సుప్రభాత కవిత : - బృంద
మరలి రాని నిన్నను తలవక 
తరలి రానున్న రేపటి గురించి
తరిగిపోని ఆశలు పెంచుకుని
కరిగే నిముషాలతో చేసే చెలిమి
జీవితం!

తగిలిన ఎదురుదెబ్బలతో పాఠాలు 
మిగిలిన సహనంతో ప్రయత్నాలు
నలిగిన మనసున సర్దుబాట్లు 
వదలిన బాణంలా ఒకటే పరుగే
జీవితం!

కోరిన వలపులు దొరకక 
దొరికిన ప్రేమలు నచ్చక 
ఉరికే మనసుల ఊహలలొ 
తరిగే విలువల తపనలే 
జీవితం!

వచ్చినవన్నీ మనవని 
ఇచ్చినవన్నీ వరమని 
నచ్చినవన్నీ  దొరికాయని 
తెచ్చుకున్నవే అన్ని అనుకునేదే 
జీవితం!

పలుకని పెదవుల మాటలు 
పాడని రాగాల పాటలు 
వీడని మమతల బంధాలు
వాడని తలపుల తోరణమే
జీవితం!

అడగని వరాల సందడి
విడువని బంధాల ముడి
తడిసిన రెప్పల అలజడి
గడపలు దాటని సవ్వడులే 
జీవితం!

రకరకాల సమస్యలు 
పలు విధాల పయనాలు 
ఎడతెగని  నిరీక్షణలు
ఎన్నున్నా  వేకువ తెచ్చే ధైర్యమే
జీవితం!

🌸🌸సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు