేష్ఠుడు.


కామెంట్‌లు