కథల విలువ : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రుతి, లయలు ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ వాళ్ల తరగతిలో అత్యంత తెలివైన వారు. ఒకరోజు పాఠశాల అయిపోయిన తరువాత ఇంటికి వెళ్తుండగా భారీ వర్షం వస్తుంది. లయను శ్రుతి మరియు వాళ్ల నాన్న శ్రుతి వాళ్ల ఇంటికి తీసుకు వెళ్తారు. ఆ రాత్రి కూడా తమ ఇంట్లోనే ఉండమని పట్టు పడతారు. లయ అలా ఆ రాత్రి శ్రుతి ఇంట్లో ఉండవలసి వస్తుంది. 
    ఆ రాత్రి శ్రుతి వాళ్ల నాయనమ్మ దగ్గరకు చేరింది. శ్రుతితో పాటు లయ కూడా అక్కడకు వచ్చింది. "నాయనమ్మా! రోజూలాగే ఈరోజు కూడా కథలు చెప్పాలి. కానీ ఈరోజు చెప్పే కథలు చాలా స్పెషల్ గా ఉండాలి." అన్నది శ్రుతి. ఆరోజు శ్రుతి వాళ్ల నాయనమ్మ అద్భుతమైన కథలు చెప్పింది. లయ చాలా ఆసక్తిగా విన్నది. ఆరోజు శ్రుతి వాళ్ల ఇంట్లో గడపడం లయకు మరచిపోలేని అనుభవం అయింది.
     లయ ఆలోచనలో పడింది. తనకూ నాయనమ్మ ఉంది. కానీ ఆ నాయనమ్మ తీరిక సమయం అంతా టీవీలలో వచ్చే డైలీ సీరీయళ్ళ వీక్షణానికే సరిపోతుంది. తనకు కథలు కాదు కదా! కబుర్లు చెప్పే తీరిక కూడా ఉండదు. చదువుకోవడం, తీరిక సమయాలలో మొబైల్ ఫోన్లతో కాలక్షేపం. ఇదే తన దినచర్య. కథలు వినడం ద్వారా ఆనందం, కథల విలువ తెలిసి వచ్చింది. తీరిక సమయాలు నీతి కథలు వినడం లేదా చదవడం కోసం కేటాయించాలి అనుకుంది లయ. 

కామెంట్‌లు