న్యాయాలు-941
"లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి? " న్యాయము
*****
లోచనా అనగా రెండు కళ్ళతో, రెండు నయనాలతో. విహీనస్య అనగా లేకున్నా,లోపించినా.దర్పణం అనగా అద్దం. కిం అనగా ఏమి.కరిష్యతి అనగా చేయగలదు అని అర్థము.
అసలే కళ్ళు లేని వ్యక్తికి అద్దం ఏమి చేయగలుగుతుంది అని అర్థము.అనగా కళ్ళు లేని వ్యక్తికి అద్దం చేసే సహాయం ఏమీ ఉండదు. అది కేవలం చూపున్న వారికి వారెలా ఉన్నారో చూపెట్టే ఓ సాధనం మాత్రమే. అది ఆ వ్యక్తి చూపును/ అంధత్వాన్ని ఆ అద్దం పోగొట్ట గలదా? అంటే లేదు,పోగొట్ట లేదు అని అర్థము.
అద్దమనేది మనల్ని మనం చూసుకోవడానికి, బాహ్యంగా కనిపించే లోపాలను సరిదిద్దుకోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది.అంతేకానీ దానికి మరింకే శక్తులు ఉండవు. అందుకే కళ్ళు లేని వ్యక్తికి అద్దం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే పూర్తి శ్లోకాన్ని చూద్దాం.ఇది నారాయణ పండితుడు సంస్కృతంలో రచించిన హితోపదేశ గ్రంథంలోనిది.
"యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం?/లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి?"
అనగా ఎవరికైతే స్వయం ప్రజ్ఞా పాటవాలు లేవో వానికి శాస్త్రము ఏమి చేస్తుంది?
అలాగే అసలు కళ్ళే లేని వానికి దర్పణం ఏమి చేయగలుగుతుంది అని అర్థము.
దీనికి సంబంధించి ఓ ఉదాహరణ చూద్దాం. అసలే చదవడము రాని వ్యక్తి ముందు ఓ విలువైన గ్రంథాన్ని తెచ్చి పెడితే మాత్రం ఏమి లాభము? చదువు జ్ఞానం లేని వ్యక్తికి శాస్త్రాల విలువ తెలియదు కదా! అని అర్థము.
మనుషుల్లో కొందరికి పుట్టుకతోనే కొన్ని శక్తి సామర్థ్యాలు వస్తాయి. వాటిని బాల్యం నుంచి గ్రహించి సాన పడితే అందులో నైపుణ్యం పెరుగుతుంది.అనగా వజ్రాన్ని సానపెడితేనే దాని విలువలేంటో గ్రహించగలం.
అలా సహజంగా ఉన్నవారిని తీర్చి దిద్దగలం. లేని వారి పరిస్థితి. వారిలో అంతస్సారమే లేక పోతే మనం ఏం చేసినా నిష్ప్రయోజనమే.
అందుకే దీనికి కొనసాగింపు ఉదాహరణగా "కళ్ళు లేని వ్యక్తిని మరియు అద్దాన్ని తీసుకుని పోల్చి చెప్పడం జరిగింది.
కొంతమంది పుట్టుకతోనే మంద బుద్ధితో పుడతారు. అలాంటి వారికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా చదువును బోధించలేము. అలాంటి వారిలో ఎలాంటి మార్పులు తీసుకుని రాలేము.దీనినే "చేరి మూర్ఖుల మనసు రంజింప జాలము అనే పద్యములో వలె ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని అర్థము.
ఈ విధంగా శాస్త్ర విజ్ఞానం తెలియని కొందరికి ఏమి చెప్పినా మనసుకు ఎక్కదు. కానీ తామే గొప్ప అనే భ్రమలో ఉంటారు.
ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ తానొక గొప్ప వ్యక్తిగా భావించుకుంటాడు. ఏమీ చెప్పినా ఎవరు చెప్పినా వినడు.అన్నీ తెలుసు అన్నట్లు ఉంటుంది ప్రవర్తన. ఇలాంటి వ్యక్తికి బలవంతంగా చెప్పి జ్ఞానవంతుడిగా చేద్దామని అనుకున్నా ఒక్క ముక్క కూడా మనసుకు ఎక్కించుకోడు.అలాంటి వారు కొందరు మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపిస్తూ ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు వారికి ఏమీ తెలియదు, రాదు అనే విషయం అర్థమవుతుంది.
ఇలాంటి వారిని ఎందరినో మన పెద్దవాళ్ళు చూసి వుండవచ్చు.అందుకేనేమో ఇలాంటి న్యాయాలను సృష్టించారు.
ఇక ప్రస్తుతము విద్యా సంస్థల్లో చదువుకునే పిల్లలు కొందరు ఈ కోవకు చెంది వుండటం మనం గమనించవచ్చు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు బడికి వచ్చినా అక్షరం ముక్క కూడా రాని వారు ఉంటారు. బోధన చేసే వారికి అలాంటి వారిని ఏం చేయాలో అర్థం కాదు. సామ దాన భేద దండోపాయాలు కూడా వాళ్ళ మీద పని చేయవు. అలాంటి వారికి స్వయం ప్రజ్ఞా పాటవాలు లేవని స్పష్టంగా చెప్పవచ్చు.
"లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి" న్యాయము చెప్పినట్లు అలాంటి వారిలోని అజ్ఞానాన్ని ఎవరమూ పోగొట్టలేము. అలాగని ఊరుకోకుండా మన వంతు ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి