న్యాయాలు -940
పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం "న్యాయము
****
పృథివ్యాం అనగా ఈ భూమి మీద.త్రీణి అనగా మూడు. రత్నే అనగా రత్నాలు.జలం అనగా నీరు.అన్నం అనగా ఆహారం,తిండి, భోజనం. సుభాషితం అనగా మంచి మాట లేదా చక్కటి మాట అనే అర్థాలు ఉన్నాయి.
ఈ భూ ప్రపంచంలో దొరికే రత్నాలు మూడే మూడట.అవి ఒకటి జలం.రెండవది ఆహారం. మూడవది సుభాషితం అని మన పెద్దలు అంటుంటారు.
ఇక్కడ రత్నాన్ని అత్యంత విలువైన వస్తువుగా పరిగణించడం జరిగింది.రత్నం అంటే విలువైన రాయి, ఆభరణం అనే అర్థాలు ఉన్నాయి.
అయితే త్రిరత్నాలలో మొదటిది "జలము " అనే రత్నాన్ని చూద్దాం. నీరే మానవ మనుగడకు కీలకం.కేవలం మానవుడే కాకుండా.సమస్త జీవరాశులకు జలమే ఆధారం.జలం లేకుండా జీవులు జీవించలేవు. "నీరు లేని ఎడారి జీవితాన్ని ఊహించుకోలేం.నీరు లేకుండా ప్రాణాలు నిలుపుకో లేము". పంచభూతాలలో నీరు కూడా ఎంతో ప్రధానమైనది. నీటిలోంచే జీవరాశి ఉద్భవించింది. త్రాగు నీరు, సాగు నీరు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రపంచంలో అందరిదీ.
ఇక రెండో రత్నం అన్నం లేదా ఆహారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆహారం లేకుండా జీవులు ఎక్కువ కాలం బతకజాలవన్న సంగతి అందరికి తెలిసిందే. అన్నం ప్రాణశక్తిని ఇచ్చే బ్రహ్మ రూపం. అందుకే అన్నాన్ని సాక్షాత్తూ పరబ్రహ్మ రూపంతో కొలుస్తారు."అన్నాద్భవంతి భూతాని అంటుంది భగవద్గీత . అనగా ఆహారమనే దాని నుండే సకల ప్రాణులు ఉద్భవించాయనే సందేశం ఇందులో ఉంది.
ఈ సందర్భంగా అన్నంతో పూజ చేసే పండుగ గురించి చెప్పుకుందాం. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ ఎంతో ప్రసిద్ధి చెందినది. బోనం అంటే భోజనం అనగా ఆహారమే.అమ్మవారికి బోనం సమర్పించి అంటువ్యాధులు నుండి కాపాడమని గ్రామ దేవతలను కోరుకుంటారు.
ఇక మూడో రత్నం సుభాషితం.సుభాషితం అనగా మంచి మాట. సు అంటే మంచి. భాషితం అనగా వాక్కు లేదా మాట. మంచి మాట అంటే మందితో కలిసి జీవనం చేయడానికి ఉపయోగించే వాగ్రూపం. "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది" అనే సామెత ఇందులో యిమిడి ఉంది. నోటిలోంచి వచ్చే మాట చక్కగా తానొవ్వక,నొప్పింపక అందరూ ఒప్పుకునే విధంగా కుసుమంలా సుతిమెత్తగా ఉండాలి.
మాట్లాడే మాటను బట్టే బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు." కాలు జారితే వెనక్కి తీసుకో గలం, కానీ నోరు జారితే తీసుకోలేం. అందుకే మన పెద్దవాళ్ళు "ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు" అంటుంటారు. మన ఒళ్ళు మన దగ్గరే ఉంటుంది కానీ మాటే... "పెదవి దాటితే పృథివి దాటుతుంది" అంటారు.
ఇలా ఈ మూడు ఎంత ముఖ్యమో చెబుతూ ఈ న్యాయములోని వాక్యానికి సంబంధించిన మొత్తం సంస్కృత శ్లోకాన్ని చదువుదాం.
"పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం!/ మూఢై పాషాణ ఖండేషు రత్న సంజ్ఞాప్రదీయతే!!/
అనగా ఈ భూ ప్రపంచంలో దొరికే రత్నాలు మూడే.అవి జలం( నీరు), అన్నము . కమరియు సుభాషితం. నీరు,ఆహారం లేకుండా జీవరాశి మనుగడ సాగించదు. కావున ఈ రెండు నిజమైన రత్నాలు.ఇక మూడవ రత్నం సు భాషితం అనగా మంచి భాషితం.ఈ భాషితం సరిగా లేకుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇక మూఢులు అనగా అజ్ఞానులు ఇంతటి గొప్పవైన మూడు రకాల రత్నాలను విడిచి పెట్టి పాషాణ ఖండాలను అనగా రాతి ముక్కలను రత్నాలుగా భావిస్తారు.అనగా భూమిలో దొరికే వివిధ రకాల రాళ్ళు . ఇందులో నవ రత్నాలు కూడా ఉంటాయి. అనగా వాటిని మాత్రమే రత్నాలుగా భావిస్తారు కాని అసలు ముఖ్యమైన త్రిరత్నాలను మూర్ఖులు వదిలేస్తారు.అనగా వాటికి విలువ ఇవ్వరు అని అర్థము.
నేటి సమాజంలో మనిషి ఏవి కావాలో వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఏవి అంతగా అవసరం లేదో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే నేటి కాలంలో విలువలు మారిపోయాయి. వాటి వల్ల ఆత్మీయమైన అనుబంధాలు బీటలు వారినవి. కాబట్టి అసలైన త్రిరత్నాలను గుర్తించాలని ఈ "పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం" న్యాయము" లోని అంతరార్థము.
ఇది గ్రహించి మంచి మాటతో/ సుభాషితంతో మిగిలిన రెండు రత్నాల ప్రాముఖ్యత, ప్రాధాన్యతను ప్రజలకు తెలియ జేద్దాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి