ఉరుములు- మెరుపులు!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
చీకటి కమ్ముకొస్తుంది 
మేఘాలు విస్తరిస్తున్నవీ
ఆకాశం ఆవులిస్తుంది 

మట్టి మనసు పగిలింది 
విత్తనం ఎత్తిన జన్మ అంతమైంది 
నడిచొచ్చిన నది కులబడింది. 

పొద్దు పొడిచి ఎదగలేక ఎదురుచూస్తుంది. 
వెలుగు అలిగి వెళ్లిపోయింది. 
గాలి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంది. 
రెప్పలు ఆరిపోయి చూపులు ఊపిరాడక 
కదులుతున్నవి. 

నెలవంక గా మారి నేల అమావాస్య ఆలయం ముందు ఆగింది. 
వెచ్చని ఊపిరిల్ల మధ్య మత్తుగా సాయంత్రం మంత్రం జపిస్తుంది. 

ఉదయ సందులు బంధించబడ్డవీ
కాలం మెల్లిగా గోడ దూకింది.
బుద్ధి గాడంగా నిద్రపోతుంది. 

చెవుల పిల్లిలా శబ్దం మేలుకోందీ.
అదిరిపడిన పసిడి కిరణాలు వాకిలి ముందు 
కాపలా కాస్తున్నైవీ.
క్షణం కొంచెం చిన్నగా మారి గదిలోకి దూరింది 
మౌనం ధ్యానం చేస్తుంటే 
శ్వాస ప్రాణం పోస్తుంది. 

అవతారాలన్నీ ముగించుకొని నీరు 
ముసురుగా కురుస్తుంటే 
భూమి బాలింతల మారింది.
పొగ మంచు కంచెలా నిలబడ్డది. 

కాగడాల్లా కాలుతున్న కాలం పెదాలు చల్లబడ్డవీ
ఋతువుల-మూర్తులను చెక్కుతున్న ప్రకృతి 
గతమంతా త్యాగంతో నిండింది.
చివరి రూపంలో కోపం మాయమైంది. 

అందమంతా గదవ కింద గంధం పూసినట్లు 
నుదుట తిలకం దిద్దీనట్లు 
మేను పై ముత్యాల్లా మేఘాలు మెరుస్తుంటే 
ఉరుములు మెరుపులు పుడుతున్నాయి.

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు