"ఉన్నారు…ఉన్నారు…
"బంగారు భర్తలు" ఇంకా
"ఈ భూమిపైన బ్రతికే" ఉన్నారు..!
ముడుముళ్ల
బంధానికి
ముద్ర వేసినందుకు…
ఏడడుగులు
తోడుగా నడిచినందుకు…
శోభనపు గదిలో స్వర్గాన్ని
అనుభవించినందుకు…
దొంగలా హృదయాన్ని
దోచుకున్నందుకు…!
వంశాభివృద్ధి కోసం
ప్రసవ సమయాన తాము
ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి...
మృత్యువుతో పోరాడి
పునర్జన్మను పొందినందుకు...
మాతృత్వపు కిరీటాన్ని ధరించి...!
భర్తలకు "తండ్రులుగా"
"ప్రమోషన్" ప్రసాదించినందుకు...
కృతజ్ఞులై...తమ భార్యలను
"భగవంతుడు అందించిన
"బహుమతులుగా" భావించే భర్తలు...ఉన్నారు...ఉన్నారు
ఇంకా ఈ భూమిపైన బ్రతికే ఉన్నారు..!
కట్టుకున్న భార్య కరోనా రోగియైనా
ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న
కంటకారే కన్నీటిని తుడిచిన...
కరుణామయులైన భర్తలు…
ఉన్నారు...ఉన్నారు ఇంకా
ఈ భూమిపైన బ్రతికే ఉన్నారు...!
కదలలేకున్నా...
కంటిచూపు ఆనకున్నా …
మంచానికే పరిమితమైనా...
అన్నీ తామేఐ మలమూత్రాలను
మానవతతో శుద్ధి చేస్తూ…
దుస్తులు మార్చి...తిండి తినిపిస్తూ…!
చంటి పిల్లల్లా...కంటి పాపల్లా
తమ భార్యలను చూసుకునే…
దయామయులు…ప్రేమామయులు…
మంచి మనసున్న..."బంగారు భర్తలు"
ఉన్నారు…ఉన్నారు...
ఇంకా ఈ భూమిపైన బ్రతికే ఉన్నారు..!
ఇంట కాలు పెట్టిన నాటినుండి
కడకు కళ్ళుమూసి కాటికెళ్ళేవరకు
చిరునవ్వులతో వెట్టిచాకిరి చేసి...చేసి
కొవ్వొత్తుల్లా...కరిగిపోయినందుకు…
నీడనిచ్చే పచ్చని చెట్లలా...
నిశ్శబ్దంగా ఒరిగిపోయినందుకు…!
ఆ భాగస్వాములకు…
ఆ భార్యామణులకు…
ఆ మాతృమూర్తులకు…!
ఆశాదీపాలుగా…
రక్షణ కవచాలుగా...
ప్రేమకు ప్రతిరూపాలుగా…
భగవత్కరుణాస్వరూపులుగా...!
"మనసున మనసై…
"బ్రతుకున బ్రతుకై…
"తోడొకరుండిన
"అదే భాగ్యమూ...
"అదే స్వర్గమూ"... అని నమ్మి…
భార్యలను "దేవతలుగా"
భావించి…పూజించి...ఆరాధించే...
"బంగారు భర్తలు" ఉన్నారు…ఉన్నారు…
ఇంకా ఈ భూమిపైన బ్రతికే ఉన్నారు..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి