ఒక మట్టి పరిమళం..!
ఒక మానవతా పుష్పం..!
తల్లిదండ్రుల కలలలో
మొలకెత్తిన మొగ్గగా
మనం పుట్టినరోజు…
వారి కళ్లలో విరబూసేది
చిరునవ్వుల చంద్రకాంతులే..!
విద్యార్థిగా
విజయ పతాకం
ఎగరేసిన రోజు…
గురువుల గుండెల్లో
పొంగేది ఆనంద మకరందమే..!
అమ్మా నాన్నల కన్నుల్లో
కురిసేది వెన్నెలవర్షపు హర్షధారలే..!
ఉద్యోగదేవత
ఒడిలో చేరిన రోజు…
తల్లిదండ్రుల ఆశలు
మొలకెత్తిన విత్తనాలే...
ఉత్తమ ఉద్యోగి ఆగమనం
సంస్థ యజమానికి
అంబరాన్ని తాకే సంబరమే…!
మూడుముళ్ల
తంతు ముగిసినరోజు…
రెండు కుటుంబాల
గుండెల్లో ప్రతిధ్వనించేది
బంధాలే అనుబంధాలే...
కొత్త జంట హృదయాలలో
మార్మోగేది వసంత రాగాలే...
వికసించేది ప్రేమ పరిమళాలే...!
ఇంట్లో పసిబిడ్డలు
కెవ్వుమని కేక పెట్టినరోజు...
తాతయ్య అమ్మమ్మల
ముఖాల్లో నిండేది హోలి రంగులే...
గుండెల్లో వెలిగేది దీపావళి దివ్వెలే…!
భర్త ప్రమోషన్ అందుకున్న రోజు…
భార్య కల్లో మెరిసిన పట్టుచీర
భర్త బహుమతిగా చేతికందితే
ఆ ఆనందం వర్ణనాతీతమే...!
పదవీవిరమణ రోజు...
తోటి ఉద్యోగులు కన్నీళ్లు కార్చిన
అవి ఉద్యోగి నీతి నిజాయితీకి
స్నేహానికి ప్రశంసల పుష్పార్చనలే..!
నడిరోడ్డులో
నలుగురు నవ్వుతూ
నమస్కరించిన రోజు...మనిషి
గౌరవానికి దక్కు గజారోహణమే..!
ప్రజలు జేజేలు పలికిన రోజు...
చేసిన వాగ్దానాలను
నెరవేర్చిన నేతకు జన్మ ధన్యమే..!
ఒక మనిషి మరణం
శత్రువులకు కన్నీళ్లు తెప్పిస్తే…
అది ఆ మనిషి మానవతా
సౌరభానికి ప్రత్యక్ష సాక్ష్యమే…!
అదే కదా…మనిషిలో
మంచితనం పరిమళించడమంటే…!
అదే కదా మానవతా సుందరశిల్పమంటే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి