న్యాయాలు-936
ప్రణామం త్యనపాయముత్థితం ప్రతి పచ్చంద్రమివ ప్రజా నృపమ్" న్యాయము
****
ప్రణామం/ప్రణామ అనగా నమస్కారం, సాష్టాంగ నమస్కారము లేదా ముందుకు వంగి నమస్కరించడం.అంత్య అనగా చివరి,ముగింపు. అపాయం అనగా ప్రమాదం.ఉత్థితం అనగా పొడిగించబడిన,సాగదీయబడిన.ప్రతిపం అనగా ప్రతిబింబించే.చంద్రమివ అనగా చంద్రుడివంటి, చంద్రుడు లాంటి.ప్రజా అనగా ప్రజలు, జనాలు. నృపమ్ అనగా రాజు లేదా పాలకుడు అనే అర్థాలు ఉన్నాయి.
తమకు అపాయము కలిగించకుండా అభివృద్ధి పొందే రాజును చూసి ప్రజలు పున్నమ చంద్రుని చూచినట్లు సంతోషించి, నమస్కరిస్తారు అని అర్థము.
ఈ నమస్కరిస్తారు లోని నమస్కరించడం అనేది ఏదైనా లేదా మరొక వ్యక్తి ముందు అనగా పెద్దవాళ్ళు,జీవిత భాగస్వామి, ఉపాధ్యాయులు మరియు దేవత వంటి గౌరవింపబడే వారెవరైనా సరే వారి ముందు భక్తితో లేదా గౌరవంతో నమస్కరించడం అనేది మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది.ఇది కేవలం హిందూ మతములోనే కాకుండా బౌద్ధ, జైన సిక్కు మత సంప్రదాయాలలో కూడా కనిపిస్తుంది.
ప్రణామ లేదా ప్రాణమ అనేది ప్ర మరియు అనామ నుండి ఉద్భవించింది.ప్ర అనే ఉపసర్గకు ముందుకు, ముందు, చాలా అని అర్థము.ఆనామ అంటే వంగడం లేదా సాగదీయడం. ఇవి రెండూ కలిపి వంగడం, ముందు నమస్కరించడం, సాష్టాంగ నమస్కారం అని అర్థము.
ఈ ప్రణామం లేదా ప్రాణమలో అష్టాంగ, షష్టాంగ, పంచాంగ,దండవత్, నమస్కారం, అభినందన, క్షమాపణ అనే రకాలు ఉన్నాయి.
అష్టాంగ నమస్కారం లేదా అష్టాంగ దండవత్ లో శరీరంలోని ఎనిమిది భాగాలతో ఏక కాలంలో భూమిని తాకడం- ఉరసా అనగా తొడలు.శిరసా అనగా తల.దృష్ట్యా అనగా కళ్ళు,మనసా అనగా హృదయం. వచసా అనగా నోరు.పద్బ్యాం అనగా పాదములు,కరాభ్యం అనగా చేతులు.కర్ణాభ్యం అనగా చెవులు-ఈ ఎనిమిది అవయవ భాగాలతో కూడిన విధేయతతో భూమిని తాకి నమస్కరించడం ఉంటుంది.
షష్ఠాంగ నమస్కారం:- దీనినే షష్ఠాంగ దండవత్ అని కూడా అంటారు.ఇందులో శరీరంలోని ఆరుభాగాలు ఒకేసారి నేలను తాకుతాయి. అవి కాలివేళ్ళు, మోకాళ్ళు, చేతులు,గడ్డం, ముక్కు మరియు గుంటతో నమస్కరించడం.
పంచాంగ దండవత్ అనగా ఐదు భాగాలు ఒకేసారి నేలను తాకి నమస్కరించడం.ఇందులో మోకాళ్ళు, ఛాతీ,గడ్డం, ముక్కు మరియు నుదురు.
దండవత్ నమస్కారం కూడా ఉంది.ఇందులో దండవత్ అనగా కర్ర అని కూడా అర్థం ఉంది.ఇందులో శరీరంలోని నాలుగు భాగాలు ఒకేసారి నేలను తాకడం ఉంటుంది. నుదురును నేలకు వంచి మోకాళ్ళపై ఉండి మోకాళ్ళు, పాదాలు, నుదురు, చేతులు నేలకు తాకించి నమస్కరించడం ఉంటుంది.
నమస్కారం అనేది ఆరాధనను సూచిస్తుంది.ఇందులో నిలబడి లేదా కూర్చుని నుదుటిని తాకుతూ చేతులు జోడించడం ఉంటుంది.ఇది ఎక్కువగా ప్రజల మధ్య వ్యక్తీకరించబడే గౌరవం మరియు శుభాకాంక్షల యొక్క సాధారణ రూపం.
ఇక చివరిది అభినందన నమస్కారం:-ఛాతిని తాకుతున్న చేతులతో ముడుచుకొని ముందుకు వంగి చెప్పడం ఉంటుంది.
మరొకటి క్షమాపణ నమస్కారం కూడా ఉంటుంది.ఇందులో గౌరవ చిహ్నంగా పాదాలను తాకి నమస్కరించడం ఉంటుంది. ఇది భారతీయ సంస్కృతిలో సర్వసాధారణం. దీనిని చరణా స్పర్శ అంటారు. ఎక్కువగా దేవాలయాల్లో దర్శన సమయంలోనూ , తల్లిదండ్రులు, వృద్ధులు,వృద్ధ బంధువులు, గురువులు ( ఉపాధ్యాయులు), సాధువులు, సన్యాసుల వంటి వారి పట్ల గౌరవం చూపించేందుకు ఈ విధంగా నమస్కరించడం జరుగుతుంది.
ఇప్పటి వరకు నమస్కారములు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకున్నాం.నమస్కారం చేయడంలో వ్యక్తుల యొక్క సంస్కారం కనిపిస్తుందనేది మనందరికీ తెలిసిందే.ఇక విషయానికి వద్దాం.
తమకు అపాయము కలిగించకుండా, తమను కష్టపెట్టకుండా ఉండే రాజు, తమ మేలును కోరుతూ తాను అభివృద్ధి పొందే రాజంటే ఎవరికైనా ఇష్టం, గౌరవం తప్పకుండా ఉంటుంది. ఆత్మాభిమానంతో బ్రతికే ప్రజలు అనవసరంగా ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు.రాజైనా సరే. అలాంటి రాజు అభివృద్ధి పొందడం అంటే అందరి అభిమానాన్ని పొంది మంచిపేరు తెచ్చుకోవడమే.అందులో తాము కూడా ఉండడమే .
దేశాన్ని సుభిక్షంగా ఉంచి అభివృద్ధి పథంలో నడిపించే రాజును చూస్తే వారికి పున్నమి నాటి చంద్రుడిని చూసినంత సంతోషంగా ఉంటుందట.అందుకే ఆ రాజుకు గౌరవంతో నమస్కరిస్తారట.ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా! మనం పనిచేసే చోట మన పై అధికారి కూడా ఇలా ఉంటే మనకు కూడా ఆ ప్రజలకు కలిగిన భావనే కలుగుతుంది.
కాబట్టి ఈ "ప్రణామం త్యనపాయముత్థితం ప్రతి పచ్చంద్రమివ ప్రజా నృపమ్" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే పాలించే పాలకులు,ఉద్యోగాలలో పై అధికారులు మంచి మనసుతో ప్రజాభివృద్ధి,సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించాలి.అలా ప్రజలనో,సంస్ధలలోని సాటి ఉద్యోగులనో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ, తాను నడిస్తే అతడిని చంద్రుడిని ఇష్టపడ్డంతగా ఇష్టపడతారు. కాబట్టి నాయకత్వం వహించే వారు మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. అప్పుడే మనస్పూర్తిగా పైన పేర్కొన్న నమస్కారములు హృదయపూర్వకంగా ఆ యా వ్యక్తులకు తప్పకుండా అందుతాయి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి