సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-918
మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి కించన న్యాయము
*****
మిథిలాయాం అనగా మిథిలలో. ప్రదీప్తాయాం అనగా  వెలుగుతున్న దానిలో, ప్రకాశిస్తున్న దానిలో. న మే అనగా నాకు కాదు, నాది కాదు.దహ్యతి అనగా కాలిపోతోంది, మండుతోంది.కించన అనగా కొంచెం, కొద్దిగా అనే అర్థాలు ఉన్నాయి.
 మునుపు ఒకసారి శుకుడు విదేహ రాజ్యమును పరిపాలిస్తున్న జనక మహారాజు జీవన్ముక్తి సంపాదించిన వాడనియు, బ్రహ్మ జ్ఞాని అనియు,కర్మ నిష్ఠుడైన ఆత్మజ్ఞాని యనియు,తండ్రివలన తెలుసుకున్నాడు.
అసలు శుకుడు ఎవరో తెలుసుకుందాం. శుకుడు వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టినప్పటి నుంచీ సకల శాస్త్రాలు నేర్పిన వ్యాసుడు గృహస్థాశ్రమం స్వీకరించమని,ఆ జీవితం మోక్షమార్గానికి అడ్డుకాదని పలురకాలుగా నచ్చ చెబుతాడు.ఎంత చెప్పినా శుకుడు అంగీకరించడు. పైగా తండ్రిని శంకిస్తాడు.అది గమనించిన వ్యాసుడు విదేహ రాజ్యమును పరిపాలిస్తున్న జనక మహారాజు జీవన్ముక్తుడని అతని దగ్గరకు వెళ్ళి సందేహాలను నివృత్తి చేసుకొమ్మని చెబుతాడు.
ఆ కారణం చేత వేదాంత విచారణ చేసేందుకు జనక మహారాజు వద్దకు వెళ్ళాడు.ఆయనతో వేదాంత విచారణ చేస్తూ కర్మపరుడైన వాడు ఆత్మ జ్ఞాని యెట్లవుతాడు, అదెలా సాధ్యము? అంటూ ఆ విషయం గురించి వాదిస్తున్న సమయంలో వారి దగ్గరకు హడావుడిగా ఒక భటుడు వచ్చి - రాజా! పట్టణమొక మూల నుండి తగులబడుతున్నదని చెప్పాడు.
అది విన్న  జనక మహారాజు చిరునవ్వు నవ్వుతూ ఎలాంటి భావోద్వేగాలకు, వికారాలకు లోను కాకుండా ఈ విధంగా అంటాడు.
"మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి -" అలాగా! పోనిమ్ము.మిథిలాపట్టణ మంతయు తగులబెట్టినను ఈ అగ్ని నా మనస్సును తగుల బెట్టగలదా?  అన్న జనకుని మాటలు విన్న శుకుడు ఆయన గంభీర చిత్తత్వమునకు ఎంతగానో ఆశ్చర్యపోతాడు.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే "బ్రహ్మనిష్ఠుల మనసు అనంతమై యుండును. వారికి ప్రపంచంలో కావలసిన దేదియూ లేదు. ఎట్టి స్థితి సంభవించినను వారు ఎలాంటి వికారములకు లోనుకారు.కర్మలు చేస్తూనే వుంటారు.కానీ కర్మ ఫల లిప్తులు మాత్రము కారు.
 ఆధ్యాత్మిక వాదుల దృష్టిలో బ్రహ్మ నిష్ఠ గలవారు అనగా సృష్టి కర్త యొక్క ఉనికి తెలిసి అతనిపై అచంచలమైన విశ్వాసం,భక్తి కలిగి ఉంటారు.వీరు జీవించి ఉండగానే మోక్షాన్ని పొందిన స్థితిలో ఉంటారు.
అనగా మానవుడు  సాధించ వలసిన నాలుగు పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలలో మొదటి మూడు ఆచరించాల్సిన విధులు అయితే నాల్గవది పొందాల్సినది.అదే మోక్షం లేదా ముక్తి. మోక్షం అంటే  స్వీయ సాక్షాత్కారము పొందడం.దీని వలన జనన మరణ చక్రంలో నుండి బయట పడతాడు. మానవుడు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుంటేనే జీవన్ముక్తి లభిస్తుంది. అలాంటి స్థితిలో జనక మహారాజు ఉన్నారు కాబట్టి అంత పెద్ద విషయం వల్ల కూడా ఆయన ఎలాంటి ఉద్వేగాలకు లోను కాలేదు.
ఇది  అందరికీ సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి.ఎందుకంటే  ఆత్మ సాక్షాత్కారం కావడం అంత సులువైన పని కాదు. సామాన్య మానవులు ప్రాపంచిక విషయాలను కావాలని కోరుకుంటూ, వాటి కోసం కర్మలు చేస్తూ,అవి దొరికితే  చాలు తృప్తి పడతారు.జీవన్ముక్తులు అలా కాదు స్థితప్రజ్ఞత కలిగి వుంటారు.
 కాబట్టి మనం చేయవలసినది ఏమిటంటే అలవి కాని కోరికలతో రగిలిపోకుండా, మన వలన జరిగే కర్మలను సరిగా నిర్వర్తిస్తూ, మన ప్రమేయం లేకుండా విధి వలన జరిగే సంఘటనలకు ఆందోళన చెందకుండా స్థితప్రజ్ఞత కలిగి వుండేందుకు మన వంతుగా ప్రయత్నం చేయాలి. అదే ఈ "మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి కించన న్యాయము" లోని అంతరార్థము.


కామెంట్‌లు