సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు -912
"ఘృతస్య పాత్ర మాధారో వా పాత్రస్య ఘృత మాధారోవా" న్యాయము
*****
ఘృతము అనగా నెయ్యి. ఘృతస్య అనగా నేతికి.పాత్ర అనగా  గిన్నె, లోహము లేదా మట్టితో తయారు చేసిన వస్తువు. ఆధారో అనగా ఆధారం. వా అనగా  లేదా.పాత్రస్య అనగా పాత్ర యొక్క, పాత్రకు చెందిన. మాధారోవా అనగా ఆధారమా అని అర్థము.
నేతికి గిన్నె ఆధారమా? గిన్నెకు నేయి ఆధారమా? అని ఒక తార్కికుడు నేయి నిండా ఉన్న గిన్నెను బోర్లించినాడట.
ఈ న్యాయము  అతి తెలివి ప్రదర్శించే తార్కికుడిని ఉద్దేశించి చెప్పినది.
నేతికి గిన్నె ఆధారమా? అనే ప్రశ్న ఉదయించినప్పుడు  అవును అనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే నెయ్యిని జాగ్రత్త లేదా నిల్వ చేయాలంటే  ఏదో ఒక పాత్ర అవసరం. కాబట్టి నేతికి గిన్నె ఆధారము. గిన్నెను పట్టుకొని నెయ్యి ఉంటుంది కానీ నెయ్యిని పట్టుకొని గిన్నె ఉండదు కదా! గిన్నెలో ఏది పోస్తే దానిని పట్టుకుంటుంది.
 ఇక గిన్నెలో నెయ్యి వేసి  గిన్నెతో సహా నేతిని అమ్మినప్పుడు గిన్నెతో సహా నేతికి  విలువ  పెరుగుతుంది. అంతే కానీ నేతికి గిన్నె తప్ప,గిన్నెకు నెయ్యి ఆధారం కాదు.గిన్నెను నెయ్యి ఉపయోగించుకుంటుంది. కానీ గిన్నెకు నేయి ఆధారమని  వాదించిన తార్కికుడు ఓ మూర్ఖుడని మనం అర్థం చేసుకోవచ్చు.
 మరి దీనికి సంబంధించిన ఓ సరదా కథను చూద్దామా.
పరమానందయ్య  శిష్యుల కథ అనగానే అందులోని హాస్యం , వారిలోని అమాయకత్వం గుర్తుకు వచ్చి పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది. ఇక కథలోకి వెళదాం.
 పరమానందయ్య గారి స్నేహితుడు ఓ తర్క పండితుడు. అతడు ఒకసారి పరమానందయ్య గారి దగ్గరకు వస్తాడు. కుశల ప్రశ్నలు అయిపోయిన తరువాత తన తర్కశాస్త్రం గురించి, అందులోని తర్కం గురించి చాలా సేపు మాట్లాడుకుంటారు.ఇంతకు ముందే పెద్దలు చెప్పే విషయాలను, మాట్లాడుకునే మాటలు వినడం వల్ల జ్ఞానం పెరుగుతుందని చెప్పడం వల్ల శిష్యులు వారి సంభాషణ చాలా జాగ్రత్తగా విను సాగారు. ఎంత జాగ్రత్తగా విన్నా వారికి ఆ తర్కం, మీమాంసలకు సంబంధించిన విషయ జ్ఞానమేదీ వారికి ఒంటబట్టడం లేదు.
 
ఇంతలో గురుపత్ని శిష్యులలో ఓ ఇద్దరిని పిలిచి అతిథి కోసం నెయ్యి తెప్పించేందుకు ఓ గిన్నె, డబ్బులు ఇస్తుంది.
ఆ శిష్యులు ఇద్దరూ వీధిలోకి వెళ్ళి నేతి వ్యాపారికి డబ్బు ఇచ్చి నేతిని గిన్నెలో పోయించుకుంటారు.దారిలో వస్తూ గురువు గారికి,తర్క పండితుడికి మద్య జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. వెంటనే ఆ శిష్యులు ఇద్దరూ తర్కాన్ని మొదలు పెడతారు.నెయ్యికి గిన్నె ఆధారమా? రెండో వాడిని అడుగుతాడు. రెండో వాడు 'కాదు కాదు గిన్నెకే నెయ్యి ఆధారం"అంటాడు. దాంతో కోపం వచ్చిన మొదటి వాడు గిన్నెకే నెయ్యి ఆధారం అన్నావు కదా! మరి ఇప్పుడు  నెయ్యి గతి ఏమౌతుందో  చూద్దామా?అని గిన్నెను బోర్లిస్తాడు.గిన్నెలోని నెయ్యి అంతా ఒలికి నేలపాలు అవుతుంది.అప్పుడు రెండోవాడికి కోపం వచ్చి నెయ్యి ఉండటం వల్ల ఈ గిన్నె నీ చేతిలో ఉంది. నెయ్యి ఆధారం పోయింది కాబట్టి నీ గిన్నెకు ఏ ఆధారం లేదు అంటూ  మొదటి వాడి చేతి మీద గట్టిగా కొడతాడు. దాంతో అతడి చేతిలోని గిన్నె కాస్తా ఎగిరి పక్కనే ఉన్న నీటి కాలువలో పడుతుంది.నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది.
ఉట్టి చేతులతో ఇంటికి వచ్చిన ఆ శిష్యులను గురుపత్ని నెయ్యేది? నేతి కోసం ఇచ్చిన గిన్నె ఏది అని అడుగుతుంది. వాళ్ళు గురువు గారు మరియు తర్క పండితుడి సంభాషణ విన్న విషయం, ఆ తర్వాత తాము ఏం చేశారో పూసగుచ్చినట్టు చెబుతారు. అంతా విన్న గురుపత్నికి  వారి మూర్ఖత్వానికి జాలిపడాలో ,కోపపడాలో తెలియ తల పట్టుకుంటుంది.
 "ఘృతస్య పాత్ర మాధారో వా పాత్రస్య ఘృత మాధారోవా" న్యాయము ద్వారా  మన ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే నేతికి గిన్నె  ఆధారం అయినట్లుగా అయినట్లుగా దేహమనే నేతికి జీవుడనే గిన్నె ఆధారం అంటారు.
అంతే కానీ గిన్నెకు నేయి ఆధారమని వాదించిన తార్కికుడు కానీ, పరమానందయ్య శిష్యులు  గాని పరమ మూర్ఖులని మనకు అర్థం అవుతోంది. మరి అలాంటి మూర్ఖపు వాదనల జోలి పోవద్దని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకున్నాం.అంతే కదండీ!

కామెంట్‌లు