సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -920
నను స్వార్థ పరో లోకః న్యాయము
*****
నను అనగా నిజంగా లేదా ఖచ్చితంగా. స్వార్థం అనగా ఎవరికి చెందకుండా తనకే చెందాలనుకోవడం. స్వా+ అర్థం=తన సొత్తు,తన కోసం.స్వార్థ పరం అనగా తన స్వంత ప్రయోజనాల కోసమే ఆసక్తి చూపడం, సొంత లాభం కోసమే ఆలోచించడం,స్వార్థానికి సంబంధించినది.లోకం అనగా ప్రపంచం,జగతి అనే అర్థాలు ఉన్నాయి.
లోకం అంటే ఏదో, ఏమిటో కాదు సమాజమే. మరి సమాజమంటే  అందులోని మనుషులే. ఆ మనుషులే  తమ స్వార్థం తాము చూసుకునే వ్యక్తులను ఉద్దేశిస్తూ చెప్పినదే ఈ న్యాయము.
 మరి స్వార్థం అంటే ఏమిటో కాస్త లోతుగా అధ్యయనం చేద్దాం. స్వార్థం అంటే స్వంత మేలును మాత్రమే చూసుకోవడం అనీ,ఇతరులతో ఎలాంటి సంబంధం లేకుండా తన గురించి,తన స్వంత ప్రయోజనం, ఆనందం గురించి మాత్రమే శ్రద్ధ చూపుతూ ఇతరుల అవసరాలను, యిబ్బందిని ఏ మాత్రం అర్థం చేసుకోకపోవడాన్ని స్వార్థం అంటారు.స్వార్థంలో ఇతరులను యిబ్బంది పెట్టడం ఉంటుంది,బాధ పెట్టడానికి వెనుకాడనితనం ఉంటుంది.
స్వార్థపూరిత స్వభావం, స్వార్థపరత్వం ఉండే వాళ్ళ ధోరణి వేరుగా ఉంటుంది. ప్రతి పనిలో, సందర్భంలో తనకు మేలు కలుగుతుందా? లేదా అనేది చూసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తూ ఉంటారు.
 మరి ఈ స్వార్థపూరిత స్వభావం ఎక్కడ నుంచి వస్తుందనే ప్రశ్నకు టక్కున కుటుంబం నుండే అని వస్తుంది. 90%కుటుంబం నుండే వస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. స్వార్థం ఎంతటి అనర్ధాలకు మూలమవుతుందో,ప్రస్తుతం ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే స్వార్థం కేవలం సాటి మనుషులకే కాదు సమస్త జీవరాశులకు హాని కలిగిస్తుంది.ప్రపంచంలోజరిగే  ప్రతి తప్పు వెనుక స్వార్థం ఉంటుంది.అతి స్వార్థం అవాంఛిత సంఘటనలతో,నేరంగా మారుతుంది .
అందుకే పిల్లలు చిన్నతనం నుండే పెద్దలను అనుకరిస్తూ, అనుసరిస్తూ ఉంటారు.కాబట్టి అక్కడి నుండే  అనగా కుటుంబ సభ్యులు అలాంటి స్వార్థ భావనలకు స్వస్తి పలికి, పరోపకార లక్షణాలు పెరిగేందుకు ప్రయత్నం చేయాలి. స్వార్థం కొంత ఉండాలి అది తాను బతికేందుకు,అవసరాలకై ధనాన్ని సమకూర్చుకునేందుకు. ఉన్నదాంట్లో ఇతరులకు ఉపకారము చేయగల లక్షణాలుంటే ఆ సమాజం సజావుగా నడుస్తుంది.
"ఒకరికి ఇవ్వడం దైవీ గుణం,ఇతురలది బలవంతంగా వాళ్ళకి బాధ కలిగిస్తూ లాక్కోవడం రాక్షసత్వం" అని కవి సార్వభౌముడు శ్రీనాధుడు  అన్నాడు.
స్వార్థం గురించి శ్రీ శ్రీ గారు ఓ పాటలో ఇలా' స్వార్థమే అనర్థ దాయ కం.అది తుంచుకుంటే క్షేమదాయకం " అంటారు.
నను స్వార్థ పరో లోకః న్యాయమును" ను  విడనాడి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు ' స్వంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడు పడటం" నేర్చుకుందాం.జీవరాశులకు హాని కలుగకుండా చూద్దాం.

కామెంట్‌లు