(నాగార్జునసాగర్ టు శ్రీశైలం విహారయాత్ర)
వరుస సెలవులు కావడంతో మా కుటుంబం నల్గొండ నుండి డిసెంబర్ 26న ఉదయం 6 గంటలకు బయలుదేరి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని నల్లగొండ వైపు లాంచీ స్టేషన్ కు ఉదయం 8-00 గంటలకు చేరుకోవడం జరిగింది. అంతకుముందే ఆన్లైన్లో (పెద్దలకు 1000/-, చిన్న లకు 800/-) బుక్ చేసిన టికెట్ల వివరాలు స్టేషన్ మేనేజర్ కు చూపించి, అప్పటికే సిద్ధంగా ఉన్న "పాల్గుణి "అనే స్టీమర్ ఎక్కి కూసున్నాం. సరిగ్గా 9 గంటల 10 నిమిషాలకు సాగర్ నుండి శ్రీశైలానికి 190 కిలోమీటర్లు పైగా కృష్ణానది మార్గం ద్వారా లాంచీ బయలుదేరింది. అందులో సుమారుగా 80 మందికి పైగా ప్రయాణికులుగా ఉన్నాము. నిజానికి 150మంది వరకు ఆ లాంచీ కెపాసిటీ. స్టేషన్ మేనేజర్ హరి కూడా మాతోపాటే వచ్చారు.
అలా అచ్చమైన కృష్ణమ్మ పరవళ్లు మీదినుండి ప్రయాణం చేస్తుంటే మనుషులో ఎక్కడలేని అనుభూతి, ఆనందము కలిగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కుటుంబ సభ్యులతో ఒకరి కొకరు పలకరింపులు నెమ్మదిగా మొదలైనయి. అరగంట ప్రయాణం అయిందో కాలేదో వెంటనే పాటలు, ఆటలు, అంత్యాక్షరీ, జోక్స్ మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు సురువైనయి. పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమలోని సృజనాత్మక కళలను ప్రదర్శించడం జరిగింది. ఆనందము పొంగి పొరలింది. పాటలకు యువకులు డాన్స్ లు వేయడం, కపుల్స్ నృత్యం చేయడం మొదలైంది. పచ్చటి ప్రకృతి మధ్య నదీ కిరుప్రక్కల ఎత్తయిన కొండల నడుమ ప్రయాణం సాగుతున్నంతసేపు అందరి హృదయాలలో ఉల్లాసమనిపించింది. సాగర్ నుండి శ్రీశైలం వెళ్తున్నప్పుడు కుడి పక్కన నల్లగొండ- మహబూబ్ నగర్ ప్రాంతాలు, ఎడమవైపు గుంటూరు- కర్నూలు ప్రాంతాలు కనబడతాయి.మరి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత నెట్ వర్క్ కూడా అందక సెల్ ఫోన్లు పని చేయలేదు. ఆంటే బాహ్యప్రపంచానికి 3 గంటలపాటు సంబంధాలు కట్ అయినయి. దీంతో ఏదో తెలియని ఉత్కంఠభరితం, ఉద్విగ్న వాతావరణం కనిపించింది. అయినప్పటికీ నదీ తీరం వెంట చాలా ఎత్తయిన కొండల నడుమ చల్లని వాతావరణంలో స్టీమర్ లో ప్రయాణం చేస్తుంటే చెప్పనలవి కాని సంతోషం అనిపించింది. 11 గంటలకు టీ, స్నాక్స్,1-00 గంటకు మధ్యాహ్న భోజనం తెలంగాణ టూరిజం శాఖ వారే ఇవ్వడం జరిగింది. అవి ఎంతో రుచిగా కూడా ఉన్నాయి. నడుమ నడుమ వెంట తెచ్చుకున్న తినుబండారాలు కూడా ఒకరికి ఒకరు షేర్ చేసుకుని ఆరగించడం జరిగింది. ఏదిఏమైనప్పటికీ మొత్తంమీద ఏడున్నర గంటలపాటు అత్యంత వైవిధ్యభరితంగా క్షణాలుగా కొనసాగినది నది యాత్ర. సాయంత్రం 4:30 గంటల కల్లా శ్రీశైలం డ్యాం దిగువన ఉన్న పాతాళ గంగను చేరుకోవడం జరిగింది. (ఇదే స్టీమరు మరునాడు ఉదయము 9 గంటలకు శ్రీశైలము నుండి నాగార్జునసాగర్ కు మళ్లీ ఇదే మార్గం ద్వారా బయలుదేరుతుంది.) అందరం మెల్లగా స్టీమర్ దిగినాం. పాతాళగంగా పుష్కర్ ఘాట్ మెట్లమీద నిలబడి కాసేపు చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి మాతను తనవితీరా చూడనైనది. అనంతరం పాతాళ గంగ లో స్నానమాచరించి 20 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలానికి బస్సు ద్వారా చేరుకున్నాము. మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డు ద్వారా బస్సులో ప్రయాణిస్తుంటే మహా అద్భుతమే కాదు ఒకింత భయం కూడా అనిపించింది. చివరకు నల్లమల దట్టమైన అరణ్యాల ద్వారా ప్రయాణించి సాయంత్రం 6 గంటల కల్లా శ్రీశైలం చేరుకున్నాం. బస్టాండ్ లో బస్సు దిగి సమీపంలో ఉన్న (నీలం సంజీవరెడ్డి) సత్రం చేరుకొని అద్దెకు తీసుకున్న ఒక గదిలో ఫ్రెషప్ అయినం.
అనంతరం సాయంత్రం ఏడు గంటలకు శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ దర్శనం కోసం ప్రధాన ఆలయానికి చేరుకుని, రెండు గంటలపాటు వరుస క్రమం (క్యూ లైన్ ) లో మెల్లగా నడుచుకుంటూ "ఓం: నమ:శివాయ:"అనే శివనామ స్మరణం మనుషులో అనుకుంటూ... రాత్రి 9 గంటల కల్లా దైవ దర్శనం చేసుకున్నాం. కోరిన కోరికలు తీర్చే కొలువైన స్వామిని మనసారా తలుచుకుని హృదయం నిండా నింపుకున్న తదుపరి తీర్థ ప్రసాదములు స్వీకరించి సత్రం చేరుకుని ఉచిత భోజనము చేయనైనది. రాత్రికి హాయిగా నిద్రపోయినం. ఉదయం లేవగానే స్నానమాచరించి అల్పాహారం తిని పరిసర ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది. వాటి గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.
శ్రీశైలం:ప్రధాన ఆలయం:
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కృష్ణా నది తీరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది శ్రీశైలం. ఇది సు ప్రసిద్ధ శైవక్షేత్రం. భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది. ఈ శ్రీశైలానికి శ్రీ గిరి, సిరిగిరి, శ్రీ పర్వతం, శ్రీశైలం మొదలైన నామాంతరాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయ నగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు.ఒక్కసారి మల్లికార్జున స్వామిని త్రికరణశుద్ధిగా సందర్శించినంతనే సర్వ యజ్ఞాలు చేసిన ఫలాలను, సర్వ తీర్ధాలు సేవించినా ఫలితాలను అనాయాసంగా పొందవచ్చునని సాక్షాత్తు పరమేశ్వరుడే తన పార్వతి దేవి కి చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలంలోని దేవాలయం భ్రమరాంబ,మల్లికార్జున స్వామిదేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ గుడిలో శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా, మాత పార్వతీదేవిని భ్రమరాంబ గా కొలుస్తారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం అచ్ఛేద్యమైన ప్రాకారం కలిగి లోపల నాలుగు మండపములతో అపురూపమైన శిల్ప సంపదలతో అలరారు తున్న గొప్ప మహిమ గల దేవాలయం.ఈ క్షేత్ర దర్శనం అంటేనే పూర్వజన్మ పుణ్యఫలంగా లభిస్తుందని చెబుతారు. ఇది నిత్యము భగవన్నామ స్మరణాలతో మారుమ్రోగుతూ భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక కేంద్రంగా శోభిల్లుతుంది. ఈ శ్రీశైలంలో భక్తులకు వసతి గా దేవస్థానం వారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు మరియు హోటల్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా వివిధ కులాల వారీగా భిన్న ఉచిత సత్రములు కూడా నిర్మించబడినవి. ఈ శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాలలో దాదాపు 500 వరకు శివలింగాలు ఉన్నాయని అంటారు. శ్రీశైలం ప్రధాన దేవాలయం దర్శించుకున్న అనంతరం సమీపములో ఎన్నో మఠాలు,క్షేత్రాలు, మండపాలు కూడా ఎంతో చూడ తగ్గవి ఉన్నాయి.
శిఖర దర్శనం:
ప్రధాన ఆలయము సందర్శించిన తర్వాత చూడదగ్గ ప్రదేశాలలో ఇది ఒకటి.
శిఖరేశ్వరం గా పిలువబడే ఇది ప్రధాన ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో మరియు శ్రీశైలం డ్యాం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు. శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్నా ప్రధాన ఆలయము శిఖరాన్ని చూడటం. అలా చూసినప్పుడు శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని ఒక నమ్మకం. శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరణం అని భక్తుల విశ్వాసం. శిఖర దర్శనం చేసుకుంటే మరో జన్మ ఉండకుండా కైలాసంలో ఉండవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి.శిఖర దర్శనానికి త్రేతాయుగములో శ్రీరామునికి ఒక సంబంధం ఉంది. శివ దర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుతము శిఖరేశ్వరం గా మనం చెప్పుకుంటున్నాం.
సాక్షి గణపతి ఆలయం:
శ్రీశైలం వచ్చినమంటే తప్పకుండా సాక్షి గణపతి ఆలయము దర్శించవలసినదే. ఇది శ్రీశైల ప్రధానాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. దీని ప్రత్యేకత ఏమిటంటే... శ్రీశైలంలో శివుని దర్శించుకుంటేనే కైలాసం దర్శనానికి అనుమతి లభిస్తుందని, మనం శ్రీశైలం వెళ్ళాము అని అనడానికి ఈ సాక్షి గణపతి సాక్ష్యం అవుతుందంటారు. అందుకే ఈ స్వామిని సాక్షి గణపతిగా అని పిలుస్తారు.
శ్రీశైలం డ్యాం:
శ్రీశైలం ప్రాజెక్టు లేదా డ్యాం కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టు. మొదట్లో కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించినప్పటికీ, ఈ ప్రాజెక్టు తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలను తీర్చడంలో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు పొడవు దాదాపు 512 మీటర్లుగా చాలా ఎత్తులో ఉంటుంది. మరియు ఈ డ్యామ్ కు 12 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఈ శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుండి 772 మెగావాట్ల విద్యుత్తును, అదేవిధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుండి దాదాపు 900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ డ్యామ్ అన్ని తలుపులు తెరిచినప్పుడు సూడాలేగానీ మస్తుగుంటది కృష్ణమ్మ దుంకులాట. తెల్లటి నురగలతో అతి ఎత్తైన ప్రదేశం నుండి దిగువన గల పాతాళ గంగ లో దుంకుతుంటే భలే గమ్మత్తుగా ఉంటది.
పాతాళ గంగ:
శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. శ్రీశైలం చాలా ఎత్తులో ఉంటుంది. నది మాత్రం చాలా లోతులో దిగువన ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణా నదిలో స్నానం చేయాలి. ఇక్కడ స్నానమాచరించిన తర్వాతే దైవ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. స్నానం చేస్తేనే పాపాలు పోతాయని భక్తుల నమ్మిక. కృష్ణా నదిని ఇక్కడ "పాతాళ గంగ" అని పిలుస్తారు.ఎందుకంటే చాలా మెట్లు దిగి లోతులోనున్న గంగను చేరుకోవాలి కాబట్టి ఇక్కడ దీన్ని పాతాళగంగ అనే సార్ధక నామం తో వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాకుండా పచ్చగా కనిపిస్తాయి. 2004లో పాతాళ గంగ కు వెళ్లడానికి "రోప్ వే "మార్గం ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉన్నది. కృష్ణా పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కర ఘాట్ కూడా ఏర్పాటు చేశారు. పాతాళ గంగ కూడా భక్త జనాన్ని పరవశింపజేసే ఒక ముఖ్యమైన ప్రదేశంగా చెప్పవచ్చు.
పాలధార-పంచదార:
ఇది కూడా చూడదగ్గ ప్రదేశం. ప్రధాన ఆలయమునకు, సాక్షి గణపతి గుడి కి మధ్యలో హటకేశ్వరంనకు సమీపాన అందమైన లోయలో ప్రశాంతమైన ప్రదేశంలో జగద్గురు ఆది శంకరాచార్య తపస్సు చేసిన స్థలం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుళ్ల నుండి పంచదారలు గా ఉరికి వచ్చే జలాలు ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండడమే ఇక్కడి ప్రత్యేకత.
హటకేశ్వరం:
శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికెలో బంగారు శివలింగం రూపంలో ప్రత్యక్షమై కనిపించిన ప్రదేశమే ఈ అట కేశ్వర ఆలయం. ఇది శ్రీ మల్లికార్జున స్వామి ఆలయమునకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పరమశివుడు అటిక అనగా ఉట్టి లేదా కుండ పెంకులో వేయడంలో ఈ ఆలయంలోని ఈశ్వరునికి అటకేశ్వరుడనే పేరు వచ్చింది. ఇక్కడ పరిసర ప్రాంతాలలో పలు ఆశ్రమాలు, మఠా లు ఉన్నాయి.
భీముని కొలను:
హటకేశ్వరం సమీపంలో ఉన్న ఖాలీ బాట భీముని కొలనుకు దారి తీస్తుంది. ఇక్కడి నుండి దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్తే త్రివేణి శ్రీ పర్వతానికి చేరుకుంటారు. ఇక్కడ తూర్పు నుండి ఒక సెలయేరు, దక్షిణం నుండి మరొక సెలయేరు కలిసి జలపాతాలుగా వచ్చి కన్నుల విందుగా దుంకుతాయి. వీటితో ఏర్పడిన కొలనునే భీముని కొలను అంటారు.
అక్కమహాదేవి గుహలు:
మరో చూడదగ్గ ప్రదేశం అక్కమహాదేవి గుహలు. శ్రీశైలానికి ఈశాన్య దిశలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. కృష్ణా నది ఆవలి ఒడ్డున 16 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన పర్వత శిఖరానికి దిగువున సహజ సిద్ధంగా వెలసిన బండ గుహలే అక్కమహాదేవి గుహలు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివుని అపర భక్తురాలు అక్కమహాదేవి శ్రీశైలం మల్లికార్జున స్వామి లో లీనం కావాలన్న చిరకాల వాంఛ తో శ్రీశైలం వచ్చి కదిలి వనములో ఉన్న గుహల్లో కొంతకాలం కఠిన తపస్సు చేసి నందున ఈ గుహలకు అక్క మహాదేవి గుహలు అని పేరు వచ్చింది. దాదాపు గంటన్నర సేపు కృష్ణాజలాలలో ప్రయాణించి పడవల ద్వారా ఈ గుహలు చేరుకోవచ్చు.
ఇంకా శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రవనం పార్కు తదితర ప్రాంతాలను, దేవాలయాలను, మండపాలను, మఠాలను, చారిత్రక ప్రదేశాలను చూపులకు కానరానంతగా విస్తరించిన శ్రీశైలం దివ్య క్షేత్రాన్ని కనులారా చూడవచ్చు.
ఆ తర్వాత మర్నాడు ఉదయం హైదరాబాద్ బస్సు ఎక్కి మన్ననూరు స్టేజి వద్ద దిగి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దిమడుగుకు బస్సులో ప్రయాణించి శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. అక్కడ నుండి అచ్చంపేట, డిండి, దేవరకొండల మీదుగా సాయంత్రానికల్లా నల్లగొండ చేరుకున్నాం. ఈ విధంగా సెలవుదినాల్లో ముచ్చటగొలిపే నది యాత్ర, శ్రీశైలం క్షేత్రం దర్శనం మహత్తరమైనది. ఆహ్లాదమైనది. మరి ఇంకేం? ఆలస్యం చేయకండి. మీరుకూడా వెళ్ళి రండి.
===============================================
(సాగర్ టు శ్రీశైలం నది యాత్ర సందర్భంగా..)


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి