అల్లరి కోడి : ----డా.పోతగాని సత్యనారాయణ
 ఒక అందమైన తోటలో ఎన్నో తెల్ల పావురాలు ఉండేవి. అవి చాలా మంచివి, క్రమశిక్షణతో ఉండేవి. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, అందరూ కలిసి కూర్చునేవి. తోటమాలి ధాన్యం వేస్తే, అవి నెమ్మదిగా, ఒకరినొకరు నెట్టకుండా, 
"ముందు మీరు.. ముందు మీరు.." అంటూ తినేవి. వాటి ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉండేది.
ఒకరోజు ఆ తోటలోకి ఒక బొద్దు కోడి వచ్చింది. అది చూడటానికి అహంకారంగా కనిపించేది. తోటలోకి రాగానే.
"కొక్కొరోకో!" అంటూ పెద్దగా అరిచింది
పావురాలు భయపడి చూశాయి. ఆ కోడికి అసలు మర్యాదలు తెలీవు. తోటమాలి ధాన్యం వేయగానే, ఆ కోడి 
"నేనే పెద్ద దాన్ని!" అన్నట్లు పరుగెత్తుకు వెళ్లింది. 
పావురాలను పక్కకు నెట్టి, పెద్దగా అరుస్తూ, రెక్కలు కొట్టుకుంటూ, ధాన్యం మొత్తం తినేసింది. పావురాలకు ఏం చేయాలో తెలియలేదు. 
"ఇది కొత్త స్నేహితురాలా?" అనుకుంటూ మొదట్లో భరించాయి. కానీ ఆ కోడి ప్రవర్తన రోజురోజుకూ మారింది.
పావురాలు నెమ్మదిగా తింటే, ఈ కోడి మాత్రం "త్వరగా తినాలి!" అన్నట్లు తినేది. ధాన్యం గింజలు కింద పడినా వాటిని చూడనైనా చూడదు. పావురాలు ఏమైనా గొడవ పడితే, ఆ కోడి మధ్యలో దూరి, 
"నా మాటే వినాలి!" అన్నట్లు చెప్పేది. నిజానికి దానికి వాటి సమస్యలు ఏమీ అర్థం కావు.
కొన్ని రోజుల తర్వాత, తోటమాలి ఈ వింతను చూశాడు. పావురాలు ఎంత మంచివో, ఈ కోడి ఎంత అల్లరో అతనికి అర్థమైంది. తోటమాలి నవ్వి, మెల్లగా ఆ కోడిని పట్టుకున్నాడు. దానికి తగిన వేరే కోళ్ల దగ్గర వదిలేశాడు.
కోడి వెళ్లిపోగానే పావురాలకు మళ్ళీ ప్రశాంతత వచ్చింది. వాటి ముఖాల్లో సంతోషం కనిపించింది.

కామెంట్‌లు