శ్రీపురం ఉన్నత పాఠశాలలో నవ్య, దివ్య అనే
అమ్మాయిలు 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చాలా పొట్టిగా ఉన్నారు. కొత్తవారు ఎవరైనా వీరిని చూస్తే వీరు 2వ తరగతి పిల్లలా లేక 3వ తరగతి పిల్లలా అన్న తీరుగా వీరు ఉన్నారు. ఉపాధ్యాయులు వీరిని చూసి ముచ్చట పడేవారు. చదువులో బాగా ప్రోత్సాహించేవారు.
కానీ తోటి పిల్లలు వీరిని బాగా హేళన చేసేవారు. పొట్టిగా ఉన్న అనేక ఉపమానాలతో పోల్చి వీళ్ళను బాగా హేళన చేసేవారు. వీరిద్దరూ తమ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళలో వాళ్లే బాధపడేవారు. ఎవరూ లేని సమయంలో ఏడ్చేవారు కూడా.
ఒకరోజు వీరిద్దరూ కలిసి ఒకచోట కూర్చుని ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఉపాధ్యాయుడు వాసు చూశాడు. ఓదార్చాడు. "మీరు చిన్న పిల్లలా? 6వ తరగతికి వచ్చారు. మిమ్మల్ని ఏడిపించే వారికి ఏదో విధంగా బుద్ధి చెప్పాలి కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. మీరు ఏం చేస్తారో చేయండి. వారు మీ జోలికి రాకుండా బుద్ధి చెప్పండి." అన్నాడు వాసు మాస్టర్.
మరో 15 రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా ఈ పిల్లలు ఇద్దరికీ పాటలు నేర్పించి, వేదిక మీద పాడించాలని అనుకున్నాడు ఉపాధ్యాయుడు వాసు. ఇద్దరినీ పిలిచి "ఆగస్ట్ 15 రోజున మీరిద్దరూ వేదిక మీద ఒక పాట పాడి వినిపించాలి. ఆ పాట మీకు నేర్పిస్తా. మీరు ఆ పాట పాడితేనే మిమ్మల్ని హేళన చేస్తున్న వారు జన్మలో మీ జోలికి రాకుండా చేస్తా. నా మాట వినకపోతే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు." అన్నాడు. ఒప్పుకున్నారు ఇద్దరూ.
ఉపాధ్యాయుడు ఆ పాట రాసి, ఇద్దరికీ ఇచ్చి తన సెల్ ఫోన్ సహాయంతో ఆ పిల్లలకు నేర్పించాడు. పదే పదే పాడించి, మంచి రాగయుక్తంగా సుశీలమ్మ పాడిన విధంగా ఒరిజినల్ గా పాడే దాకా పట్టుదలతో నేర్పించాడు ఉపాధ్యాయుడు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ పిల్లల వంతు వచ్చింది. "పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపటమెరుగనీ కరుణానిధి." అంటూ లేత మనసులు సినిమాలోని ఆ పాటను చాలా అద్భుతంగా పాడినారు. పాట అయిపోయాక చాలాసేపు చప్పట్లు మారు మోగినాయి. గ్రామ పెద్ద ఒకరు 1000 రూపాయలు వీరికి బహుమానంగా ఇచ్చారు. ఇది చూసిన మరి కొంతమంది బహుమానాల వర్షం కురిపించారు.
ఆ తర్వాత ఆ పాఠశాలలో చాలా మంది పిల్లలు నవ్య, దివ్యలతో స్నేహం చేశారు. వీరిని ఇన్నాళ్ళూ హేళన చేసిన వారు సిగ్గుతో తల దించుకున్నారు. నవ్య, దివ్యలతో స్నేహం చేద్ధామనుకున్నా వారికి ముఖం చెల్లలేదు.
భలే పిల్లలు: సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి