శ్రుతిలయలు : సరికొండ శ్రీనివాసరాజు
 లయ అనే అమ్మాయి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తూంది. చిన్నప్పటి నుంచీ చదువులో లయకు పోటీ లేదు. లయ 9వ తరగతికి వచ్చాక ఆ తరగతిలో శ్రుతి అనే అమ్మాయి కొత్తగా ప్రవేశించింది. శ్రుతి చాలా తెలివైన విద్యార్థిని. పాఠశాలలో అడుగు పెట్టిన కొద్ది రోజులలోనే చదువులో క్లాస్ ఫస్ట్ వచ్చింది. లయ విచారంలో ఉంది. శ్రుతిని మించాలని మరింత పట్టుదలతో చదివి, మార్కులు మరింత పెంచుకుంటుంది. కానీ శ్రుతిని మించలేక పోతుంది. లయకు శ్రుతి మీద ఈర్ష్య పెరుగుతుంది. శ్రుతితో అస్సలు మాట్లాడటం లేదు. ఎవరైనా లయ దగ్గర శ్రుతి టాపిక్ తెస్తే వారిని బీభత్సంగా తిడుతుంది లయ.
      ఒకరోజు లయ నడుస్తూ ఇంటికి వెళ్తుంది. లయ వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి చాలా దూరం. భయంకరమైన వర్షం మొదలైంది. లయ ఒక షాపు ముందు తలదాచుకుంది. ఆ సమయంలో శ్రుతి వాళ్ళ నాన్నతో అక్కడకు వచ్చింది. లయ అవస్థ చూసింది. వాళ్ళ నాన్నకు "నాన్నా! నా క్లాస్ మెట్ లయ." అని చూపించింది. వాళ్ళ నాన్న ఆశ్చర్యానికి గురి అయ్యాడు. "నువ్వేనా లయ అంటే. శ్రుతి నీ గురించి ఎప్పుడూ చెబుతుంది. మా శ్రుతితో సమానంగా చదువుతావట కదా!" అన్నాడు శ్రుతి నాన్న వేంకటరమణ. లయ ఆశ్చర్యపోయింది. అప్పుడు లయ వాళ్ళ నాన్న "ఈ వర్షం ఇప్పట్లో తగ్గేటట్లు లేదు. మా కారులో మా ఇంటికిరా. మీ ఇంటికి ఫోన్ చేసి నేను చెబుతా. కొద్దిసేపు మీ స్నేహితులు ఇద్దరూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీ ఇంట్లో దించుతా." అన్నాడు. లయ ఒప్పుకోలేదు. శ్రుతి మరియు వాళ్ల నాన్న ప్రేమగా పట్టుపట్టి లయను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. శ్రుతి వాళ్ళ అమ్మ కూడా లయతో చాలా ప్రేమగా మాట్లాడింది. మంచి పళ్ళ రసాలు చేసి లయ చేత తాగించింది. 
     "మా శ్రుతి ఎప్పుడూ నీ గురించి చెబుతుంది. చదువులో ఎప్పుడూ తాను ఫస్ట్ రావాలని ఆరాటం. నీలాంటి తెలివైన అమ్మాయి ఉండబట్టే నిన్ను మించాలనే పట్టుదలతో ఇంకా తన చదువును మెరుగు పరుచుకుంది. పాత స్కూలులో తనకు ఇంత పోటీదారులు లేకపోవడం వల్ల తాను క్లాస్ ఫస్ట్ వచ్చినా ఇంత ఎక్కువ మార్కులు రాలేదట. నీ వంటి పోటీ అమ్మాయి దొరకబట్టే తన చదువు మెరుగు పడిందట. నీ వంటి పోటీ అమ్మాయి దొరకడం తన అదృష్టమని చెబుతుంది." అన్నది శ్రుతి వాళ్ల అమ్మ. కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది లయ. మళ్లీ ఇలా అంది. "ఈరోజు మా ఇంట్లోనే ఉండు. ఇక్కడే భోజనం చెయ్యి. రేపు శ్రుతిలయలు ఇద్దరూ కలిసి స్కూలుకు వెళ్ళండి. మీ ఇంటికి ఫోన్ చేసి చెబుతాలే." అని. 

కామెంట్‌లు