కొత్తూరులో ఘనంగా కవి సమ్మేళనం


 కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా కవిసమ్మేళనం నిర్వహించినట్లు వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తెలిపారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక నాలుగో నెల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పారశెల్లి రామరాజు విచ్చేసారు. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అని, రెక్కలు ముక్కలు చేసుకుని రోజు వారి కూలి డబ్బులతో జీవనోపాధిని పొందుతూ బ్రతుకీడ్చుచున్న శ్రామిక కార్మిక కర్షక వర్గాలను ఆదుకోవాలంటూ రచయితలంతా తపిస్తారని అన్నారు. అట్టి ఆలోచనల దొంతరలో పుట్టిన కవితలు వారి సామాజిక స్పృహను చాటి చెబుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కష్టజీవుల బాధలను పాలకుల, అధికారుల దృష్టికి తమ రచనల ద్వారా తీసుకువచ్చుట మిక్కిలి అభినందనీయమని రామరాజు సాహిత్య లోకాన్ని కొనియాడారు. గత నెలలో ఇదే వేదికపై ఆవిష్కరించబడిన కొత్తూరు కవనం పుస్తక రూపకల్పనకు దోహదపడిన పారిశెల్లి రామరాజు,  ఎ.వి.ఆర్.ఎం. దిలీప్ రాజా పట్నాయక్ లను, ఈనాటి వేదికపై కొరవే సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, సహకార్యదర్శి గడసాపు ఉషారాణి, కార్యవర్గ సభ్యులు ఎ.వి.ఆర్.ఎం. దిలీప్ రాజా పట్నాయక్, పల్ల నారాయణరావు, బూరాడ గణేశ్వరరావు, తెలుగు భాషా పండితులు బాణాల రమణమూర్తిలు తమ స్వీయ కవితా గానం చేసారు. 
కవులందరికీ ముఖ్య అతిథి పారిశెల్లి రామరాజు చేతులమీదుగా సాహిత్య సత్కారాలు జరిగాయి. ఇటీవల నిర్వహించిన తెలుగు భాషా ప్రతిభా పోటీల్లో విజేతగా నిలిచిన చిన్నారులు బరాటం కావ్య,‌ సప్ప మధుమిత, వైశ్యరాజు మోక్షిత, దారపు లక్ష్మీప్రసన్నసాయి, కలమట నీహారికలకు వేదిక సభ్యులు బహుమతులందజేసి ప్రోత్సహించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు