లష్కర్ బోనాలుగా పిలిచే కొమరవెల్లి జాతర:-: V.లక్ష్మీనారాయణ. స్కూల్ అసిస్టెంట్( తెలుగు) జడ్.పి.హెచ్.ఎస్ రాయిలాపూర్.

  కోరుకున్న వారికి కొంగు బంగారంగా పిలవబడే కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని ఇక్కడి ప్రాంతం వారు ముద్దు పేరుగా "మల్లన్న" అని పిలుస్తారు.
      ప్రస్తుతం నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2016 అక్టోబర్ 11న ఏర్పడ్డ సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ఉంది.
#ఆలయ విశేషాలు:-
--------------------------
     పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అంటారు. అందుకే ఈ ప్రాంతానికి "కుమార వెల్లి" అనే పేరు వచ్చి కాలక్రమేనా కొమరవెల్లి అయిందంటారు. పరమశివుడు ఇక్కడే తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి- నీలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలుపు తీరాడు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలవబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక కంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవతలు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ,లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడ్డది.కానీ ఇప్పుడు ఆ విగ్రహం శిథిలం కారణంగా దాని స్థానంలో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో భక్తుల రాక ఎక్కువ కావడంతో ఈ దేవాలయంలో అనేక మండపములు, నూతనంగా కట్టడాలు నెలకొల్పబడ్డాయి.
  #జాతర విశేషాలు:-
    -------------------------
       ఇక్కడి జాతర జనవరి నెల అనగా మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది మరియు బుధవారాలలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ ముక్కులు ఎలా ఉంటాయంటే బోనాల రూపంలో, పట్నాల రూపంలో, ముడుపుల రూపంలో మరియు బండారి అనగా పసుపు పంచడం రూపంలో ఉంటాయి. ఈ బోనాలను లస్కర్ బోనాలుగా ఇక్కడి ప్రాంతం వారు పిలుచుకుంటారు.ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం సమర్పించడం చూడవచ్చు. ఈ కొత్త కుండలో నైవేద్యం అంటే అన్నం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఇక్కడి వాయిద్యాలు మనం పరిశీలించినట్లయితే ఢమరుకం ప్రధాన పాత్ర వహిస్తుంది. వారు పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీరిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. మీరు పసుపుపచ్చని అంగీలు ధరించి, ధోవతి కట్టుకొని ఒళ్లంతా పసుపు పూసుకుని చేతిలో జగ్గు పలక పట్టుకుని ఢమరుకం వాయిస్తూ జాతర ప్రాంగణంలో అందరు తిలకించినట్లుగా కనువిందుచేస్తారు. జాతర చివరలో పెద్దపట్నం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు మరియు వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇందులో పాల్గొంటారు. విశాలమైన ముక్కులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జెగ్గులు, వాయిస్తూ దేవున్ని కీర్తిస్తారు. వీరశైవ పూజారులు వీరభద్రున్ని, అదేవిధంగా భద్రకాళిని పూజించి సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రాకారం ఏర్పరిచిన స్థలంలో టన్నుల టన్నులకద్దీ కర్రలను పేర్చి అంటే మంత్ర బద్ధంగా అగ్నిప్రతిష్ట చేస్తారు. తెల్లవారుజాములో ఆ కర్రలన్నీ చండ్ర నిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా నేర్పి, కణకణ మండే నిప్పుల మధ్య నుండి మూడుసార్లు స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు ఈ కార్యక్రమాన్ని లేదా ఈ తంతును అగ్నిగుండాలు దాటడం అంటారు. మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ రేణుక ఆచార్యఉపాలయం కూడా ఉంది. దీన్నిశ్రీ దేశుక ఆచార్య, వీర శైవ మత స్థాపకులు మరియు ప్రచారకులు ఏర్పాటు చేశారుట. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత అనబడె కొండ పోచమ్మ ఆలయం ఉంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా పిలుస్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సందర్భంగా చేరుకొని నీ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ ప్రస్తుతం కొమురవెల్లి పోచమ్మ రిజర్వాయర్ కూడా చూడవచ్చు. అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచె అమితశక్తి స్వరూపిణి.

కామెంట్‌లు