నల్లాని రాజేశ్వరికి డాక్టరేట్ ప్రదానం

 - డా. నల్లానికి పలువురి అభినందనలు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నల్లాని రాజేశ్వరికి వర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. విభాగాధిపతి ప్రొఫెసర్ జి.వి. రమణ మార్గదర్శకత్వంలో రాజేశ్వరి పరిశోధన పూర్తి చేశారు. "అనంతపురం జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు - ఒక అధ్యయనం" అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి, కవయిత్రి, కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి తన పరిశోధన గ్రంథంలో పలు కీలక సూచనలు చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. బాలలహక్కుల పరిరక్షణ సామాజికబాధ్యత అని రాజేశ్వరి పేర్కొన్నారు. తన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేసిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి, పి.హెచ్డి. గైడ్ ప్రొఫెసర్ జి.వి రమణకు, పరిశోధన, అభివృద్ధి విభాగం డీన్ కు, పరిశోధనలో సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాలపైగా విద్య, సాహిత్య, సామాజిక సేవారంగంలో కృషి చేస్తూ, ఎం.ఏ., బి.ఎడ్., పిజిడిసిఏ., పూర్తిచేసిన రాజేశ్వరికి డాక్టరేట్ లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
*   *   *

::నిరంతర స్ఫూర్తిదాత నల్లాని రాజేశ్వరి ::
విద్య, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవారంగాల్లో విశిష్ట సేవలందిస్తూ నిరంతర స్ఫూర్తిదాతగా నిలిచారు నల్లాని రాజేశ్వరి. మూడు దశాబ్దాలకు పైగా బహుముఖ సేవలందిస్తున్న ఆమె పలు అవార్డులు, సత్కారాలను అందుకున్నారు. దక్షిణ భారత మహిళా విజేత - 2025 పురస్కారాన్ని ఈ ఏడాది జూలై 6న చెన్నైలో స్వీకరించారు. విద్య, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవారంగాల్లో నల్లాని రాజేశ్వరి అందిస్తున్న బహుముఖ సేవలు స్ఫూర్తిదాయకమని అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించింది. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ తమిళనాడు రాష్ట్ర శాఖ, ట్వల్ మేగజైన్, గ్లోబల్ పింక్ ఆర్మీ సంయుక్త ఆధ్వర్యంలో జూలై ఆరో తేదీ చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ ఆడిటోరియంలోజరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆమెకు అవార్డును ప్రదానం చేశారు.
గతంలో నల్లాని రాజేశ్వరి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం "రాజ్యమహిళా సమ్మాన్" అవార్డు - 2014ను ప్రకటించింది. ఒక రాష్ట్రం నుంచి కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చే ఈ అవార్డును, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2015 మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు సభలో రాజేశ్వరికి అందజేసి, ఆమెను ఘనంగా సత్కరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున విశిష్ట మహిళా అవార్డు - 2018, ఉగాది పురస్కారం - 2017 ను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రాజేశ్వరి అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడుసార్లు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం నల్లాని రాజేశ్వరి సేవలకు నిదర్శనం.
ఉమ్మడి అనంతపురం జిల్లా బాలల సంక్షేమ సమితి (సి.డబ్ల్యు.సి) చైర్ పర్సన్ గా 2018-21 కాలంలో నల్లాని విశేష సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యాహక్కుచట్టం పటిష్ట అమలుకు రాష్ట్ర ప్రభుత్వ సలహామండలి సభ్యురాలిగా కీలక సేవలందించారు.
శ్రీవెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా, ఉదయ్ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలిగా, నల్లాని రాజేశ్వరి ఇన్షియేటివ్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ గా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధరంగాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలందిస్తున్న పలువురిని గుర్తించి ప్రతి ఏటా పదిమందికి అవార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (సోషియాలజీ), బి.ఎడ్., ( సోషల్ స్టడీస్) పూర్తి చేశారు. ఎస్కేయూ సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.వి రమణ పర్యవేక్షణలో, "అనంతపురం జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు : ఒక అధ్యయనం" అనే అంశంపై రాజేశ్వరి పిహెచ్.డి., పరిశోధన పూర్తి చేసి, డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సాంకేతికంగా పీజీ డిప్లమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (పిజిడిసిఏ) పూర్తి చేశారు.
అంతేగాకుండా "బాలికా విద్య, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత, ప్రజారోగ్యం, నైతిక విలువల పెంపు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాలపై ప్రముఖ తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలో పలు వ్యాసాలు రాస్తున్నారు. టిటిడి ప్రచురిస్తున్న "సప్తగిరి" మాసపత్రికలో "బాలనీతి" శీర్షికతో బాలల కథలు, స్ఫూర్తిదాయక వ్యాసాలను వెలువరిస్తున్నారు.
నల్లాని రాజేశ్వరి సామాజిక వ్యాసాల సంపుటి “సాధికారత” పుస్తకాన్ని 2019 జూలైలో అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. పలువురు విద్యార్థులు "నల్లాని రాజేశ్వరి సాధికారత వ్యాసాలు - సమగ్ర పరిశీలన" అనే అంశంపై అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., తెలుగు పట్టా కోసం పరిశోధన వ్యాసాన్ని కూడా సమర్పించారు. నల్లాని స్వీయ కవితాసంపుటి "బంగారుతల్లి" పుస్తకాన్ని 2021లో అప్పటి "తానా" అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వ అధ్యక్షులు, ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తదితరులు తిరుపతిలో ఆవిష్కరించారు.
ఆమె సేవలకు గుర్తింపుగా విద్యారత్న, సేవారత్న, మహిళా రత్న, బాలసేవక్ తదితర అవార్డులు, బిరుదులతో పలు సంస్థలు సత్కరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట మహిళ అవార్డు- 2018, ఉగాది పురస్కారం- 2017 అందించి గౌరవించింది. తెలంగాణ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా 2017లో బతుకమ్మ పురస్కారంతో పాటు ఉత్తమ కవయిత్రిగా విశిష్ట అవార్డులతో సత్కరించాయి. హైదరాబాద్ లో  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017 డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ కవయిత్రిగా సత్కరించింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం  (తానా) 23వ మహాసభల సందర్భంగా 2023 జూన్ 24, 25 తేదీలలో తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో ప్రవాస బాలలకు అంతర్జాలంలో  నిర్వహించిన "కథాకేళి" పోటీలకు జ్యూరీ సభ్యురాలిగా నల్లాని రాజేశ్వరి వ్యవహరించారు. తానా - తెలుగు తేజం పోటీల న్యాయనిర్ణేతగా 2022 జూన్ 4, 5 తేదీలలో జూమ్ ద్వారా సేవలందించారు. తానా - ప్రపంచ సాహిత్య వేదిక 2021 ఏప్రిల్‌ 10, 11 తేదీలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాకవిసమ్మేళనంలో ఫ్రాన్స్ ప్రతినిధుల సభకు జూమ్ ద్వారా ముఖ్యఅతిథిగా హాజరై తనదైన శైలిలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జాతీయ మహిళాకమిషన్ రజతోత్సవ వేడుకల సందర్భంగా 2018 జనవరి 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా కీలకోపన్యాసం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ రాష్ట్ర మహిళాకమిషన్ సంయుక్తంగా హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ మహిళావిధానం ముసాయిదా - 2016 సంప్రదింపుల సమావేశంలో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి నల్లాని రాజేశ్వరి అంతర్జాతీయ "సేవారత్న" అవార్డును అందుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్, అధ్యక్షులు మురళి వెన్నెం, కార్యదర్శి రవి కొండబోలు 2023 అక్టోబర్ 23వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన అక్కినేని శతజయంతి ఉత్సవాల్లో అవార్డును ప్రదానం చేశారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Congratulations Mom