ముల్లా బాధ:- - యామిజాల జగదీశ్
 ముల్లా దేవుడిని నమ్మని నాస్తికురాలైన ఓ యువతిని  ప్రేమిస్తుండటంతో అతని కుటుంబం వారు పెళ్ళి చేసుకుంటామంటే అంగీకరించలేదు. 
కానీ ముల్లా తల్లితో ఇలా అన్నాడు...
"నేను ఆమెను ప్రేమిస్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెను చేసుకుంటా ను..." అని.
అప్పుడు అతని తల్లి
"సరే, నీ కోరిక మేరకు ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తాము.
కానీ, ఒక షరతు...
నువ్వు ఆమెకు ఆధ్యాత్మిక విషయాలు చెప్పి ఏదో ఒక విధంగా ఆమెను దేవుడిని నమ్మే విశ్వాసిగా మార్చాలి..." అని చెప్పింది.
ముల్లా సరేనన్నాడు.
ముల్లా తన స్నేహితురాలిని రోజూ కలుస్తూ దేవునిపై విశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తూనే వచ్చాడు.
ఒక రోజు, అతని తల్లి ముల్లా విచారంగా కూర్చోవడం చూసింది.
"ఏమిట్రా అలా దిగాలుగా ఉన్నావు?  చింతించకు. అంతా బాగానే ఉంటుంది. ప్రయత్నిస్తూ ఉండు. ఎందుకీ విచారం..." అంది తల్లి.
అంతట ముల్లా, "అదే సమస్య అమ్మా. నేను ఆమెను ఒప్పించాను! నేను ఆమెలో దేవునిపై చాలా విశ్వాసాన్ని కలిగించాను. కానీ
నేనీరోజు ఆమెను కలిసినప్పుడు, 
తాను సన్యాసి కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది...ఇప్పుడేం చెయ్యాలమ్మా" అన్నాడు.

కామెంట్‌లు