సుప్రభాత కవిత : - బృంద
ఏ కలతల నీడలు కరగిపోయేనో 
ఏ కన్నుల వెలుగులు మెరిసిపోయేనో
ఏ కలలు నిజమై ఎదురయేనో
ఏ కమ్మని కబురు మోసుకొచ్చేనో!

శిలగ మారిన మనసులను
అలగా తాకి  స్నేహంగా పలకరించి
వలను తప్పించి పరవశింపచేసి
ఇలను ఇంపుగా జీవించమనేనో!

కాని  కాలం కలకాలముండదని
కాస్త ఓర్పు మార్పును తెస్తుందని
కరిమబ్బుల అధికారం కాసేపే అని 
కదిలిపోక నిలిచే క్షణమే లేదనేనో!

రంగులు పలు రమణీయంగా విసరి
నింగిని  తూర్పున  వెలిగించి 
బంగరు కాంతుల ప్రకాశముతో 
పొంగారు ప్రభల భువిని ముంచేనో!

ఏ పాపపు నీడలు చేరని 
ఏ శాపపు సెగలు తాకని 
ఏ బాధలు ఎప్పుడూ ఉండని 
ఏమార్చని సుఖమే  తెస్తాననేనో!

ఎన్నో గుండెల తీరే కోరికలు 
మరెన్నో మదిని నింపే మమతలు 
మరింతగా మంచి మార్పులు 
ఇంకింతగా ఇస్తానని వస్తున్న వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు