కవితావేశం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గాలి వీస్తుంటే
ఊహలు ఉల్లాన ప్రసరిస్తాయి
మబ్బు లేస్తే
కలాలు అక్షరాలను రాలుస్తాయి

నీరు పారుతుంటే
పదాలు గలగలా ప్రవహిస్తాయి
ఎండ తగిలితే
కవనవృక్షాలు పూలు పూస్తాయి

రవి ఉదయిస్తే
కవిత పొడుచుకొస్తుంది
పక్షులు రెక్కలిప్పితే
కవిచేతులు చాచుకుంటాయి

కాలము కదులుతుంటే
భావము తలకెక్కుతుంది
కాగితము పరచుకుంటే
కవిత్వము ఎక్కికూర్చుంటుంది

పాఠకులు కోరుకుంటే
కవితలు చెంతచేరతాయి
పత్రికలు ప్రచురిస్తే
సాహిత్యము వెలిగిపోతుంది

వర్షము ఉధృతమైతే
వరదకు గట్లుకొట్టుకపోతాయి
కవితావేశము  వస్తే
కవనలోకము దద్దరిల్లిపోతుంది


కామెంట్‌లు