భారతదేశంలో మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకు తీవ్రమవుతోంది. యువతలో మత్తు పదార్థాలపై ఆసక్తి పెరగడం, పట్టణాల నుంచి గ్రామాల వరకు డ్రగ్స్ సులభంగా లభించడం, భౌగోళికంగా భారత్ రెండు ప్రధాన మత్తు పదార్థాల ఉత్పత్తి ప్రాంతాల మధ్య ఉండటం వంటి అంశాలు దీనికి కారణాలు. పశ్చిమాన గోల్డెన్ క్రెసెంట్, తూర్పున గోల్డెన్ ట్రయాంగిల్ దేశానికి సమీపంగా ఉండటం వల్ల అక్రమంగా డ్రగ్స్ ప్రవేశించే అవకాశాలు పెరిగాయి. కుటుంబ వ్యవస్థల బలహీనత, మానసిక ఒత్తిడులు, మిత్రుల ప్రభావం, జీవితంలో నిరాశ వంటి కారణాలతో యువత ఈ మత్తు పదార్థాల వలలో పడుతున్నారు. నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా డ్రగ్స్ సులభంగా లభించడం, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న యువత ఖర్చు చేయడానికి డబ్బు ఎక్కువగా ఉండటం కూడా వినియోగాన్ని పెంచుతున్నాయి. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. హృదయ, ఊపిరితిత్తులు, కేన్సర్, మానసిక రుగ్మతలు, ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులు వస్తున్నాయి. కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి, నేరాలు, హింస, ఉద్యోగ నష్టం, ఆర్థిక భారం పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. దేశ అభివృద్ధికి ఇది పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ణ్డ్ఫ్శ్ చట్టం వంటి కఠిన చట్టాలను అమలు చేస్తోంది. నషా ముక్త్ భారత్ వంటి ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సరిహద్దుల్లో భద్రతను పెంచడం, పోలీసు, ఎక్సైజ్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అయితే, సమస్యను పూర్తిగా నిర్మూలించాలంటే పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన పెంచాలి. కుటుంబ సభ్యులు పిల్లలపై శ్రద్ధ చూపాలి. బాధితులకు పునరావాస కేంద్రాల్లో చికిత్స, మానసిక సహాయం అందించాలి. అక్రమ రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలి. భారతదేశ భవిష్యత్తు కోసం మత్తు పదార్థాల ముప్పును సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. యువతను రక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
మత్తు పదార్థాల వినియోగం అనర్ధదాయకం:-సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి