సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-911
మౌనం పండిత లక్షణమ్ న్యాయము
*****
మౌనం అనగా నిశ్శబ్దం, మాటలు లేని స్థితి, నిశ్శబ్దంగా ఉండటం, మాటలాడక పోవడం, వాక్కును నియంత్రించడం.పండితుడు అనగా చదువరి, ధీమంతుడు, పఠి,ప్రజ్ఞానుడు, ప్రజ్ఞావంతుడు. లక్షణమ్ అనగా పద్దతి,రీతి,మంచి చెడుల భావన అనే అర్థాలు ఉన్నాయి.
ఊరకుండటమే పండితుని లక్షణము.మౌనం ప్రజ్ఞస్య భూషణం అని కూడా అంటారు. అనగా మౌనం అనేది ఒక ఉన్నత విద్యావంతునికి ఆభరణం లాంటిది అనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 మౌనాన్ని అత్యున్నత ధర్మంగా కూడా భావిస్తారు. మాట్లాడడానికి కుదరని చోట మౌనమే అత్యున్నత  అత్యున్నత ధర్మంగా నిలుస్తుంది.
 "చిత్త నిశ్చయ రూపాత్మా మౌన శబ్దేన స స్మృతః అనగా ఎవరి మనసు స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంటుందో అతను ఎల్లప్పుడూ మౌనంగా ఉంటాడు అని అర్థము.
 మౌనం వల్ల అత్యంత వివాదాస్పదమైన సంఘటనలు కూడా సద్దుమణుగుతాయి. మాటకు మాట తెగులు అంటారు కదా! మాటకు మాట తీవ్ర ప్రతి స్పందన లేనట్లయితే  అనగా ఎంత పెద్ద గొడవ అయినా ప్రతిపక్షం మౌనం వహిస్తే   గొడవ అంతటితో సమసిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే 'మౌనేన కలహం నాస్తి " అంటారు.
దీనినే మొత్తంగా  "కృషితో నాస్తి దుర్భిక్షం,జపతో నాస్తి పాతకమ్/ మౌనేన కలహం నాస్తి,నాస్తి జగరతో భయమ్. అంటారు"
అనగా కృషి చేసే వారికి కరువు వుండదు.  జపము చేసే వారికి కలహం ఉండదు. మౌనంగా ఉండేవారికి కలహాలు ఉండవు.జాగ్రత్తగా ఉండే వారికి భయం ఉండదు అని భావము.
 మౌనం అనగా మూగిమొద్దులా ఉండటం కాదు. ఏం జరుగుతున్నా పట్టించుకోక పోవడం అంతకన్నా కాదు. ఏదైనా ఉద్రిక్తత కలిగించే సంఘటనలు జరిగినప్పుడు  ఆవేదనతో పాటు ఆవేశం పెల్లుబుకుతుంది. అలాంటి సమయంలో వివేకాన్ని, విచక్షణను కోల్పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తీవ్రత తగ్గుతుంది.  అప్పటి వరకు అరిచి గీ పెట్టిన ఎదుటి వ్యక్తే  ఏం చేయాలో తోచక ఆలోచనలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది.తత్ఫలితంగా  సమస్య తీవ్రత తగ్గుతుంది. మానవ సంబంధాలు మెరుగు పడటానికి దారులు సుగమం అవుతాయి. అందుకే మౌనం పండితుల లక్షణం అని అంటారు. పండితులు తమ సమయాన్ని శుష్క సంభాషణలతో వృధా చేసుకోరు. అనవసరంగా భావోద్వేగాలకు లోను కారు.
 మౌనంగా ఉండే పండితుని హృదయం ఎల్లప్పుడూ విశాలంగా ఉంటుంది. అంతః ప్రపంచం పెరుగుతుంది. తాను చేయబోయే ప్రతి పని,తీసుకునే ప్రతి నిర్ణయము ఎంతో వివేచన, విజ్ఞతతో కూడి ఉంటుంది.
  మౌనం విలువ, గొప్పతనం పండితులకు, మహనీయులకు బాగా తెలుసు. కాబట్టే  వారు తరచూ మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. గాంధీజీ వారానికి ఒక రోజు మౌనాన్ని వ్రతంగా చేసే వారు. "వేల మాటల్తో మెప్పించలేని విషయాన్ని  ఒక్క చూపుతో చెప్పవచ్చు. అలాగే వేయి చూపులతో చెప్పలేని భావాన్ని ఒక్క మౌనంతో చెప్పవచ్చని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారైన రవి శంకర్ గారు అంటుంటారు.
అలాగే మెహర్ బాబా ఏమంటారంటే మాట మౌనం దాల్చినప్పుడు మనసు మాట్లాడుతుంది.అలాగే మనసు మౌనంగా ఉన్నప్పుడు  హృదయం మాట్లాడుతుంది.హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతి చెందుతుందని చెప్పారు. 
ఇక గురుదేవులైన రమణ మహర్షి పదాల ప్రతి బంధకాలు లేకుండా నిశ్శబ్దంగా సంభాషించడమే మౌనం అంటారు.
 ఇలా ఏ పండితుడైనా, పామరుడైనా  ఎవరైనా సరే సరే మౌనాన్ని  నిధిగా భావించి అవసరం మేరకు ఉపయోగించుకుంటే ఈ లోకంలో తగాదాలు, కలహాలు ఉండవు. అంతటా శాంతి పావురాలు సంతోషంగా చరిస్తాయి.

కామెంట్‌లు