న్యాయాలు-937
"గతం న శోచామి కృతం స్మరామి" న్యాయము
*****
గతం అనగా అయిపోయిన ,గడచినది,నశించినది,,పోవుట,కదలిక, గమనము. న అనగా లేదు, కాదు. శోచామి అనగా విచారం వ్యక్తం చేయుట, దుఃఖించుట.కృతం అనగా చేయబడినది,వొప్పించ బడినది,కృత యుగము.స్మరామి అనగా తలచుకొనుట అని అర్థము.
అయిపోయిన దానికి శోకించలేదు.ఇప్పుడు చేసిన దానిని స్మరిస్తున్నాను అని అర్థము.
ఇదొక ఆలోచింపదగిన, విచిత్రమైన శ్లోకము. దీనిలోని ఓ వాక్యాన్ని తీసుకుని న్యాయముగా చెప్పడం విశేషం. మరి దీనికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దామా!.
"ఖాదన్న గచ్ఛామి హసన్న జల్పే, గతం న శోచామి కృతం న మన్యే!/ ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్, కిం కారణం భోజ భవామి మూర్ఖః!!"
అనగా నేను నడుస్తూ తినను.నవ్వుతూ మాట్లాడను.గడచిన కష్టాల గురించి దుఃఖించను, గతం గురించి ఆలోచించను.ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఆహ్వానం లేకుండా వెళ్ళే మూడవ వాడిని కాను.నేను ఇవి చేయనందున నిజంగా బుద్ధి శాలిని.అలాంటప్పుడు ఓ భోజరాజా! నన్ను ఎందుకు మూర్ఖుడు అని పిలుస్తావు? అని అర్థము.
మరి ఇన్ని మంచిపనులు చేసుకుంటూ ఉన్న తనను భోజరాజు ఎందుకు మూర్ఖుడు అని సంబోధిస్తూ లోనికి ఆహ్వానించాలి అనే సందేహాన్ని భోజరాజు ఆస్థానంలో ఉన్న కాళిదాసు ఈ శ్లోకం ద్వారా వ్యక్తం చేస్తాడు.
భోజరాజు ఓ మూర్ఖుడా ! లోపలికి రండి! అన్న మాటను కాళిదాసు "ఇదేదో సమస్యా పూరణం" కావచ్చు అనుకుంటాడు. వెంటనే తాను మూర్ఖుడిని కాదు అనడానికి తనలో ఎంత వివేకం,విచక్షణా జ్ఞానం ఉన్నాయో సమస్యను పూరిస్తూనే తానేంటో అర్థమయ్యేలా చెబుతాడు.
కాళిదాసు ఆ విధంగా ఆ వాక్యాన్ని పూరించడం వల్ల భోజరాజు సమస్యకు పరిష్కారం దొరికింది.ఆ పూర్వాపరాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒకరోజట భోజరాజు తమ రాణిగారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె తోటలో ఉందట.అక్కడే ఆమెను సందర్శించుకుందామని వెళ్ళాడట.కాని ఆ సమయంలో రాణిగారు తన స్నేహితురాలితో మాట్లాడుతూ వుండటం చూశాడు.ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో దూరకూడదు అనే విషయాన్ని లెక్క చేయకుండా అనగా వారి ఏకాంతాన్ని గౌరవించకుండా సరాసరి వారి దగ్గరకు రావడం చూసి రాణిగారు అసహనాన్ని వ్యక్తం చేస్తూ "ఓ మూర్ఖుడా! లోపలికి రండి! అని ఆహ్వానించిందట.అప్పుడు భోజరాజు లోలోపల అవమానభారంతో రాజ భవనానికి తిరిగి వస్తాడు.
రాణిగారు తనను "మూర్ఖుడా!అని ఎందుకు సంబోధించిందో తెలియక భోజరాజుగారి మనసును ఆ మాట గాయంలా సలుపుతూ ఉంటుంది .ఎందుకలా పిలిచిందో అస్సలు అంతు పట్టదు. దీనిని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.అయితే ఎలాగైనా సందేహం నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అందుకే మరుసటి రోజు 14మంది పండితులు తన ఆస్థానంలోకి ప్రవేశించే ముందు ఒక్కొక్కరిని "ఓ మూర్ఖుడా! లోనికి రండి!అని ప్రతి పండితుడిని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు.
అలా పదమూడు మంది పండితులు తమ తమ స్థానాలలో కూర్చుని "భోజరాజు ఎన్నడూ లేని విధంగా "తమను మూర్ఖుడు" అని ఎందుకు సంబోధించాడో అర్థం కాదు. అయితే సమాధానం చెబితే బాగుండదని నిశ్శబ్దంగా ఉండిపోతారు.
కానీ కాళిదాసు మాత్రం దానిని సమస్యాపూరణం అనుకుని పై విధంగా పూరిస్తాడు. అందులోనే భోజరాజుకు కావలసిన సమాధానం దొరుకుతుంది.మనకు కూడా తెలిసి పోయింది కదా!
ఈ న్యాయము ఒక సంస్కృత శ్లోకములోని కొంత భాగమని చెప్పుకున్నాం కదా!
ఆ శ్లోకం మొత్తం కూడా విజ్ఞుడు,వివేకి ఎలా ఉండాలో, ఉంటాడో చెప్పింది.
ఇక మనం చెప్పుకునే "గతం న శోచామి కృతం స్మరామి" న్యాయానికి సంబంధించి "గడిచిన దానికి శోకించకూడదు.ఇప్పుడే జరిగిపోయిన దాన్ని తలచుకుంటున్నాను అంటే... ఏమైనా పొరపాటు దొర్లితే, మరోసారి దొర్లకుండా సరిదిద్దుకుంటాననే అర్థం కూడా ఈ శ్లోకంలో ఉంది. ఇది ఏ ఒక్కరికో చెప్పినట్లు కాదు ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి చెప్పినది.
ఈ సందర్భంగా భగవద్గీతలో ఇదే అర్థాన్ని ఇచ్చే ఓ శ్లోకాన్ని కూడా చెప్పుకుంటే బాగుంటుంది.
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి/ శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః!"
అనగా ఎవరు సంతోషానికీ,ద్వేషానికీ,దుఃఖానికీ, ఆశకు, శుభ- అశుభాలకు అతీతుడో అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు అని అర్థము.
కాబట్టి మొత్తంగా ఈ న్యాయంలో "దేనికి కూడా హైరానా పడకుండా నిత్య విధులు నిర్వహిస్తూ బుద్ధిశాలిగా జీవించాలనే అర్థం ఇందులో యిమిడి ఉంది.కాబట్టి ఆ విధంగా ఉండేందుకు మనమందరం ప్రయత్నిద్దాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి