సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు 923
"న హి భుక్తవాన్ పునర్భుంక్తే "న్యాయము
****
నహి అనగా లేదు కాదు. భుక్తవాన్ అనగా తిన్నవాడు, భోజనం చేసిన వాడు.పునర్భుంక్తే అనగా  పునర్+ భుంక్తే. పునర్ అనగా తిరిగి, మళ్ళీ,మరల.భుంక్తే తిను అని అర్థము.
 
ఒకమారు కడుపునిండా తిన్నవాడు వెంటనే తిరిగి భోజనమును చేయలేడు అని అర్థము.
ఈ సమాజంలో  వ్యక్తులను ఏది పెట్టి సంతృప్తి పరచలేం. ఎంత సొమ్ము అవసరాలకు ఇచ్చినా ఏమైంది  ఇంకా పెడితే బాగుండేది అనుకుంటారు కానీ భోజనం పెట్టి  సంతృప్తి పరచగలం. ఎందుకంటే ఒకసారి తిన్న వ్యక్తిని వెంటనే తినమని ఎంత బతిమాలినా తినరు. కాబట్టి అన్నదానం గొప్పది అంటారు మన పెద్దలు.
మరి ఈ దానము గురించి ప్రజాకవి వేమన ఏమన్నాడో చూద్దాం.
"అన్ని దానములను నన్న దానమే గొప్ప/ కన్నవారి కన్న ఘనులు లేరు/ ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా/విశ్వదాభిరామ వినురవేమ!!"
ఈ లోకంలో అన్ని దానాలలోకెల్ల అన్నదానము గొప్పది. ఆకలితో అలమటించే వాడికి కడుపునిండా అన్నం పెడితే ఎప్పటికీ మరచిపోడు ఎంతో తృప్తి పడతాడు. కడుపునిండిన తర్వాత మళ్లీ తినడానికి కావాలని అడగడు.
అందుకే అన్నదానం చేయాలని, అన్నదానం మహా దానమనీ సనాతన ధర్మం కూడా చెబుతోంది. మరి దానికి సంబంధించిన ఓ శ్లోకాన్ని చూద్దామా.
"నగోదానాత్పరం దానం కించి దస్తీతి మే మతిః/యా గౌర్న్యాయార్జితా దత్తా కృత్స్నం తారయతే కులం!!"
"నాత్ర దానాత్పరం దానం కించి దస్తి వృషధ్వజ!/అన్నేన ధార్యతే సర్వం చరాచర మిదం జగత్ !!"
అనగా అన్ని దానాలలోకి అన్నదానము,గోదానం పరమ శ్రేష్ఠలు.న్యాయార్జిత ధనంతో గోవును కొని దానం చేసిన వానితో బాటు వాని కుటుంబమంతా తరిస్తారు.అన్నదాన ఫలానికిక సాటియే లేదు.నిజానికి పరమ పుణ్య దానాలు చాలానే ఉన్నాయి.కన్యాదానం,భూదానం, సువర్ణ దానం,జపదానం,గోదానం మొదలైనవి. వీటన్నింటి కంటే అన్నదాన పుణ్యం పదహారు రెట్లు గొప్పది.ఎందుకంటే అన్నంలోంచే ప్రాణం,వీర్యం,దృతి స్మృతి అన్ని పుట్ఠుకొస్తాయి.కాబట్టి అన్నదానం చేసి తృప్తిగా వారిచ్చే ఆశీస్సులు, శుభాకాంక్షలు పొందుదాం.
ఇక తల్లిని మించిన దైవం లేదు.కంటి రెప్పలా తన బిడ్డను కాపాడుతుంది.నిరంతరం బిడ్డ క్షేమాన్ని కాంక్షిస్తుంది. ఇక గురువును మించిన జ్ఞాన ప్రదాత ఎవరూ లేరు.గురువు అనుగ్రహాన్ని పొందడం అదృష్టం. ఈ మూడింటిని ఎల్లప్పుడూ గుర్తుకు పెట్టుకోవాలి.
 
 మరి ఈ న్యాయము కేవలం అన్నదానానికేనా అని నిశితంగా పరిశీలించి ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే భగవంతునిపై శాశ్వతంగా నమ్మకం ఉంచాలని, భారం వేసి ఏది జరిగినా ఆయన ఆజ్ఞానుసారమే అనుకుంటే మానసికమైన తృప్తి కలుగుతుంది.ఆ తృప్తి ఇంకా వేటిని కావాలని కోరుకోనీయదు అంటారు. అనగా మన చెప్పుకునే "నహి భుక్తవాన్ పునర్భుంక్తే న్యాయము "వలె అన్నమాట.
 మానసిక తృప్తి లేదా సంతృప్తి కలగాలంటే ఉన్న దానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. తిన్న తరువాత మనం తిండి మీద ఎలాంటి ధ్యాస లేకుండా ఎలా ఉంటామో, అలాగే ఉన్నదాంతో సంతృప్తి పడటం నేర్చుకోవాలి.భౌతిక సుఖాలను విడిచిపెట్టి మానసిక తృప్తి కోసం ఆధ్యాత్మిక అన్వేషణ చేయాలి. అలా చేయాలంటే ప్రకృతిని సృష్టించిన అందాలను, వివిధ రకాల మార్పులను నిశితంగా గమనిస్తే మనకు దానంతటదే సంతృప్తి అలవడుతుంది.
ప్రతి న్యాయము వెనుక ఏదో ఒక ఆధ్యాత్మిక, లౌకిక తత్వం ఇమిడి ఉంటుందని మన పెద్దలు ఉదాహరణగా చెప్ఫిన అక్షర సత్యాలు అని చెప్పారు. వాటిని గమనంలో పెట్టుకొని ఆచరిస్తే తప్పకుండా మానసిక తృప్తి కలుగుతుంది. తద్వారా ఐహిక తృప్తి కూడా కలుగుతుంది. అంతే కదండీ! మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు