సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-935
బలీయసీ కేవల మీశ్వరేచ్ఛా న్యాయము
****
బలీయసీ అనగా చాలా బలమైనది, అత్యంత శక్తివంతమైనది.కేవల అనగా మాత్రమే,కంటే ఎక్కువ కాదు, దాదాపు కాదు.ఈశ్వరేచ్ఛ అనగా దైవ నిర్ణయం, దేవుని సంకల్పం అనే అర్థాలు ఉన్నాయి.
ఈశ్వరేచ్ఛయే అన్నింటికంటే బలమైనది అనగా  దైవ నిర్ణయం లేదా సంకల్పం ముందు ప్రతిదీ బలహీనమైనదని అర్థము.
 ఎందుకు బలహీనమైదో? ఎలా బలహీనమైనదో? తెలుసుకునే ముందు ఈ వాక్యానికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దాం.అందులో ఉన్న  అర్థం ,పరమార్థం,తప్పని దైవ సంకల్పాన్ని, విధిరాతను గురించి తెలుసుకుందాం.
"స్వయం మహేశః,శ్వశురో నగేశః,సఖా ధనేశశ్చ,సుతో గణేశః,తథాపి భిక్షాటనమేవ శంభోః బలీయసీ కేవల మీశ్వరేచ్ఛా!"
అనగా తానేమో స్వయంగా మహేశ్వరుడు. అనగా అందరు దేవుళ్ళలో గొప్పవాడుగా పేరొందిన వాడు.తన మామగారేమో పర్వతాధీశ్వరుడు. స్నేహితుడేమో ధనాధిపతి అయిన కుబేరుడు.కుమారుడేమో గణేశ్వరుడు.అయినప్పటికీ శివునికి భిక్షాటనం తప్పలేదు భిక్ష కోసం తిరుగుతూ తన జీవనోపాధిని సంపాదించుకోవాలి.అది కేవలం ఈశ్వరుని ఇచ్ఛయే.ఈశ్వర సంకల్పమే.దీనిని బట్టి విధి ఎంత బలీయమైనదో మనం గమనించవచ్చు.
చూడటానికి ఇది వ్యంగ్యంగా రాసిన శ్లోకం వలె కనిపిస్తుంది.విధి యొక్క విచిత్రాన్ని మనకు అర్థం అయ్యేలా చేస్తుంది.
 సృష్టి స్థితి లయ కారకులలో శివుడెంతటి గొప్ప వాడో మనకు తెలుసు.అతడే కాదు అతని కుటుంబం కూడా ఎంత విశిష్టమైనదో ఇందులో చెప్పబడింది.
 అంతటి కుటుంబము. గొప్ప బంధు మిత్రులు ఉన్నప్పటికీ శివునికే కష్టాలు తప్పలేదు.ఇక మనమెంత వారమని విధిరాతకు తలవొంచుకు బతకడానికి అవసరమైన ఆత్మ స్థైర్యాన్ని కల్పించడానికే మన పూర్వీకులు ఈ శ్లోకాన్ని,ఈ న్యాయముతో ముడిపెట్టి రాశారని , ఆధ్యాత్మిక భావనతో చదివే  ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.
 ఇలాంటిదే శివునికి సంబంధించిన మరో కథనాన్ని చూద్దాం.
ఒకోసారి కైలాసానికి వెళ్ళిన నారదుడు శనీశ్వరుని గురించి పొగుడుతూ "శని ప్రభావం నుండి ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తుంది.శనికి ఎవరూ అతీతులు కారు " అంటాడు. ఆ మాటలకు ఆగ్రహించి శివుడు "శని ప్రభావం ఎవరి మీద పని చేసినా నా మీద మాత్రం చేయదు.అతని ఆటలు నా దగ్గర సాగవు." అంటాడు.
అసలే నారదుణ్ణి  కలహభోజనుడు అంటారు కదా! వెంటనే ఈ విషయాన్ని శనీశ్వరుని చెవిలో వేస్తాడు. ఆ మాటలు విన్న శనీశ్వరుడు విధి రాతలో భాగమే నా ప్రభావం.దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని  అంటాడా శని.
ఎలాగైనా శని మాటను అబద్ధం చేయాలి.తానన్న మాటను నిజం చేయాలి." అని భావించిన శివుడు శని ప్రభావం ఉన్నదని తెలిసిన సమయానికి అతడి కంటపడకుండా భూలోకం వెళ్ళి ఒక చెట్టు తొర్రలో దాక్కుని, హమ్మయ్య శని నన్ను ఎలా పీడించగలడు." అనుకుని ఓ రోజు గడిచిన తర్వాత కైలాసానికి వెళతాడు.
అక్కడికి వచ్చిన శని దేవుడితో నన్ను కూడా పట్టి పీడిస్తానని అన్నావు కదా! ఏమైంది నీ శపథం" అంటాడు.
అప్పుడు శని దేవుడు వినమ్రంగా "మహేశ్వరా! ముల్లోకాలకు లయ కారకుడివైన నీవు చెట్టు తొర్రలో దాక్కునే పరిస్థితి రావడం నా ప్రభావం వల్లనే కదా! దీనినే శని పట్టడం" అంటారని చెప్పేసరికి శివుడు శని యొక్క శక్తిని గ్రహిస్తాడు. అనగా విధి రాత  అని అర్థం. కాబట్టి "విధి బలీయమైనదని దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు" అనేది  ఈ "బలీయసీ కేవల మీశ్వరేచ్ఛా న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం.
 ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి మరో కథనాన్ని కూడా తెలుసుకుందాం.
విధి బలీయమైనదని చెప్పడానికి రామాయణంలో  రామ లక్ష్మణుల మరణానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా!
రామ లక్ష్మణులు బాల్యం నుంచి దేహాలు వేరైనా, ఒకే తల్లి పిల్లలు కాకపోయినా ఒకటే ఆత్మగా బతకడం రామాయణమంతా చూస్తాం.రామావతార అవసరం, కార్యం ముగిసిన తర్వాత రాముడు అవతారం చాలించవలసి ఉంది.ఈ విషయాన్ని బ్రహ్మ దేవుడు యమునితో చెబుతాడు.
యముడు ఓ సన్యాసి రూపంలో రాముని దగ్గరకు వెళ్ళి తనతో ఏకాంతంగా మాట్లాడాలనీ,ఆ సమయంలో ఎవరు వచ్చి విఘ్నం కలిగించినా వారిని పంపించిన వ్యక్తిని నీవే స్వయంగా చంపాలి." అంటాడు.
ఆ మాటలకు రాముడు ఎలాగూ తన తమ్ముడు లక్ష్మణుడు మాట తఫ్పేవాడు కాదని అతనిని కాపలా పెట్టి  సన్యాసి రూపంలో ఉన్న యమునితో మాట్లాడుతూ ఉంటాడు.
అలా వారు మాట్లాడుకుంటున్న సమయంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి వచ్చిన దుర్వాసుడు అక్కడికి తన శిష్యులతో సహా వచ్చి లక్ష్మణునితో  రాముని దర్శనం ఆ తర్వాత భోజనం ఏర్పాటు చేయించమని అడుగుతాడు. రాముడు ఎవరినీ లోనికి రానివ్వద్దన్న విషయం చెబితే దుర్వాసుడు కోపంతో మండిపడతాడు. ఇక తప్పని పరిస్థితుల్లో లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళి విషయం చెబుతాడు.
 అయితే వచ్చిన యముడు తాను పెట్టిన నియమం గురించి రాముడిని "మరిచిపోయావా? " అని అడగడంతో తన అన్నకు అవమానం కలుగకూడదు.అపవాదు రాకూడదని లక్ష్మణుడు వెంటనే సరయూ నదిలో మునిగి మరణిస్తాడు. అది తట్టుకోలేక శ్రీరాముడు తన రాజ్యాధికారాన్ని ఇతరులకు అప్పగించి వేలాది మంది ప్రజలు చూస్తూ ఉండగా తాను కూడా సరయూ నదిలో మునిగి మరణిస్తాడు. విధి ప్రభావం వల్ల రామలక్ష్మణులు ఆ విధంగా మరణిస్తారు.
విధి ఎంత బలీయమైనదో చెప్పడానికి శ్రీకృష్ణుడి మరణాన్ని మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు
కౌరవుల తల్లి గాంధారి శాపం తనకు తప్పదని తెలిసిన శ్రీకృష్ణుడు ద్వారకకు దూరంగా ఓ తపోవనానికి వెళ్లి ఎడమ కాలును కుడి కాలుమీద ఉంచి రావి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఓ బోయవాడు అతడిని జింకగా భావించి ప్రాణాంతకమైన బాణాన్ని వేస్తాడు.ఆ బాణం శ్రీకృష్ణుడి ఎడమ పాదం అడుగు భాగంలో తాకుతుంది. దగ్గరకు వచ్చిన బోయవాడు తన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు. జరిగినదంతా తన కోరిక ప్రకారమే విధిగా ఇది జరగాల్సిందే అని చెప్పి లోకాన్ని విడిచి పెడతాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మిక పరంగా ఎన్నో కథలు, కథనాలు ఉన్నాయి. మొత్తంగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే "విధి బలీయమైనదనీ, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని" నమ్మకం ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు ఎలా ఏ కారణం చేత మరణిస్తామో, ఈ తనువు చాలిస్తామో తెలియదు.అందుకే బతికినంత కాలం మనకు చేతనైన మంచి పనులు చేసి ఆత్మ తృప్తి కలిగేలా జీవిద్దాం. మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు