సుప్రభాత కవిత : - బృంద
వాలుగా లోయల విరిసి
మేలుగా అందాల మెరిసి
వేలుగా వర్ణాల మురిసి
పూలే చిన్నారి పాపలైన తీరు!

బోసినవ్వుల సోయగాలు 
లేత పాదాల నాట్యాలు 
ఉంగాలే వేద మంత్రాలు 
పసి పాపలే దైవ ప్రతిరూపాలు!

వసి వాడని పువ్వుల మాలలు
పసి కూనల నవ్వుల హేలలు
మిసిమి వన్నెల పెదవుల మెరిసే
పసిడి మెరుపుల సుందరహాసాలు

తోట్టేలో పాపాయికి కలిగే 
తల్లిని చూసే సంబరంలా 
మిన్నుల బాలుని ఆగమనంతో
చిన్నెలు చిందించు కుసుమాలు!

అరవిచ్చిన అరవిందాల 
అపురూప అందాలలో 
ఆదిత్యుని అవధిలేని 
అనుగ్రహమే అవనికి అలంకారాలు!

ప్రభాసముగా ప్రభవించే
ప్రబల ప్రకాశ ప్రభాకర 
ప్రభాత కిరణాలకు
ప్రణమిల్లుతూ....

🌸🌸సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు