తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష, కార్యదర్శులు పైనేని తులసినాథం నాయుడు, పుష్ప దంపతులు 30 లక్షల రూపాయల విలువ చేసే సొంత స్థలంలో 20 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి పలమనేరు గంగవరం సాయి గార్డెన్ సిటీలో నిర్మించిన కళామందిరం మూడవ వార్షికోత్సవాన్ని ఈ నెల ఆరవ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు.
ఈ కళామందిరం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లు నిరంతర కార్యక్రమాల నిర్వహణతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సంవత్సర కాలంలో 80 నుంచి 85 కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో కొన్ని కార్యక్రమాలు వందలాదిమందితో నిర్వహిస్తే, కొన్ని కార్యక్రమాలు 40,50 మందితో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెలకొకసారి పాఠశాల స్థాయి విద్యార్థులకు పద్యాల పోటీలు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి సంవత్సరంలో కనీసం 500 మందికి తగ్గకుండా బహుమతులు అందిస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి వార్షికోత్సవం, కళామందిరం వార్షికోత్సవం, ఉగాది, సంక్రాంతి లాంటి సందర్భాలలో తెలుగు భాషాభిమానులు, సాహిత్యకారులు, కవులు, రచయితలను పిలిచి సంవత్సరానికి కనీసం 200 మందికి తక్కువ కాకుండా సత్కరించి పురస్కారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేమన జయంతి సందర్భంగా వేమన శతక పద్యాలు మాత్రమే వందకు పైగా చెప్పగలిగిన పిల్లలకు పోటీలు నిర్వహించి వందలాదిమంది పిల్లలకు వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతులు కూడా అందిస్తున్నారు. తులసినాథం నాయుడు తండ్రి పైనేని చిన్న బుచ్చినాయుడు స్మారకార్థం నగదు పురస్కారాలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అందిస్తున్నారు. తల్లి పైనేని మునెమ్మ స్మారకార్థం జాతీయస్థాయిలో కథల పోటీలు నిర్వహించి పలువురికి నగదు పురస్కారాలు అందించి సత్కరిస్తున్నారు.సంవత్సరానికి ఒకసారి ప్రముఖ సంగీత విద్వాంసులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవం నిర్వహిస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రముఖ కవులు, రచయితల జయంతి, వర్ధంతుల కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి గురించి, వారి రచనల గురించి నేటి తరానికి తెలిసేటట్లు చేస్తున్నారు. కళామందిరానికి ఎంతమంది వచ్చినా వారందరికీ పుస్తక కానుకలు అందించి పంపటం ఆనవాయితీగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక రాష్ట్రల పరిధిలోని తెలుగు పిల్లలకు ఇప్పటివరకు ఒక లక్ష 80 వేల పుస్తకాలను పంచిపెట్టిన ఘనత సాధించారు. ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, మహిళా దినోత్సవం,మాతృ దినోత్సవం లాంటి సందర్భాలలో ఆయా రంగాలలోని ప్రముఖులను సత్కరిస్తున్నారు.
వేసవి సెలవుల సమయంలో ఈ కళామందిరంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించి తెలుగు భాషను చదవడం, రాయడం నేర్పిస్తూ, రోజుకు ఒక పద్యం, కథ నేర్పిస్తున్నారు. ఈ వేసవి శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా నైతిక విలువలు నేర్పడానికి కృషి చేశారు. ప్రతి సంవత్సరం 40 నుండి 50 మంది పిల్లలు ఈ తరగతులకు విచ్చేసి నేర్చుకుంటున్నారు . ఇలా నిరంతరం తెలుగు భాష, సాహిత్య సేవలో మునిగితేలుతూ మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, అన్ని కార్యక్రమాలను సొంత నిధులతోనే చేస్తున్న సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పైనేని తులసినాథం నాయుడు, పుష్ప దంపతులను అభినందించకుండా ఉండలేము. వీరి బాటలో మరింతమంది ముందుకు వస్తే తెలుగు భాషను అమృత భాషగా నిలుపుకోవచ్చుననడంలో అతిశయోక్తి లేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి