కులం...కులం...కులం...
కొందరికది కొండంత బలం...
కంటికి కానరాకున్నా...
అందిస్తుంది ఆశించిన ప్రతిఫలం..!
కులం...ఒక విషవృక్షమైతే...
కొమ్మలు రెమ్మలు నరికి లాభమేమి..?
కూకటి వేర్లతో సహా పెకలించి వేయాలి..!
కులం...ఒక అడ్డుగోడైతే...
వెంటనే కూల్చివేయాలి...
కులం...ఒక కుంపటైతే...కారుచిచ్చైతే...
ఆరని అగ్నిగుండమైతే...ఆర్పివేయాలి..!
కులం...ఒక గజ్జి కుక్కైతే...
వీధుల్లో తిరగనియ్యరాదు...
కులం...పాలకుండలో
ఒక విషపు చుక్కైతే...?
ఆ పాలను సేవించరాదు..!
కులం...ఒక కాలసర్పమైతే...
చాటుమాటుగా కాటు వేస్తుంది...
కులం...ఒక మానసిక రుగ్మతైతే...
తక్షణమే మందును కనిపెట్టాలి..!
"కులపునాది మీద
"ఓ జాతిని గాని, ఓ నీతిని గాని
"నిర్మించలేరు!"
"ఆకులు మేసే మేకల్ని తప్ప
"గాండ్రించే పులుల్ని
"ఎవరూ బలివ్వరు!" అన్నారు
"అమరజీవి డా.బి.ఆర్.అంబేద్కర్..!
కుల నిర్మూలనకై...
వివక్షకు వ్యతిరేకంగా...
అంటరానితనం
తుదముట్టించేందుకు...
సమానత్వం కోసం...
సమ సమాజ నిర్మాణం కోసం...
ఆత్మగౌరవంతో బ్రతికేందుకు...
అందరికీ సమాన అవకాశాలకై...!
అంబేద్కర్ మహనీయుడు
అహర్నిశలు శ్రమించాడు...
రాజ్యాంగాన్ని రచించాడు...
అస్పృశ్యత నివారణ చట్టం తెచ్చాడు
కానీ ఆశించిన ఆ "కుల నిర్మూలన"
కాగితాలకే పరిమితమైపోయింది..!
కులపిశాచి...
అదృశ్యంగా అడుగడుగునా
విచ్చలవిడిగా విహరిస్తోంది..!
నాలుగు పడగల నాగరాజులా...
విషం చిమ్ముతూ...
బడుగు బలహీన బహుజన వర్గాల
బంగారు బ్రతుకుల్ని బలి తీసుకుంటోంది..!
రాజకీయ రాజమందిరాలలో
"కులదేవతను" ప్రతిష్టించి...
ఘన విజయాల కోసం
పూజించే నాయకులెందరో..!
అది ఆజ్యం పోసిన అగ్నిలా
అవనంతా ఆవహించి తరతరాలుగా
రావణకాష్టంలా రగులుతోంది...!
అందుకే...
ఓ కులపెద్దలారా...
ఓ మేధావులారా...
ఓ నాయకులారా...
నూరకండి...నూరకండి...
కులం కత్తులు నూరకండి...
కన్న కలల్ని...కాల్చకండి...
బంగారు భవిష్యత్తును బుగ్గిచేయకండి..!
ఓ జాతి నేతలారా...
ఓ భావిభారత నిర్మాతలారా...
ఓ సమతా సంగ్రామయోధులారా...
కులరాక్షసికి సమాధి కట్టండి..!
సమ సమాజానికి పునాది వేయండి..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి