సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-930
"నహి కఠోర కంఠీరవస్య కురంగ శాబః ప్రతిభటో భవతి" న్యాయము
****
నహి అనగా లేదు.కఠోర అనగా కఠినమైన, దృఢమైన.కంఠీరవస్య అనగా  సింహము,భీకర గర్జన చేయు కౄర మృగరాజుతో. కురంగ శాబః అనగా లేడిపిల్ల , జింక పిల్ల. ప్రతిభటః అనగా బలంగా ఉన్నవాడు.భవతి అనగా అవుతుంది లేదా ఉంటుంది అనే అర్థాలు ఉన్నాయి.
సింహముతో లేడిపిల్ల యుద్ధము చేయగలదా? శాస్త్రజ్ఞునితో శాస్త్రము చదువని వాడు వాదము చేయగలడా ? అంటే రెండింటికీ లేదు,లేడు అనే సమాధానమే వస్తుంది.
సింహంతో లేడిపిల్ల పోరాడ లేదు. అలాగే ఒక బలమైన వ్యక్తి/ బలవంతుడితో‌ బలహీనుడు పోరాడలేడు అనే అర్థంతోనూ, శాస్త్రాలు చదివిన సర్వజ్ఞుడైన పండితునితో ఏమీ రాని మూర్ఖుడు లేదా పామరుడు శాస్త్ర చర్చలో గెలవలేడు అనే వాస్తవంతోనూ ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
 సింహం,జింక గురించి చెప్పుకునే ముందు సింహం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.
సింహమును అడవికి మృగరాజు అంటారు. అది ఒక్కసారి గట్టిగా గర్జిస్తే మనుషులే కాదు జంతువులూ వణికిపోతాయి.ఐదు నుండి పది మైళ్ళ దూరం వరకు సింహం గర్జన వినబడుతుంది.సింహాలు తమ గర్జనలతో మాట్లాడుకుంటాయట.అలాంటి సింహం చేతికి చిక్కిందంటే జింక పిల్లకు ఇక మరణమే.ఏ విధంగానూ తప్పించుకోలేదు.సాధారణంగా సింహాలు గుంపుగా వేటలో పాల్గొంటాయి. కాబట్టి జింక పిల్లే కాదు ఏ జంతువైనా తప్పించుకోలేదు.
అలాగే బలవంతుడైన వాడితో బలహీనుడు పోరాడలేడు అనే వాక్యంలో  రెండు రకాలైన కోణాలు దాగి ఉన్నాయి.ఒకటి శారీరక బలం. ఏనుగు లాంటి బలమైన వ్యక్తితో ఎలుక పిల్ల వంటి బలహీనుడు  పోరాడలేడు కదా!.
ఇక మరో కోణంలో చూస్తే అంగబలం,అర్థబలం ఉన్న వ్యక్తికి అధికారుల అండ కూడా ఉండటం మనం ఈ సమాజంలో చూస్తూ వుంటాం.ఇంకా కొందరికైతే అంగబలం, అర్థబలంతో పాటు అధికార బలం కూడా ఉంటుంది.అలాంటి  వారు  అవి రెండూ లేని వారిని అదిరించి బెదిరించడం.వారి నుండి తమకు కావాల్సినవి  బలవంతంగా లాక్కోవడం. మళ్లీ నోరెత్తి ప్రశ్నించకుండా వాళ్ళ జీవితాలను దుఃఖభాజనం చేయడం చూస్తుంటాం.
అలాంటి వారు సింహం కంటే మహా ప్రమాదమైన వారు. సింహానికి కడుపు నిండితే మళ్ళీ వెంటనే వేటకు పోదు.ఆకలేస్తేనే వేటాడుతుంది. మరి మనిషి అలా కాదు. ధన దాహం, అధికార దాహం, ఆధిపత్య దాహం వాళ్ళను కౄరులుగా మారుస్తుంది .సాటి మనుషులని కూడా చూడరు.
ఈ రెండు కోణాలు కాకుండా మరో  అంగీకరించదగిన కోణం ఉంది. అదేమిటంటే సర్వం తెలిసిన శాస్త్రజ్ఞునితో శాస్త్రము చదువని వాడు వాదము చేయలేడు. ఒకవేళ మొండిగా చేయడం మొదలుపెట్టినా  గెలవలేడు.పరాభవం తథ్యం. ఇలాంటి విషయాల్లో  "సర్వజ్ఞుడైన పండితునితో ఏమీ తెలియని అజ్ఞాని వాదానికి దిగడం అనేది సింహంతో లేడిపిల్ల పోరాడినట్లే ". అందుకే మనకున్న బలాబలాలు తెలుసుకోకుండా, చూసుకోకుండా వాదానికి దిగకూడదు.అవమానాల పాలు కాకూడదు.
వీటితో పాటు మరో విషయం కూడా ఈ సందర్భంగా తప్పకుండా చెప్పుకోవాలి.అదేమిటంటే మహాభారతంలో  సంజయుడు మరియు దృతరాష్ట్రుడి మధ్య జరిగిన సంభాషణ.
 దృతరాష్ట్రుడితో  ఓ మాట  అంటాడు సంజయుడు ."పొట్టేలు కొండను చూసి అది తనను ఢీకొన లేదు కనుక కొండ ఓడిపోయిందని అనుకుంటుందట.అలాగే పాండవులను చూసి వారేం చేయలేరు అనుకుంటున్నారు  వారే కోపిస్తే ఏం జరుగుతుందో ఊహించగలరా?అంటాడు. దీనిని బట్టి న్యాయము యొక్క బలం ముందు అన్యాయం గెలవలేదు అనే మరో కోణం కూడా వుందనేది మనం అర్థం చేసుకోవాలి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పడానికే ఈ న్యాయమును ఉదాహరణగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి వాటిని ఎల్లప్పుడూ గమనంలో ఉంచుకోవాలి. అనవసరమైన సాహసాలు,పరాభవాల జోలికి వెళ్ళకూడదు.

కామెంట్‌లు