కవనహృదయం కవితోదయం (ఉదయసందేశం):- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ప్రభాతవేళ
ప్రాణులనులెమ్మంటుంది
ప్రకృతిహేళ
పరికించరమ్మంటుంది

మొగ్గలు
పొడుచుకొస్తాయి
ఆలోచనలు
తన్నుకొస్తాయి

కిరణాలు
దూసుకొస్తాయి
అంధకారము
పారిపోతుంది

దృశ్యాలు
ఆకట్టుకొంటాయి
మనసులు
పొంగిపొర్లుతాయి

విషయాలు
వెన్నుతడతాయి
భావాలు
బయటకొస్తాయి

అక్షరాలు
అల్లమంటాయి
పదాలు
పరచమంటాయి

తలుపులు
తెరువమంటాయి
తలపులు
తోచుకొనివస్తాయి

పంక్తులు
పొదుగుతాయి
చరణాలు
ఒదుగుతాయి

కలాలు
కదులుతాయి
కాగితాలు
నిండుతాయి

కవితలు
ఉదయిస్తాయి
వెలుగులు
విరజిమ్ముతాయి

మదులు
మురిసిపోతాయి
హృదులు
ఉల్లాసపడతాయి

సూర్యోదయము
చూడమంటుంది
కవితోదయము
చదవమంటుంది


కామెంట్‌లు