న్యాయాలు -888
కోటిశో దృశ్యమా నోపబృంహణ న్యాయము
****
కోటిశో అనగా కోట్ల కొలది.దృశ్యమాన అనగా చూడగలిగే, కనిపించే.ఉప అనగా దగ్గరగా, తక్కువ, కింద.బృంహణ అనగా వృద్ధి చేయడం,నిర్మించడం,పోషించడం, బలోపేతం చేయడం అనే అర్థాలు ఉన్నాయి.
కనబడని వస్తువు ఎంత పెద్దదిగా ఉన్నదని అయినా అనుకోవచ్చు.అది కనబడితే మాత్రము అది ఇంత ఉన్నది అని పరిమితి పొందుతుంది.
ఇలాంటి అనుభవాలు మనకు తరచూ ఎదురవుతూ వుంటాయి . అంత వరకూ తెలియని వ్యక్తులను కలవబోతున్నప్పుడు ఏదేదో ఊహించుకుంటాం. మాటలు, రాతలను బట్టి ఆ వ్యక్తి ఇలా ఉండొచ్చు,అలా ఉండొచ్చు అని మనో ఫలకంపై ఆ వ్యక్తి ఊహా చిత్రాన్ని ముద్రించుకుంటాం. కాకిలా ఉంటాడని ఊహిస్తే కోకిల వలెనో, ఒడ్డూ పొడవును అతి మామూలుగా ఊహిస్తే అంచనాలకు మించిగానో,... ఇలా మన ఊహలను, అంచనాలు తారుమారయ్యేలా కనబడితే .కొద్దిసేపు మనసు నిజాన్ని ఒప్పుకోవడానికి యిబ్బంది పడుతుంది. అయితే కనబడిన తర్వాత వెను వెంటనే మనసు అల్ట్రా స్కాన్ తీసి ఆ వ్యక్తిని ఒకానొక వ్యక్తిత్వపు గాటన కట్టేస్తుంది.
ఇక వస్తువుల విషయంలో కూడా ఇదే విధంగా ఊహించడమో,అంచనా వేయడమో జరుగుతుంది. కనబడిన తర్వాత ఒక ఖచ్చితంగా అభిప్రాయానికి వస్తాం.దానిని ఖచ్చితమైన లెక్కలతో సహా చెప్పేందుకు వీలు కలుగుతుంది.
ఆ విధంగా ప్రదేశాలు కూడా. వాటికి, కొలతలు, లెక్కలు, చారిత్రక నేపథ్యం మొదలైనవి చూసిన తరువాత స్మరణలోకి తెచ్చుకుంటాం.
దీనికి సంబంధించి చక్కని ఉదాహరణ ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఎవరెస్ట్ శిఖరమే. దానిని ఎక్కక ముందు శాస్త్రవేత్తలు కేవలం ఇంతుంటుందని,అంత ఉంటుందని ఊహించారు.కానీ శాస్త్రీయంగా ఆలోచించిన మీదట, అధిరోహించిన దానిని బట్టి ఖచ్చితంగా ఇంత ఎత్తు ఉందని చెప్పగలిగారు.
అయితే ఇలా ఇంకా ఏవైనా కనబడితే ఖచ్చితంగా చెప్పగలమా! అంటే చెప్పలేమనే చెప్పాలి.మన కంటికి కనిపించే కాంతి, ఆకాశం,విశ్వం గురించి చెప్పేది, తెలిసింది చాలా కొంచమే. మన జ్ఞానేంద్రియాల స్పర్శకు అందనివి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. విశాల విశ్వంలో నక్షత్ర గోళాలు,క్షీర సాగరాలు మొదలైనవి బిలియన్ల కొద్దీ ఉన్నాయి.అందుకే మన ఊహల్లో, వాస్తవంలో ఏదైనా అంశాన్ని గురించి మనకంతా తెలుసు,"అన్నీ తెలుసు అనే అహం మాత్రం అసలే వద్దు" అంటారు మన పెద్దలు
ఇక దీనికి సంబంధించి మరో ఉదాహరణ చూద్దాం.
సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ సూర్య శక్తి కేవలం ఒక్క వెలుగు రూపంలోనే కాకుండా అనేక ఇతర రూపాలలో బహిర్గతం అవుతూ ఉంటుంది.వేడిరూపంలోనూ, వెలుగు రూపం లోనూ ఉన్న శక్తి గురించి మనందరికీ తెలుసు.ఎండలో కూర్చున్నప్పుడు వెలుగు,వేడీ రెంటినీ అనుభూతిస్తూ ఉంటాం కదా! అయితే ఇవి రెండే సూర్యుని శక్తులు కావు.అనేక అదృశ్య రూపాలలో కూడా ఉంటుంది.
తెల్లని శరీరం కలవారు ఎక్కువ సేపు సూర్యరశ్మిలో ఉంటే నల్లగా కమిలిపోవడం చూస్తుంటాం. మరి దానికి కారణం సూర్యుని లోని అతినీలలోహిత కిరణాల ప్రభావం. ఇంకా తేలికైన ఉదాహరణ ఏమిటంటే మన ఇళ్ళల్లో ఉన్న "మైక్రోవేవ్ ఒవెన్" ఇందులో చల్లని పదార్థాలు వేడి చేసుకొని తింటుంటాం.ఇది కూడా కాంతి యొక్క రూపాంతరం అని చెప్పవచ్చు.
ఇలా ఒక వ్యక్తి కనబడినప్పటికీ మనకు దృగ్గోచరం కానీ అనేక లక్షణాలు అతడిలో ఉంటాయి.
ఏది ఏమైనా ఈ "కోటిశో దృశ్యమా నోపబృంహణ న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఊహ వేరు,వాస్తవం వేరు. వాస్తవంలో చాలా వరకు ఖచ్చితత్వం ఉంటుంది.
చూడకుండా తెలుసుకోవలసిన విషయాలు, అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ,ఏదైనా సరే చూడకుండా కోట్ల కొలది రెట్లు ఊహించుకోవడం కంటే చూసి ఒక ఖచ్చితమైన అవగాహనకు రావడం మంచిది అనేదే ఈ న్యాయము లోని అంతరార్థము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి