న్యాయాలు-925
"యత్ర తిష్ఠతి ధర్మాత్మా తత్ర దేవోపి తిష్ఠతి" న్యాయము
****
యత్ర అనగా ఎక్కడ,ఏ ప్రదేశంలో.తిష్ఠతి అనగా కూర్చోవడం,ఉండడం.ధర్మాత్ముడు అనగా ధర్మాన్ని అనుసరించే వాడు, నీతిమంతుడు, సత్యవంతుడు,పుణ్యాత్ముడు, ధర్మాన్ని, న్యాయాన్ని నిష్ఠగా ఉంచుకునే వ్యక్తి.తత్ర అనగా అక్కడ,ఆ స్థానంలో. దేవోపి అనగా దేవి + ఉపి.దేవుడు కూడా అని అర్థము.
ధర్మాత్ముడు ఎక్కడ ఉంటే దేవుడు కూడా అక్కడ ఉంటాడు అని అర్థము.
ధర్మాత్ముడు అనగా ధర్మము,ఆత్మ అనే పదాల కలయికతో ఏర్పడిన పదము.ధర్మాత్ముడు అనగా ధర్మ నిరతుడు,ధర్మ నిష్ఠాగరిష్టుడు,ధర్మ నిష్టుడు,ధర్మావలంబి అని ధర్మాత్ముడిని పిలుస్తారు. మరి అసలైన ధర్మాత్ముడు ఎవరో తెలుసుకునే ముందు ధర్మం అంటే ఏమిటో దాని గురించి కూలంకషంగా తెలుసుకుందాం.
ధర్మం అంటే నీతి,నియమం, ఒకరు వేలెత్తి చూపడానికి వీలులేని చట్టమని చెప్పుకోవచ్చు. ధర్మంలో నాలుగు రకాలైన ధర్మాలు ఉన్నాయని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. అవి 1. స్వధర్మం.2. సనాతన ధర్మం3.వర్ణ ధర్మము 4. ఆశ్రమ ధర్మము.
1.స్వధర్మము అనగా వ్యక్తిగత ధర్మము.వ్యక్తిగా జీవితంలో అనుసరించవలసిన ఏకైక మార్గం.ఇది వ్యక్తిలోని ఔన్నత్యాన్ని పదిమందికి చాటే గొప్ప ధర్మము.
2. సనాతన ధర్మము అనగా ఇది సమాజంలో ప్రతి వ్యక్తి ఆచరించాల్సిన ధర్మము. దీనినే సార్వత్రిక ధర్మము అని కూడా అంటారు. ఇందులో జాలి,దయ,కరుణ, అహింస లాంటి మానవీయ విలువలు ఉంటాయి.
3.వర్ణ ధర్మము అనగా హిందూ మతములో ఉన్న నాలుగు వర్ణాలు. అనగా వారు చేసే కార్యాలు,వృత్తులను బట్టి బ్రాహ్మణులు ,క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజించడం మనందరికీ తెలిసిందే.ఇవి రాను రానూ వర్ణ వివక్షతకు దారితీయడం జరిగింది.అలాంటిది కూడదని పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. తద్వారా నేడు ఎవరికి నచ్చిన వృత్తి లేదా పనులు చేస్తూ ఉండటం మనం గమనించవచ్చు.
4.ఆశ్రమ ధర్మము అనగా ఒక వ్యక్తి తన జీవితంలో మారుతున్న దశను బట్టి హిందూ మతము దీనిని ఆశ్రమాలుగా విభజించింది.1. బ్రహ్మచర్యం - ఇది విద్యార్థి దశ. 2.గృహస్థాశ్రమము అనగా వివాహం చేసుకుని కుటుంబంగా జీవించడం.3. వాన ప్రస్థ అనగా అడవులకు వెళ్ళి సంసార జీవితానికి దూరంగా ఉండటం.4. సన్యాస అనగా అన్నింటినీ పరిత్యజించి సన్యాసిగా జీవించడం.
ఈ విధంగా ఈ నాలుగు ధర్మాలు పలు రకాలైన అంశాలతో ముడిపడి ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు.ధర్మ నిరతి అనేది అప్పటికే, ఇప్పటికే, ఎప్పటికీ మారనిది.
ధర్మానికి అంకితమైన వ్యక్తిని, ధర్మం తెలిసిన వ్యక్తి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ధర్మరాజు. ఎంతో ధర్మ నియతిగా, నిజాయితీగా ఆచరించాడు అని ఆయనకు పేరు వుంది.అయితే మహాభారతంలో పాత్రలను ఉద్ధేశించి ధర్మానికి అంకితమైన వాడిగా విదురుడిని చెప్పుకోవడం విశేషం.
విదురుని పేరుతో విదుర నీతి అనే గొప్ప గ్రంథము కూడా వచ్చింది. దానిని విదుర నీతి అంటారు.విదురుడు క్రాంత దర్శి.మహాభారతంలో దుర్యోధనుడి గురించి అతడు పుట్టగానే చూసి అతడి చేతిలో రాజ్యం పెడితే నాశనం అవుతుంది అని చెబుతాడు.లక్క ఇంట్లో ఉన్న పాండవులు సురక్షితంగా బయటపడేలా చేస్తాడు. ఇలా ధర్మానికి సంబంధించిన విషయాలను చెప్పిన వ్యక్తి అతడు.
ఇక అలాంటి ధర్మాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు అక్కడ ఉంటాడు అనడానికి కారణం.అతడు ఉన్న చోట అధర్మం, అన్యాయం,అక్రమము లాంటివి జరగకుండా ఉంటాయి. ధర్మం నాలుగు పాదాలతో నిశ్చింతగా నడుస్తుంది.
ధర్మము అనేది ఒక కర్మ.దానికి చైతన్యం,సమర్థత ఇవ్వగలిగే వాడు ఈశ్వరుడు లేదా భగవానుడు.ఆయన కర్మ ఫలదాత.ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం తనను తాను ఆవిష్కరించేందుకు ఉంటాడు.ధర్మం తెలిసినంత మాత్రాన ధర్మాత్ముడు కాలేడు.దాన్ని ఆచరించిన వాడే ధర్మాత్ముడు.ప్రాణం పోయేంత వరకూ ధర్మానికి కట్టుబడి జీవించే వారు ఉన్న చోట దైవం ఉంటుంది.
పాండవుల వద్ద ధర్మం ఉంది వారు ధర్మాత్ములు కాబట్టే దైవం వారి వెంట, వెన్నంటి ఉన్నాడు. ధర్మాన్ని విడిచి పెట్టడం వల్లే రావణాసురుడు రాముని చేతిలో హతమయ్యాడు.
ఈ విధంగా ధర్మాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ దైవం ఉంటాడని ఈ న్యాయము లోని అంతరార్థము.అది గ్రహించి మనం నడుచుకుంటే దైవం ,దైవబలం ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి