నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి:-సి.హెచ్.ప్రతాప్

 ప్రతీ భారతీయ కుటుంబం ప్రతిరోజూ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల. ఇది ముఖ్యంగా మధ్య తరగతి, పేద ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. బియ్యం, పప్పులు, కూరగాయలు, వంటనూనె, పాల ఉత్పత్తులు వంటి ప్రధాన సరుకులు రోజురోజుకు ఖరీదవుతూ వస్తున్నాయి. ఆహారం ప్రాథమిక హక్కుగా పరిగణించాల్సిన సమయంలో, అది అనేక మందికి అందని అంచుకు చేరుకుపోవడం ఆందోళన కలిగించేది.
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన సాధారణ ప్రజలు తమ నెలసరి బడ్జెట్‌ను కుదించుకోవలసిన పరిస్థితిలో ఉన్నారు. ఉపాధి అవకాశాలు తగ్గిన తరుణంలో ప్రజలకు పెరిగిన ధరలను భరించడం అసాధ్యమవుతోంది. ఖర్చులు పెరగడం వలన ఆరోగ్య సేవలు, విద్య ఖర్చులు వంటి ఇతర అవసరాలపై ప్రజలు వ్యయం చేయలేక పోతున్నారు. ఇది పౌష్టికాహారం కొరత, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్ భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి:
రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకులను మధ్యవర్తులు అధిక లాభాల కోసం మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.నిల్వలపై నియంత్రణ లేకపోవడం వల్ల కొందరు వ్యాపారులు గోదాముల్లో నిల్వ చేసి కొరతను సృష్టిస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల సరుకుల ధరలపై ప్రభావం పడుతోంది.దిగుమతి చేసే వస్తువుల ధరలు పెరగడం కూడా ఓ కారణం.ప్రభుత్వ వ్యవస్థలు సమర్థంగా పనిచేయకపోవడం వల్ల సరఫరా నియంత్రణ క్షీణిస్తోంది.ప్రభుత్వం ధరల నియంత్రణలో కీలక పాత్ర పోషించాలి. ప్రజలకు చవక ధరలకు నిత్యావసర వస్తువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీనికోసం తక్షణ చర్యలు అవసరం.వాటికో కొన్ని :
రేషన్ దుకాణాల ద్వారా సరసమైన ధరలకు సరుకుల పంపిణీ, జనతా బజార్‌లు, రైతు బజార్లు విస్తరణ, ధరల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు, నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైతే దిగుమతులపై ఆంక్షలు తొలగించడం వంటివి. ఇంకా ధరలు తగ్గించాలంటే ఒకవైపు రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, మరోవైపు వినియోగదారులకు సరసమైన ధరకు సరుకులు అందించాల్సి ఉంటుంది. దీనికోసం మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గించాలి. రైతు ఉత్పత్తి కంపెనీలు, సమాఖ్యల ద్వారా నేరుగా మార్కెట్‌కి చేరే మార్గాలు కల్పించాలి.
ధరల పెరుగుదల కారణంగా పేద ప్రజలు తక్కువ నాణ్యత కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇది పిల్లల ఎదుగుదలపై, వృద్ధుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఆరోగ్యభద్రతకే కాక, సమాజ సంపూర్ణాభివృద్ధికి అవసరం. ధరల నియంత్రణ కోసం తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలు అవసరం. ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలపై వ్యూహాత్మకంగా పనిచేయాలి. వాణిజ్య గోడౌన్లపై సమర్థమైన పర్యవేక్షణ ఉండాలి. రైతులకిచ్చే మద్దతు ధరను సమీక్షించి, వారికి నష్టాలు రాకుండా చూడాలి.నిత్యావసర సరుకుల ధరల సమస్యపై ప్రజా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. మీడియా ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలి. ధరల పెరుగుదలకు కారణాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ చర్యలపై పర్యవేక్షణ జరపడం, ప్రజల అభిప్రాయాలను వెలికి తీసి పాలకుల దృష్టికి తీసుకెళ్లడం అవసరం.నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలంటే ప్రభుత్వ, వ్యవసాయ రంగ, సామాజిక సంస్థల సహకారం అత్యవసరం. ప్రజల భద్రత, ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ధరల నియంత్రణ అత్యంత కీలకం. ప్రభుత్వం వినియోగదారులకు, రైతులకు మధ్య సమతౌల్యాన్ని కాపాడే విధంగా వ్యవస్థలను బలోపేతం చేయాలి. అప్పుడే సామాన్యుల జీవితాల్లో స్థిరత్వం వస్తుంది. 

కామెంట్‌లు