మహిళా మారథానర్ గిబ్:- - యామిజాల జగదీశ్

 "1966లో బోస్టన్ మారథాన్‌లో పరుగెత్తడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నప్పుడు, నిర్వాహకులు ఆమెను తిరస్కరించారు. 
“మహిళలు శారీరకంగా మారథాన్‌ను పరుగెత్తలేరు. ఏమైనా జరిగితే మేము బాధ్యత తీసుకోలేము” అంటూ ఆమెతో చెప్పారు నిర్వాహకులు.
ఇప్పటికి సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, "మారథాన్ రోజు" న, బాబీ గిబ్ పొదల్లో దాక్కుని రేసు ప్రారంభమయ్యే వరకు వేచి ఉంది. దాదాపు సగం మంది రేస్ లోంచి తప్పుకున్న తర్వాత ఆమె పరుగెత్తింది. 
ఆమె తన సోదరుడి బెర్ముడా షార్ట్స్, ఒక జత అబ్బాయిల స్నీకర్లు, స్నానపు సూట్, స్వెట్‌షర్ట్ ధరించింది. 
ఆమె పరుగు పందెంలోకి దిగగానే,  వేడెక్కినట్లు అనిపించింది. అయినా ఆమె ఆగిపోలేదు. తన పరిస్థితి తెలిస్తే తనను ఆపడానికి ప్రయత్నిస్తారని ఆమెకు తెలుసు. కనుక తన ఒళ్ళు వేడెక్కినట్లు మొహంలో చూపలేదు. అంతేకాదు, వాస్తవం తెలిస్తే తనను అరెస్టు చేస్తారని కూడా భయపడింది.
సమీపంలో పరిగెడుతున్న వారు ఆమె పురుషుడు కాదు, స్త్రీయే నని ఎక్కడ కనిపెట్టెస్తారోనని మనసులో అనుకుంది. పోలీసులను పిలిపించి పక్కకు తప్పిస్తారనీ భావించింది. అయితే అదృష్టం బాగుండి, నీ పురుగుని ఎవరైనా అడ్డొస్తే మేము నీ తరఫున నీ పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు.‌ నువ్వు నీ పురుగుని ఆపకు అని చెప్పారు. ఈ మాటతో ఆమెకు మొండి ధైర్యం వచ్చింది. లక్ష్యాన్ని పూర్తి చేయాలనే దృఢసంకల్పాని కొచ్చింది. 
ఇంతలో మారథాన్‌లో ఒక మహిళ పరిగెడుతున్నట్లు తెలిసిన వెంటనే, జనసమూహం ఉలిక్కిపడింది. ఎంతటి తెగింపో ఈమెకు అని అనుకున్నారు. ఒకరిద్దరు కోపగించుకున్నా అధిక శాతం మంది స్వచ్ఛమైన ఆనందంతో, ఆమెకు మద్దతుగా నిలిచారు. హర్షధ్వానాలు చేశారు. మహిళలు పట్టరాని ఆనుదంతో అరిచారు.
ఆమె వెల్లెస్లీ కాలేజీకి చేరుకునే సమయానికి, ఆమె పరుగు వార్త నలు దిశలా వ్యాపించింది. విద్యార్థిణులు ఆమె కోసం నిరీక్షించారు. ఆనందంతో గెంతుతున్నారు.  
మసాచుసెట్స్ గవర్నర్ ఆమెతో కరచాలనం చేశారు. 
మారథాన్‌ను పరుగెత్తిన మొదటి మహిళగా అమెరికా చరిత్ర పుటలు కెక్కిన ఆమె మూడవ స్థానంలో నిలిచింది. ఆమె సాహసాన్ని హర్షించారు.
మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో జన్మించిన గిబ్ 1940, 1950లలో బోస్టన్ శివార్లలో పెరిగారు. ఆమె బోస్టన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ టఫ్ట్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ స్పెషల్ స్టడీస్‌లో చదువుకుంది. ఆమె తండ్రి కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆమెకు చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే ఇష్టం. ఆమె ప్రతిరోజూ పాఠశాలకు ఎనిమిది మైళ్ల దూరాన్ని పరిగెత్తుకుంటూనే చేరేది. ఇలా పరిగెత్తడం ఆనందం అనేది.
అప్పట్లో మహిళలకు పరుగు పందెం బూట్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె తెల్లటి నర్సుల బూట్లతో పరిగెత్తేది. 
గిబ్ 1969లో శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకుంది. తత్వశాస్త్రంలో నిష్ణాతురాలు. 
నిజానికి ఆమె వైద్యం చదువుకోవాలని కలలు కన్నాది. కానీ ఆ రోజుల్లో స్త్రీలకు లింగ వివక్ష కారణంగా వైద్యం చదవడానికి వీల్లేకపోయింది‌ దాంతో ఆమె దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. ఆ తర్వాత ఆమె "లా" చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ జెరోమ్ లెట్విన్‌తో కలిసి ఎపిస్టెమాలజీ, కలర్ విజన్‌పై అధ్యయనం చేసింది.
1974లో, గిబ్ న్యూ ఇంగ్లాండ్ స్కూల్ ఆఫ్ లాలో ప్రవేశించి 1978లో జ్యూరిస్ డాక్టరేట్ పొందింది. ఆమె మసాచుసెట్స్ స్టేట్ లెజిస్లేచర్‌లో లెజిస్లేటివ్ అసిస్టెంట్‌గా పని చేసింది. శిల్ప శాస్త్రం, పెయింటింగ్‌పై తన ఆసక్తిని కొనసాగించింది. ఆమె 1978లో మసాచుసెట్స్ బార్‌లో చేరింది. ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టింది.
1984లో US ఒలింపిక్ ట్రయల్స్‌లో అగ్రశ్రేణి ముగ్గురు మహిళా మారథానర్‌లైన జోన్ బెనాయిట్ సామ్యూల్సన్ , జూలీ బ్రౌన్  జూలీ ఇస్ఫోర్డింగ్‌లకు ఇచ్చిన ట్రోఫీలలో గిబ్ రూపాన్ని చిత్రించారు. సామ్యూల్సన్ ఈ ట్రోఫీ గురించి చెప్తూ గిబ్ ప్రతిభ అసాధారణమని అభివర్ణించారు.

కామెంట్‌లు