మనిషిగా పుట్టడం కనుక జరిగితే, ఆడైనా, మగైనా ఆమనిషికి ఒక పేరుంటుంది. కానీ అలాంటి కొందరి పేర్లు మాత్రం చలా తమషాగా వుంటాయి. అయితే అలా తమాషాగా పేర్లు పెట్టడం వెనుక ఏదో ఒక కారణం వుండివుంటుందనిపిస్తుందినాకు.
మా పెద్దమ్మ కొడుకులు తొమ్మిదిమందిలో పెద్దకొడుకు పేరు పెంటయ్య.పుట్టిన పిల్లలు పురిటిలోనే పోతుండటంతో,ఆపేరు పెట్టారుట. నిజానికి అలా ఆ పేరు పెట్టేముందర ఆ పుట్టిన బిడ్డను ఒకసారి పెంటమీద పడేసితీస్తారట. మరి అపరిమితమైన ఆచారస్తులైన మా పెద్దమ్మావాళ్ళూ అలా పుట్టిన బిడ్డను నజంగా పెంటమీద పడేసి వుడరనుకొంటాను. .అయితే అదే పెంటయ్య పేరు మా పెద్దదొడ్డమ్మ ఇంట్లో పనిచేసే అతడికి కూడావుండేది. ఆంధ్రప్రదేశ్ లో చాలామందికి ఈ పెంటయ్య పేరుంటుంది.అలాగే పెంటమ్మలు కూడా చాలామందేవుంటారు.
అయితే మాపెద్దమ్మ కొడుకు అసలుపేరుమాత్రం ప్రభాకర్రావు.
మరో తమషాపేరు
'అబద్ధం'. మా రౌతులపూడిలో నాకు తెలిసీ తెలుకుల వెంకటరత్నం కూతురుపేరూ, బొల్లి పోలమ్మ మనవరాలిపేరూ, మా పొలంలో పనిచేసే ఆడపాలికాపుపేరూ కూడా అబద్ధమే. ఇంకా ఎంతమంది 'అబద్దాలు' వున్నారో మన రాష్ట్రంలో నాకు తెలియదు..ఈ 'అబద్దం'పేరుకూడా పుట్టిన వెంటనే పిల్లలు చనిపోతుంటే, "అబ్బే!మాఇంటిలో ఆసలు పిల్ల పుట్టనే లేదు, పుట్టిందన్నమాట 'అబద్ధం'అని యమధర్మ రాజుని మభ్యపెట్టడానికి పెట్టిన పేరనుకొంటానది.
ఇలాగే మరిన్ని తమషాపేర్లు చాలానే వున్నాయి. దెయ్యం,
పాము, పందికొక్కు, గారాలు, ఇంకా ఇలాంటి పేర్లుచాలా వున్నట్లుగుర్తు.మరి ఈపేర్లు ముద్దుపేర్లలా కూడా తోచవు.ఎదుకలాంటి పేర్లు పెట్టేవారో ఏమోమరి వాళ్ళకే తెలియాలి.
మా ఊర్లో ఒకావిడను 'ఊరందరత్తయ్యగారు'అని పిలిచేవారు.అలాగే నల్లమావయ్యగారనే మా బంధువు వుండేవారు.ఆయన ఊర్లో అందరికీ నల్లమావయ్యగారే. అలాగని ఆయనేమీ నల్లగా వుండేవారుకాదు.ఆ యన భార్య మాత్రం నల్లగా... వుండేవారు, ఆవిడపేరుకూడా తమాషాపేరే 'పుల్లప్ప'.
ఆవిడ కూతురు పేరు 'శీనమ్మ'.తమాషాగాలేదూ? మాఊళ్ళోనేకాదు, ఈ నల్లమావయ్యలు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇళ్ళలో వుంటారు. మరికొన్ని తమాషాగా అనిపించే పేర్లు, 'దొంగ'దొంగబ్బాయిలు. 'దేవుడు' 'దేవుళ్ళు.' 'నేరేళ్ళు'ఇలాంటివి
ఇక ముద్దు పేర్ల విషయానికొస్తే, పాపలూ, పాపక్కలూ , బాబులూ బేబీలూ,
బాబిలూ, నానీలూ, చిన్నలూ,చిన్నారులూ,చింటూలు, చిన్నూలు చిన్నమ్మలూ చోటూలూ, చోటీలూ, బండాడు, బండలూ, కన్నలూ,కన్నమ్మలూ, మున్నలూ, మున్నీలూ, బుజ్జిలూ, బుజ్జాయిలు,డుంబులూ ఆంధ్రప్రదేశ్లో ఎందరెందరోకదా! పేరునిబట్టి వారి వయసును ఊహించుకొంటే, ప్పులోకాలేసిజారి పడినట్లే.నిజానికి ఈ పై పేర్లలో మీదీ ఏదో ఒక పేరయ్యేవుంటుంది, నాకు తెలుసు.నాకు డభై ఐదేళ్ళు వచ్చినా నన్నూ కొందరు మా రౌతులపూడిలో పెదపాపగారనే అంటారు.చినపాప ఇప్పుడు లేకపోయినా నేను పెదపాపనే.
ఇక మా ఐసన్నయ్య పేరు దగ్గరకువద్దాం. అయితే ఊరందరికీ ఐసన్నయ్యకాడతడు, మా నల్లమావయ్యగారిలా.ఐసూ, ఐసుగారూ, ఐసుబాబుగారూ అనే ఊర్లోవారు పిలుస్తారు
మా చిన్నప్పుడు అతడిని "ఐసన్నయ్యా!నీకా పేరెలావచ్చిందీ?"అని అడిగేవాళ్ళం పిల్లలం. నవ్వేసేవాడే కానీ సమాధానం మాత్రం చెప్పేవాడుకాదు.బహుశా అతడికీ తెలియదేమో.అతడి చిన్నప్పుడు, ఐస్ క్రీములు వుండి వుండవుకానీ, పుల్ల ఐస్ ప్రూటులు ఐదుపైసలవీ, పది పైసలవీ వుండేవికదా!వాటికోసం అస్తమానూ పేచీపెట్టి కొనుక్కొని తినేవాడనుకొంటాను. అందుకనే ఆపేరువచ్చివుటుంది. అంతకన్నా అలా 'ఐస్ ' అనే పేరు రావడానికి వేరే కారణాలేవీ కనపడవుమరి.ఐతే మన ఉభయ ఆంధ్రరాష్ట్రాలలోనూ 'ఐసు ' అనేపేరు మరెవరికీ ఉండదని మాత్రం నేను గట్టిగా ఘంటపథంగా చెప్పగలను. అదిసరే, మా ఐసన్నయ్యకూ ఒక మంచిపేరుంది కానీ, మాఊర్లో ఆ పేరు ఎవరికీ తెలీదు.అలాగే ఐస్ గారంటే తెలియనివారూలేరు. మాఊర్లోనేకాదు, మ చుట్టుపట్ల ఊర్లలోకూడా.
మా ఐసన్నయ్య ఇదే పేరుతో అందరికీ తెలుసు. కానీ,అతడి అసలు పేరు 'ఆచంట సుందర సుబ్బరామయ్య' అనిమాత్రం ఏ కొద్దిమందికో తెలిసుంటుంది..ఈ పేరుతో మాఊళ్ళో ఎవరినైనా అడిగితే, అలాంటి పేరుగలవాళ్ళు మా రౌతులపూడిలో ఎవరూ లేరంటారు.
మా ఐసన్నయ్య మంచి మాటకారి,కార్యదక్షుడూ, వ్యవహారవేత్త, ఏపార్టీ ఏనా పోటీచేయమని టికట్టు ఇస్తే మంచి పొలిటీషియన్ కూడా అయివుడవాడు.అతడిని నమ్మినవారికి ఆత్యంత నమ్మకస్తుడు, ప్రీతిపాత్రుడు,ధైర్యవంతుడుకూడా, మా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రాజకీయనాయకులకు బహు
సుపరిచితుడు,వారికి కుడిభుజంవంటివాడు.మా నాన్నకి వెన్నంటుండి , రాజకీయాలూ, రాజకీయనాయకులతో మెలిగే విధానం చక్కగా అలవరచుకొన్నాడు. ఒకరకంగా మానాన్నని రాజకీయగురువుగా భావిస్తాడతడు.
మానాన్నని 'నాన్నా 'అనీ, మా అమ్మని 'పిన్నీ' అనీ ఆప్యాయంగా పిలిచేవాడు. మా ఆమ్మా, నాన్నా కూడా ' ఆబ్బాయ్ ఐసూ! 'అనిపిలిచేవారు. మాఅమ్మకు అతడంటే,తల్లి తండ్రులూ, భార్యా బిడ్డలూ లేనివాడనీ జాలి,ప్రేమ, అభమానం.మానాన్నా అతడూ మనసువిప్పి మాట్లాడుకొనేవారు. ఒక సారి ఏదో సందర్భంలో మానాన్నతో ఐసన్నయ్య, "నాన్నా!నాకేమిటో ఈమధ్య పొట్ట బాగా వచ్చేస్తోంది, తిండి తగ్గించినాసరే" అన్నాడు.ఆప్పుడు మానాన్న, "పొట్ట వచ్చిందంటే రాదామరి, మొన్న మన పురోహితులు లక్షి గారింట్లో సంతర్పణకు వెళ్ళినప్పుడు అరడజనుకి పైగా బూరెల్లో పెద్ద కన్నంపెట్టి, నెయ్యి వేయించుకు తినడం నేను చూడలేదనుకోకు." అన్నప్పుడు ఐసన్నయ్య సిగ్గుపడిపోయాడు.ఈవిషయం వింటే వారిద్దరి మధ్యనా వున్న చనువు అర్థమౌతుంది. నిజానికి ఒకరకంగా చూస్తే,మాకు అతడితో చాలా దూరపుచుట్టరికము వున్నా,(మానానమ్మకి పెదతండ్రి కొడుక్కి కూతురు కొడుకు.)కానీ మాకలా అనిపించేదికాదు. మాపెద్దన్నయ్యలాగే భావించేవాళ్ళం మేమతడిని.మాకు ఏదైనా కావాలని మానాన్ననడిగితే, "ఐసన్నయ్యను అడగండమ్మా!"ఆనేవారు. ఆయనకు కావలసిన 'ఫాషన్ షో '
సిగరెట్ టిన్నులదగ్గరనుంచీ, ఏమికావలసినా తనే తెచ్చేవాడు. అమ్మకూడా "అబ్బాయ్! ఊరెళ్ళినప్పుడు ఫలానాది తెచ్చిపెట్టు."అని తనకుకావలసినవి తె ప్పించుకొనేది.
నా పెళ్ళి ఐసన్నయ్యా, మా అన్నయ్యా వాళ్ళిద్దరూ తమభుజసస్కందాలపై వేసుకొని ఝంమ్మంటూ జరిపించారు. నాపెళ్ళైన చాలా రోజులవరకూ పండగలకూ- పబ్బాలకూ, ఐసన్నయ్యే వచ్చి తీసికెళ్ళేవాడు.
'గిడజాం' ఆనే గ్రామానికి కరంణంగా పనిచేసిన ఐసన్నయ్యది మా రౌతులపూడికాదసలు. ఇది అతడికి అమ్మమ్మగారి ఊరు. చిట్టాప్రగడ లక్ష్మీపతిరావుగారూ, చిట్టి వెంకటరావులకు మేనల్లుడు. ఐసన్నయ్య అసలమ్మను ఆచంట చిట్టెమ్మగారనేవారు. ఆమె ఇద్దరి కొడుకుల్లో చిన్నవాడైన యితడిని చిట్టమ్మగారు తన తోడికోడలికి దత్తత ఇచ్చిందట. ఆ దత్తత తల్లి పోగానే, బోల్డంత ఆస్థితో మేనమామ కరిణీకం ఇప్పిస్తానంటే, మా రౌతులపూడి చేరుకొని, గిడజాం కరణంగా ఇక్కడ సెటిలైయ్యాడు.బో ల్డంత దత్తత ఆస్థితో వచ్చిన అతడు ఎవరి స్వార్దంవల్లనైతేనేమీ, ఆస్థితోపాటు, జీవితంలో చాలా, ఇంచుమించుగా అన్నీ కోల్పోయాడు కానీ, ఏనాడూ భీరువుకాలేదు.ఇతరులు తప్పుగా భావించే పనిని, చాటుమాటుగా, రెడోకంటివాడికి తెలియకుండా పదిమందితో చేసేపనిని అతడు నిజాయితీగా, చాటుమాటులు లేకుండా చేసాడు. ఒంటరితనానాన్ని, జయించలేక చేసాడు. అమ్మలా ఆదరించిపెట్టే గుప్పెడన్నంకోసం చేసాడనకొన్నారే కనీ, అతడిని మాఊరివారెవరూ తప్పుపట్టలేదు. పరోపకారంతోపాటుగా,కించత్తు లౌక్యం, మాటనేర్పరితనం కలిగుండడంవలన,మారౌతులపూడిలోనే కాక, చుట్టుపట్ల ఊర్లలోకూడా,పదిమందిలో ఒకడిగాఔనని పించుకొని,అందరికీ తలలోనాలుకలా వుంటాడు. "ఈనాడిలా నేనున్నానంటే, అంతా మన నాన్న పెట్టిన భిక్ష, నాన్నే నాకు గురువూ దైవం."అంటాడు మాన్న కొండ్రజుగురించి వినమ్రంగా. మా ఊరిలోని పెద్ద షాహుకర్లైన కేదారిశెట్టి వెంకటరమణగారి తదనంతరం, వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి,వారి వ్యాపార, వ్యవహారాలలో సలహా సంప్రదింపులకు ఉపయోగపడుతూ వున్నాడు మా ఐసన్నయ్య.వారుకూడా అతడిని తమతోడబుట్టిన వాడిలా చూసుకోవడం వలన ఎనభై పైబడిన వయసులోకూడా, ఐనవారెవరూ లేకపోయినా, ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినానిశ్చింతగా కాలంగడుపుతున్నాడతడు.'నా వాడంటూ' అంటూ ఆదరించిన ఆమెతోడుకూడ ఈ పెద్దవయసులో కోల్పోయినా, 'సింహం ముసిలి ఐనంతమాత్రాన ఠీవి తగ్గదు 'అన్నట్లుంటాడతడు. తన టైములోని రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకీ, రాజకీయనాయకులకు చాలా తేడాలున్నాయి.కుడి ఎడమ భుజాలము మేమంటూ, భుజాలను చరుచుకొంటున్న చోటా మోటా నాయకులెందరువచ్చినా, రాజకీయాలలో పెనుమార్పులొచ్చినా, ఐసుగారి ప్రత్యేకత ఐసుగారిదే అంటారు మా ఊరివారు.మా ఊరి 'పంపా 'సెల ఏరు దిశను మార్చి ప్రవహించినట్లు ఈనాటి యవత మా ఐసన్నయ్య సమర్థతను పట్టించుకోక పోయినా, అతడి గౌరవానికేమీ భంగం కలగటంలేదు.తుఫానులనే లెక్క చేయని పెనువృక్షం, గాలివానను లెక్కచేయదుకదా!. మా ఐసన్నయ్యకూ అంతే, మడత నలగని ఖద్దరు చొక్కాతో, తెల్లగా మెరిసి పోతున్న, ఇస్తీ చేసిన గ్లాస్కోపంచతో, వీధిలో నడిచి వస్తున్నప్పుడు దసరాబుల్లోడులో నగేశ్వర్రావులాగ, ఆ గ్లాస్కోపంచ కొసను చేత్తో పైకెత్తి పట్టుకొని ఠీవిగా నడిచొస్తుంటే,'ఆహా.... సింహానికిలేదు ముసలి తనం' అనిపిస్తుందిప్పటికీ, మా ఐసన్నయ్యనుచూస్తే. మరో పది కాలాలపాటు మా ఐసన్నయ్య అరోగ్యంగా జీవించాలని ఆశిస్తూ,
అభిమానంతో
చెల్లెలు సత్యవాణి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి