పలకను, ఉలకను,
కదలను, మెదలనని
మాపై ఎన్నో మాటలు..
మాపై ఎన్నో మూటలు..
రాతియుగంగా, శిలాయుగంగా
చరిత్ర మొదలైంది మాతోనే..
ఆనాడు ఆదిమానవులు
కొండ గుహల్లో జీవించేవారు.
రాళ్లను ఆయుధాలుగా చేసుకునేవారు.
మాపై కూర్చొనేవారు.
మాకు పగలగొడతారు..
మాకు ముక్కలు చేస్తారు
మమ్మల్ని గుండా పిండి చేసేస్తారు...
మమ్మల్ని పునాదిగా వేసి
పుడమిలో పాతేస్తారు..
మాకు ఇంటికి పైకప్పుకు వేసేస్తారు.
ఇంటికి రకరకాలుగా వాడేస్తారు..
పిల్లలు గులకరాళ్ళుగా ఆడుకుంటారు.
పెద్దలు బండరాళ్ళుగా వాడుకుంటారు.
రోలు, పొత్రంగా,
సన్నె, గొడ్డ, తిరగలిగా
ఉపయోగించుకుంటారు.
మీ నడకకు రహదారికి మేమే..
కొండ, పర్వతాల్లో మేమే..
చలువరాళ్ళం మేమే..
పలకరాళ్ళం మేమే..
పాలరాళ్ళం మేమే..
గ్రానైట్ మేమే ..
రాళ్ళము రంగురాళ్ళము.
నరులు ధరించే నవరత్నాలు మేమే..
ప్రకృతి రమణీయతగా..
శిలాతోరణాలుగా..
అజంతా, ఎల్లోరా, బొర్రా గుహలుగా
పర్యాటక ప్రదేశాలుగా
మీకు ఆనందాలను పంచిస్తాము.
మమ్మల్ని రాయిగా త్రొక్కుతారు..
మమ్మల్ని ప్రతిమలు(విగ్రహాలు)గా మ్రొక్కుతారు.
మాపై అప్పుడప్పుడు సూటిపోటి మాటలెన్నో..
ఏంట్రా బెల్లం కొట్టిన రాయిలా పడుంటావు..
వాడి మనసు బండరాయి..
ఋషులు కూడా కొందర్ని శపించి మాలా రాళ్ళగా మార్చేసారట..
శిలలపై శిల్పాలు చెక్కడమే కాదు
శిలల(మా)పై గీతాలు వ్రాశారు కూడా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి