సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు 922
లోభో మూల మనర్థానాం న్యాయము
****
లోభం అనగా పిసినారితనం,పేరాశ, కక్కుర్తి,పిసినితనం.మూలం అనగా ప్రారంభం , మొదలు,ఆధారం, వేరు.అనర్థానాం అనగా  కీడు,హాని, దుష్పరిణామాలు, ధనము లేకుండుట,ఏ విధమైన ప్రయోజనం లేకపోవుట అనే అనేక అర్థాలు ఉన్నాయి.
లోభమే సమస్త అనర్థాలకు కారణము అని అర్థము.
స్వంత అవసరాలకు కూడా ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పని స్వభావమే లోభము. ఇది మనిషిని సర్వ నాశనం చేసే,అధఃపాతాళానికి దిగజార్చే అరిషడ్వర్గాలలో ఒకటి.
కామ క్రోధ లోభ మోహ మద మాచ్ఛర్యాలను మనిషి యొక్క ఆరుగురు శత్రువులుగా మన పెద్దలు చెబుతుంటారు.ఇందులో ఏ ఒక్కటి ఉన్నా  శత్రువులా దాడి చేసి వ్యక్తి పతనానికి దారి తీయిస్తుంది.
 ఇక లోభం కలిగిన వ్యక్తి అనగా లోభి దగ్గరకు వెళితే ఏం జరుగుతుందో చక్కని పద్యాన్ని ఉదహరించాడు మన ప్రజాకవి వేమన.అదేమిటో చూద్దామా!
గొడ్డు టావు బిదుక గుండ గొంపోయినా/ పాల నీకు తన్ను పండ్లు రాల/లోభి వాని నడుగ లాభంబు లేదయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా గొడ్డుటావు దగ్గరకు పాలు పితకడానికి కుండను తీసుకుని వెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది.కాని పాలివ్వదు.అదే విధంగా లోభిని యాచించడం కూడా వ్యర్థమే అని అర్థము.
 భాస్కర శతక కర్త దీనినే మరో కోణంలో  రాశారు.అది కూడా చూద్దాం.
అతి గుణ హీన లోభికి పదార్థము గల్గిన లేక యుండినన్/ మితముగ గాని కల్మి గల మీదట నైన భుజింప డింపుగా/ సతమని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినన్/ గతుగక జూచు గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా!"
అనగా భాస్కరా! ఏరులలో జలము నిండి ప్రవహించుచున్నను, కుక్క కతుకుటకే ఇష్టపడును కాని చక్కగా త్రాగదు.అలాగే  మిక్కిలి లోభి యగువాడు తనకెంత ఐశ్వర్యమున్ననూ, తాను మాత్రం తక్కవగానే భుజించును. అనగా కడుపు నిండా తినకుండా ఉండటం అన్నమాట.తనకు లేనప్పుడు తక్కువ తినుట అనేది తప్పదు. ఉండి కూడా పిసినారి తనమును చూపుతాడు.ఇంకా ఈ లుబ్దుడు తనకు ధనము పుష్కలంగా ఉన్న కాలములోనైనా కడుపారా భుజించకుండా ఎక్కడ ధనము తరిగి పోతుందో ఏమోనని కడుపు మాడ్చుకుంటాడని అర్థము.
ఈ  లోభత్వాన్ని చూస్తుంటే  ఓ సినిమాలో కోటా శ్రీనివాసరావు దూలానికి కోడిని వేలాడదీసి అన్నం తినే సన్నివేశం  కళ్ళముందు మెదులుతుంది ఎవరికైనా.
 ఇలా లోభము వల్ల సర్వము అనర్థమే అనడానికి కారణం అతడే తిననప్ఫుడు ఇతరులకు ఎలా పెడతాడు. పెట్టడు కదా! అతడి వల్ల ఇంటిల్లిపాదీ యిబ్బంది పడుతుంటారు. దాని వల్ల అతడికేమైనా లాభమా? అంటే కాదనే సమాధానం వస్తుంది. తినీ తినక పోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. లోభత్వంతో వేసుకునే దుస్తులు, కనిపించే తీరు, ప్రవర్తన అతడిని ప్రతి ఒక్కరూ దూరం పెడతారు.
 ఈ సందర్భంలో  మరో కథ మన  చిన్నప్పుడు చదువుకున్నది గుర్తుకు వస్తుంది.  ఓ పిసినారి ముసలివాడు తాను కూడబెట్టిన సొమ్ము అంతా బంగారం ముద్దగా మారుస్తాడు. దానిని ఇంట్లో ఉంటే దొంగలు దొంగిలిస్తారని ఊరి బయట ఓ పాడుపడిన కోనేరు దగ్గర, మనుషులు తిరుగని చోట ఓ గుంట తవ్వి అందులో బంగారు ముద్ద పెట్టి దాస్తాడు. దాని మీద మనసు ఆగక రోజూ వెళ్ళి చూసి రావడం ఓ దొంగ గమనిస్తాడు. అతడు చూసుకుని వెళ్ళిన తరువాత వెళ్ళి చూసి ఆ బంగారు ముద్ద అంత పరిమాణంలో ఉండే ఓ గుండ్రాయి అందులో పెట్టి ఆ బంగారాన్ని దొంగిలించుకుని పోతాడు.
 మరుసటి రోజు వచ్చి చూస్తే బంగారు ముద్ద బదులుగా గుండ్రాయి ఉండటం చూసి లబోదిబో అంటాడు. అది తెలిసిన ఇరుగు పొరుగు వచ్చి అతడి లోభత్వాన్ని అసహ్యించుకుంటూ ఆ గుండ్రాయినే బంగారు ముద్ద అనుకొని తృప్తి పడమని చివాట్లు పెడతారు. అలా లోభత్వం వల్ల అతడు సాధించినది ఏమీ లేదు.  ఇలా లోభత్వంతో కూడబెట్టిన సొమ్ము తేనెటీగలు కూడబెట్టిన తేనె బాటసారుల పరమైనట్లు చివరకు దొంగల పాలో దొరల పాలో అంటే ప్రభుత్వ పరమో అవుతుంది.
అందుకే  వేమన మరో పద్యంలో లోభి గురించి ఇలా అంటాడు.
ధనము కూడబెట్టి దానంబు చేయక/ తాను దినక లెస్స దాచుకొనగ/తేనె టీగ గూర్చి తెరువరి కియ్యదా/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా ధనము సంపాదించి,దానమీయక, తాను తినక,దాచుకొనుట వల్ల ఏం జరుగుతుందంటే తేనె టీగ తేనెను ప్రోగు చేసి బాటసారికి ఇచ్చునట్లగానే ఇతరుల పాలు చేయడమే అవుతుంది అని అర్థం.
 కాబట్టి లోభత్వం అతనికి, అతని కుటుంబానికి తద్వారా సమాజానికి కూడా అనర్థమే జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వారి సొమ్ము సరియైన విధంగా సరైన సమయంలో ఉపయోగపడదు.
 కనుక ఈ "లోభో మూల మనర్థానాం న్యాయము" ద్వారా  తెలుసుకోవలసిన విషయం ఏమిటో ఈ పాటికే మనకు అర్థమవుతోంది. పిసినారి తనం కూడదు.అవసరమైనప్పుడు అవసరమైన మేర ఉపయోగించాలి. పొదుపు అవసరమే కానీ పీనాసితనం కూడదని తెలుసుకున్నాం.

కామెంట్‌లు