న్యాయాలు-931
పదం సహేత భ్రమరస్య పేలవం, శిరీష పుష్పం న పునః పతత్త్రిణః న్యాయము
*****
పదం అనగా అడుగు.సహేత అనగా కారణంతో.భ్రమరస్య అనగా తుమ్మెద,భ్రమరము. పేలవం అనగా బలహీనమైన,అశక్తమైన.శిరీష పుష్పం అనగా దిరిశెన పువ్వు. న పునః అనగా మళ్ళీ కాదు, తిరిగి కాదు. పతత్త్రిణ అనగా పక్షి, బాణము, గుఱ్ఱము అనే అర్థాలు ఉన్నాయి.
మృదువైన శిరీష పుష్పము తనమీద తుమ్మెద వాలితే ఓర్చగలదు కానీ పక్షి వాలితే సహించ గలదా ? అనగా సహించలేదు అని అర్థము.
సాహిత్యంలో కవులు స్త్రీల యొక్క సున్నితత్వానికి ఉపమానంగా శిరీష పుష్పాన్ని ఉదహరిస్తూ ఉంటారు. సంస్కృత సాహిత్యం అంతటా సున్నితత్వానికి ఉపమానం శిరీష పుష్పమే కనిపిస్తుంది. శిరీష పుష్పం కోమలానికి ప్రతీకగా చెబుతుంటారు.
మరి శిరీష పుష్పం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం.
వేసవి కాలంలో కనిపించే పుష్పాలలో శిరీష పుష్పం ఒకటి. చూడటానికి ఎంతో అందంగా దారాలు దారాలుగా మెలి తిరిగి కనిపిస్తుంది తెలుపు, పసుపు రంగులలో కనిపిస్తుంది.ఈ పుష్పాన్ని స్త్రీలు ఎంతో ఇష్టంగా చెవులకు అలంకరణగా ఉపయోగిస్తారు.ఈ విధంగా గ్రీష్మంలో పూచే పువ్వు అయినప్పటికీ దీని ప్రభావం అన్ని ఋతువులలో కనిపిస్తుంది. ఇదొక అందమైన కవితా వస్తువు కూడా.
దీని పుప్పొడి కాంతి సూర్యుని కాంతి గుర్రాల రంగుకు ప్రతి ఫలించి బంగారు, ఎరుపు రంగును పొందుతుందని కవులు వర్ణిస్తుంటారు .
కాళిదాసు తాను రాసిన కుమార సంభవం మరియు రఘు వంశం కావ్యాలలో కొన్ని సందర్భాల్లో శిరీష పుష్పాన్ని ఉపయోగించడం రాయడం మనం చూడవచ్చు. ఒకచోట ఆరు సంవత్సరాల వయసు గల యువరాజును సింహాసనం మీద కూర్చున్నప్పుడు పసితనం, కోమలమైన శరీరం కలవాడు అనగా అతి సున్నితమైన వాడు అంటూ శిరీష పుష్పముతో పోల్చాడు.అలా పోల్చి అతని శరీరం ఆభరణాలను కూడా ధరించలేనంతగా సున్నితంగా ఉందనీ.అవి ధరించితే అతని శరీరానికి బాధ కలుగుతుంది అంటాడు.
ఇక కుమార సంభవంలో తపస్సు చేస్తున్న పార్వతీ దేవిని శిరీష పుష్పముతో పోల్చడం జరిగింది. ఆమె కఠినమైన తపస్సు చేయడాన్ని నిరోధించేందుకు చేసే ప్రయత్నంలో కూడా ఈ పుష్పాన్ని పోలికగా ఉపయోగించడం విశేషం.
ఇక ఈ పుష్పాన్ని గురించి రాసిన పూర్తి శ్లోకాన్ని చూద్దామా.
మనీషితాఃసన్తి గృహేషు దేవతాస్తపః క్వ వత్సే క్వ చ తావకం వపుః!/ పదం సహేత్ భ్రమరస్య పేలవం, శిరీష పుష్పం న పునః పతత్త్రిణః !!"
అనగా ఆ ఇంట్లో నీ హృదయం కోరుకునే దేవతలు ఉన్నారు. బిడ్డా! తపస్సు,నీ శరీరం రెండూ ఎంతో భిన్నంగా ఉన్నాయి.సున్నితమైన శిరీష పుష్పం తుమ్మెద లేదా తేనెటీగ వాలితే భరించగలదు కానీ పక్షి పాదాన్ని భరించగలదా! అలాగే సున్నితమైన శిరీష పుష్పం వంటి నీవు ఈ కఠోరమైన తపస్సు చేయలేవు అని పార్వతి తపస్సు విషయంలో ప్రస్తావించారు.
మరి ఈ "పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం న పునః పతత్త్రిణః" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే శిరీష పుష్పం లాంటి సున్నితమైన మనస్సు ఎటువంటి కఠినమైన మాటలను భరించలేరు అని సున్నిత మనస్సు ఉన్న వారికి వర్తింపజేస్తూ చెప్పారు.
చాలా వరకు అందరి మనసులు పుట్టినప్పుడు సున్నితంగానే ఉంటాయి. పెరిగి పెద్దయ్యాక ఆయా పరిస్థితులు, అనుభవాలు, సంఘటనలను బట్టి మారుతూ ఉంటాయి. సున్నితమైన మనస్సు కలవారికి ఒక చిన్న మాట అది మంచైనా, చెడైనా వారి మనసు మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది.
కఠినమైన మాట శిరీష పుష్పం మీద వాలిన పక్షి లాంటిది. కాబట్టి అలాంటి కఠినమైన పదాలను మాటల్లో ఉపయోగించి బాధ పెట్టకూడదు. ఇదే ఈ న్యాయము లోని అంతరార్థము. కాబట్టి మనం ఎవరినీ నొప్పించకుండా,అందరి మనసును ఒప్పించుకుంటూ జీవన యానం చేయాలి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి