వ్యాలీ ఫోర్జ్… తుపాకులు మోగని చోట, ఆత్మవిశ్వాసం మోగింది.యుద్ధం లేకుండానే, ఓ దేశం గెలిచే మార్గాన్ని నిర్మించింది.ఈ స్థలం మానవ సహనానికి, నాయకత్వ విశిష్టతకు, దేశభక్తికి చిరస్థాయి గుర్తుగా నిలిచిపోతుంది.
వ్యాలీ ఫోర్జ్ (Valley Forge) ఈ పేరు వినగానే అమెరికా స్వాతంత్ర్య యుద్ధ కాలంలో సైనికుల త్యాగం, కష్టసాహసాలు, నాయకత్వపు శక్తి గుర్తుకొస్తాయి. ఇది ఓ యుద్ధరంగం కాదు, కానీ ఓ విప్లవ శక్తిని చాటిన స్థలం. 1777 డిసెంబరు నుండి 1778 జూన్ వరకు, జనరల్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలోని అమెరికన్ కాంటినెంటల్ ఆర్మీ ఇక్కడ శీతాకాలం గడిపింది. ఇది యుద్ధ విజయం కోసం సైనిక శక్తిని తిరిగి నిలబెట్టిన చరిత్రాత్మక కేంద్రంగా మారింది. వ్యాలీ ఫోర్జ్, అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉంది. ఇది ఫిలడెల్ఫియా నగరానికి సుమారు 25 మైళ్ల దూరంలో ఉంది. నేటికి ఇది Valley Forge National Historical Parkగా అభివృద్ధి చెంది, చారిత్రక స్థలంగా నిలిచింది.
చారిత్రక నేపథ్యం:
1777లో బ్రిటిష్ సేనలు ఫిలడెల్ఫియాను ఆక్రమించాయి. అమెరికన్ సైన్యానికి తాత్కాలిక శిబిర స్థలం అవసరమైంది. జనరల్ వాషింగ్టన్ వ్యాలీ ఫోర్జ్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకున్నాడు. 1777 డిసెంబరు 19న సైన్యం వ్యాలీ ఫోర్జ్ చేరుకుంది. శీతాకాలపు తీవ్రత, దుస్తుల కొరత, ఆహార లేమి, వ్యాధుల ప్రభావంతో సైనికుల స్థితి దారుణంగా మారింది. సుమారు 2,000 మంది సైనికులు వ్యాధుల వల్ల మరణించారు. కనీస నివాసాలు లేకపోవడంతో సైనికులు స్వయంగా హట్లను (గుడిసెలు)నిర్మించుకున్నారు. సైనికుల నైతిక స్థితిని మెరుగుపరచడానికి బారన్ వాన్ స్ట్యూబెన్ అనే ప్రషియన్ అధికారి శిక్షణ ప్రారంభించాడు. అతని ఆధ్వర్యంలో సైనికులు యుద్ధ నైపుణ్యం, క్రమశిక్షణ అభివృద్ధి చేసుకున్నారు. ఈ శిక్షణ అనంతరం సైన్యం మరింత బలంగా, సమర్థవంతంగా మారింది. ఇది ప్రస్తుతం Valley Forge National Historical Parkగా సందర్శకులకు అందుబాటులో ఉంది.క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వం.. ఇవే దేశ స్వాతంత్ర్యానికి మూలస్తంభాలు."అని వ్యాలీ ఫోర్జ్ చాటిచెప్పింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి